December 23, 2021

ఇది నరసింహ ఆత్మీయులు,  బంధుత్వం కలిగిన వారు, ఏదో ఒక విధమయిన సంబంధం కలిగినవారు, తెలిసినవారు అందరి మనస్సుల్లో మెదిలిన అభిప్రాయం,  వాంఛ.
అక్షర రూపం మాత్రమే నాది.


     మనీషి . 


వేలమందికి వైద్యం చేసి ఉసురుపోసే మహిమ
వందలమందికి విద్య నేర్పి దారిచూపే గరిమ
వాక్చాతుర్యంలో పటిమ
విరించి అత్యంత శ్రద్ధతో ఊపిరూదిన ప్రతిమ.

స్వయంరోగనిదానం చేసుకోగల
అసహాయమేథావి
చిరునవ్వుతో సదా అలంకృత పెదవి
బంధుప్రీతిలో సర్వ జనులకు హితుడి పదవి
స్నేహగంధపు పూల తావి

దైన్యంలో  శూన్యంలో  ఆలంబన
వేదనలో  రోదనలో  సాంత్వన

ఉచ్ఛ్వాస నిశ్వాసాలకు  ఆశ్వాసం
ఆతిథ్యమిస్తే  భుక్తాయాసం
ఆనందాలకు ఆహ్లాదాలకు ప్రోత్సాహం
అలుపెరుగని ఉత్సాహం

వెన్నుదన్ను పట్టుకొమ్మ అండదండ.
అలసినపుడు  చేరబడే రత్నపుగోడ
సొలసినపుడు సేదతీర్చే శీతోష్ణాల నీడ

చెడు తలపే తన ఊహలో మెదలదు
మంచి చేసే తాపత్రయం వదలదు
కూడగట్టిన పుణ్యం ఊరికే పోదు
కట్టుగట్టి  వెంటనంటి  చెదరదు

మంచికి మద్దతుదారు
దారి తప్పనివ్వని కాపలాదారు
కోహినూరు

కాదిది ప్రశంస
తనో జనంలోని పరమహంస
సత్యం సత్యం తనో ఆణిముత్యం

కల్పవృక్షం   సర్వజనంస్వపక్షం
విశ్వపరిచయం చేసే విశాల గవాక్షం.
పొగడ్డం అశక్యం.
వెలకట్టలేని మాణిక్యం

స్థితప్రఙ్ఞుడు  కృతనిశ్చయుడు
అజాతశత్రువు కామధేనువు,

నరసింహం నిగ్రహవిగ్రహం శాంతిగృహం
తనతో సంభాషణం తీరని దాహం.
తన సాహచర్యం దప్పితీర్చే అమృత ప్రవాహం.

సకలజనబాంధవుడు
శింగంపల్లి వంశాశ్రిత మాధవుడు.
మావాడు మనవాడు అందరివాడు.

మా అందరి ఆయుష్షు పోసుకొని
వజ్రకాయం చేసుకొని
చిరంజీవి  కొనసాగించాలి నిరాటంక నిరంతర పయనం .
పరంజ్యోతి  మా ఆయుర్దాయం పెంచే దైవశాసనం సాధనం.
    
    
    


November 26, 2021

Kids Against Hunger

Hi, I am back with another post. We started volunteering about 3 years back during holiday season. This year we volunteered at Kids Against Hunger. Yesterday my dad found this opportunity to volunteer at the Pleasanton location. You can find more information about the program here. To further know about the volunteer opportunities in Bay Area you can find information here .

We went to volunteer with a group of 35 people. There were a few kids in our group. Once all the volunteers arrived, we walked into a large room. We were all given hair caps to make sure that hair doesn't fall in the meal packs while packing. We were also asked to sanitize our hands and wear gloves. In the room there were 8 tables with different boxes, weighing scales, funnels, hot press and measuring cups. We were all assigned a role based on our age.

Before the packing began the organizer described the process. There are 5 stations

  1. Funnel Station
  2. Food Station
  3. Weighing Station
  4. Sealing Station
  5. Packing station

The process of packing starts from the funnel station. On our table there were 2 boys (including myself) and we were in charge of this. Our job is to open the bag and put the funnel inside the bag and hold it tight so that the people at the food station can put 1 cup of Soy ( protein) ,1 tbsp of dehydrated vegetables ( minerals and also flavor), 1 tbsp of milk powder ( calcium and iron) and 1 cup of rice (carbohydrates). Once all these are added in the bag we take the filled bag to the weighing station and leave it in the stand and we move on to the next bag.

Next, the weighing station volunteers weighs the bag to make sure it is between 390 and 396 grams. After the weighing station is done weighing the meal bag is moved to the sealing station. Here the bags are sealed using hot press. This is one station where kids are not allowed to work. Once the bags are sealed they are packed into boxes. Each box contains 36 meal kits. Lastly, all the packed boxes are transported in shipping containers to areas where there is a need. One bag can provide a meal for 6 people !! Isn't that amazing!?

During our break time they showed us a video about how the program started and the real impact of this program. It was a 5 min video we saw how the food is transported to Haiti and how it is distributed. In the video I saw kids of different age groups eating the food that was cooked, with out complaining. It made me feel thankful for what I have. If time permits I want to volunteer once a month to help this cause.

By the end of the session we packed an eye popping 9936 meals that are going to be sent to Haiti or any other place that has a food shortage. Each table made an average of 150 bags of food.

I hope that one day we will be able to eradicate hunger in the world. I understand that it is a long way to go, but as the Chinese philosopher Lao Tzu said " A journey of a thousand miles begins with a single step". It was a great learning experience and I am thankful that I got to be a part of this effort.

I am the one in the front row in the Blue Adidas jacket. Mom and dad are one row behind me. 

Mom, Dad and Myself at the table




August 27, 2021

 ఆరాధన
నీకు  పదేపదే  సాయం చేస్తే  కరుణ చూపితే రుణపడతావనుకున్నా  
ప్రేమలో పడతావనుకున్నా.
సంకల్పించిన ప్రతిసారి సున్నితంగా తిరస్కరించిన   ఆత్మవిశ్వాసం చూసి
సాయాపేక్ష లేక రమారమి నిష్కామినయ్యా.

అందంగా కనపడితే నీలో అనురాగం పుట్తుందనుకున్నా.
నీ ఆత్మసౌందర్యాన్ని అవలోకించి అవగాహించి  అరాధకుడినయ్యా.

దుఖం రప్పిస్తే సాంత్వనకోసం నాభుజం ఆసరా అవుతుందనుకున్నా.
నీ మనోధైర్యం పరికించి శోకరహితుడినవుతున్నా.

ఆగ్రహం రప్పించి  నిగ్రహం తప్పించి శాంతివచనాలు గుప్పించి చేరువకు చేరాలనుకున్నా.
ప్రశాంత అయస్కాంతంలా "ఆకర్షించి" సంతులనం నేర్పించావు.

నవ్విస్తే  సంతోషపెట్తే నన్ను ప్రేమిస్తావనుకున్నా.
అ"ధర"   దరహాస సోయగం  చూసి మురిసిపోయా
ప్రేమసాగరంలో మునకలేసి అలసిపోయా .

అర్థించి  ప్రార్థించి  ప్రేమను పంచమని వేడుకోలు తో వశం చేసుకుందామనుకున్నా.
స్వార్ధించి ఆర్జించటం   మంచికాదని వంచన వదలి వీడుకోలు  చెపుదామని వచ్చా.

ఎదురు చూసింది నిష్కర్షగా నిర్దయగా దిక్కులు పట్టి పొమ్మని చీదరింపు.
ఎదురైంది నిష్కల్మషంగా నిర్మలంగా అక్కున చేర్చి రమ్మని ఆదరింపు.

ఏ దేవుళ్ళో కరుణించారని వరమిచ్చారని అరక్షణం ఆలోచించా.
ఆ దేవత నీవేనని  మరుక్షణం గ్రహించా నీ వశమై  అనుక్షణం పరవశించా.

నీకే మనస్కరించి నువ్వే సంస్కరించి పురస్కరించావు.
ఏమివ్వను? ఏమీ ఇవ్వను.ఇవ్వలేను.నమస్కరిస్తా.

అల్పాన్ని శిల్పంగా మార్చిన ఉలి పట్టిన  స్థపతి ఈ నెచ్చెలి.
చెదపట్టిన మదిలో మంచిని ఎంచి గుడిగా మలిచి నిలిచిన  దేవి నా చెలి.
    
    
    

 మరో( నో) ప్రపంచం.


ఇసకలో గుండ్రంగా గునగున లక్ష్మి   కోపంగా ముందర  నడుస్తోంది .  సిలిండరు, లడ్డుండ ముద్దుపేర్లు తలుచుకొని నవ్వు ,ఆయాసం కలిపి నడుస్తున్నా. బస చేసిన తాజ్ హోటల్ కి తిరిగి వెళ్ళే దారి తెలియట్లా. ఇంత ఉదయాన్నే జనం ఎవరూ కనపడట్లా. రూమ్ నంబరు తను గుర్తుంచుకొని , నేను దారి గుర్తుంచుకునేలా పని ఎప్పట్లానే సమానం గా పంచింది .

ఎవరో తెల్లని లాల్చీ పైజమా గారు  అక్కడ కూర్చుని ఉన్నారు. మమ్మల్ని చూసి పలకరింపుగా నవ్వారు.
చిన్నప్పుడు హిందీ ప్రాథమిక చదివింది. సమయం దొరికితే హిందీ వాడటం మహా ఇష్టం.
తన హిందీ భాష ప్రయోగం మొదలెట్టింది. ఇక వినండి.
ఈవిడ ::--- ఆప్  హిందూవాలా హై? తాజ్  కైసే  జాన్?
  వారు ::---   షాజహాన్.
  నా ఖర్మకి ఆయన సమానమయిన తెలుగు ప్రతిభాపాటవ ప్రయోక్త.

  వారు ::--- మీరు తెలుగు ఉండా?
(ఉందా  కామోసు.ఇంకా నయం లడ్డుండా  అనలేదు.ఈవిడ కొద్ది రోజులు తెలుగు టీవీ సీరియల్స్ కి కథలు ,స్క్రీన్ప్లే రాయాలని ట్రై చేసింది.నిన్న రాత్రి రూమ్ కి రావడం ఆలస్యం అయితే తాగి,తులిశాకులు నమిలి వచ్చావందిరాత్రి గ్లాస్ మేట్ వీడే. నువ్వే ఆ పేరు చెప్పావ్ అని  1000 ఎపిసోడ్ల ధారావాహిక  నడిపిస్తుంది. )


ఈవిడ  ::--- ఆప్  "మేరీజాన్"  కైసే?
( తెలుగని ఎలా గుర్తు పట్టాడని ఉత్సాహ కుతూహలాలు.)
వారు ::--- మీ ముకం చెప్పు గా
              బాబోయ్  ఈ భీషణ భాషణం ఆపాలి. 

Do you know Taj hotel sir? We lost the way. I think we walked almost 5 miles .


వారు ::--- సోమిగాడా.
( ఏమిటీ!! నా పేరు సోమరాజు అని ఇతనికి ఎలా తెలుసు. రాత్రి తులిశాకు కథ నిజమా.అంత చనువిచ్చానా.)
నేను ::--- క్యా?!!!
వారు ::---   దగ్గాడా
నేను ::--- what are you talking ?
వారు ::--- I  said cheater.  (మోసగాడా  దగాగాడా) . ఝూట్ బోల్ రహే హో
                (చెయ్యి చూపించాడు వెనక్కి.  అది హోటల్ వెనక భాగం కాబోలు .)
                మాడం యహీఁ సే గుజర్ తీ హై. చక్కర్ లగాకే  ప్రయాస్  కర్కే వాపస్ ఆతీ హై. Five miles?
ఈవిడ ::---గుజరాతీ  నహీఁ ఆంధ్రా .  పాయసం నహీఁ.
                డయాబెటిస్ వల్ల  ఆయాసం , ఏనుగూ నహీఁ  . మీరు చెప్పండీ వెధవకి.
వారు ::--- వెధవ?
నేను ::--  వెధవల్  మీన్స్ కోర్ట్స్ ఇన్ లాటిన్. యూ కెన్ ఆస్క్ గిరీశం.
వారు ::--- జాన్ గ్రిషాం చెప్పా ? సరే పోయింది.
స్వగతం ::--  నా ప్రాణం ,  మతి త్వరలో పోతాయి.
              ఇక మొత్తం తెలుగులోనే చెప్పుకుందాం.  ఈ బాధపడే భాగ్యం ఎందుకు కలిగిందో మీకు చెప్పాలి.
                  " పండగ డిస్కౌంట్స్  మాయా మాల్ లో బాగా    ఇస్తున్నారటండీ. లక్కీ డ్రా  కూడా అట. " అంది మా
ఆవిడ నేను ఇంట్లో అడుగు పెట్టగానే. ఈ కథంతా అక్కడ ప్రారంభం అయింది.  "ఆఫీస్ నుంచి  వచ్చినట్లే లేరు. ఎంత ఫ్రెష్ గా ఉన్నారో." అంటే అర్థం వెంటనే బయల్దేరండి.
                తనవంతుగా "చిన్నప్పుడు  మూడు నెలలకో సబ్బు ఇచ్చేదాన్నమ్మాయ్ వీడికి " అంటోంది అమ్మ. అందుకే స్కూల్లో  మిగతా వాళ్ళు ఇరుక్కొని కూర్చొని  నాకు ప్రత్యేకంగా ఒక టేబుల్ ఇచ్చేవారు అని గొణుక్కున్నా.
             " నీకు మాత్రం నెలకు రెండు సబ్బులిచ్చేదే మీ అమ్మ . పొట్టిగా, నల్లగా ఉండేదానివి కదా"
             "అప్పుడేదో చిన్నవయసు ,తెలియని తనం అత్తయ్యా " అని భారంగా , ఘోరంగా సిగ్గు పడింది. మెలికలు  తిరిగే ఛాన్స్ మాత్రం లేదుగా.
"ఇంటిల్లిపాదికీ తమ్ముడు  బట్టలు పంపించాడండి. దానికి మరికొన్ని కొందాం. కాలేజ్ కి వెళ్ళే పిల్ల కదా."
కాలేజి అంటే ఫాషన్ షో నా?  పీరియడ్సా . బట్టల పెరేడ్సా? మాటలు గొంతు లోనే కుక్కేశా.
"పాప రాదా మనతో బట్టలు సెలక్ట్ చేసుకోవడానికి?"సమాధానం తెలిసే అడిగా.

 "ఇంటర్మీడియెట్ అండీ.  అదీ.ఇంటర్మీడియెట్. క్లాత్ కొంటా.కొలతలకి ఇంటికే
వస్తాను అన్నాడు రామారావ్."
              గుండె కూడా తుమ్మితే క్షణం ఆగుతుందట. ఇండియాలోచదువుకునే పిల్లలకు మాత్రం విశ్రాంతి అంటే తెలియదు నిరంతరం తిరిగే గ్రహాల్లా,సముద్రపు అలల్లా.


            " 1004/-- . అయింది మాడం. ( ఆడవాళ్లను మీరు అనే కంటే మేడమ్  అంటే పులకిస్తారనే సైకాలజీ  కాచి వడపోశాడు) . వెయ్యి రూపాయలకి ఒక కూపన్. మరో 996 కొంటే ఇంకో కూపన్ వస్తుంది. మీరు , సారూ బట్టలు చూడండి. మగాళ్ళకయితే రెలియన్సా, రేమండ్సా , ఇంకోటా కొంచెమే ఛాయిస్.  లేడీస్ కయితే ఉప్పాడ ,కోట, చందేరి , కంచి  మరెన్నో వెరైటీలు.  ఒకటి కట్టినప్పుడు లావుగా,మరోదాంట్లో పొట్టిగా,పొట్టగా లేదా సన్నగా ఉంటామని భయం.మీరు ఫర్లేదు. ఏదయినా నప్పుతుంది మాడం . ధర్మవరం కొత్త స్టాక్  వచ్చింది మాడం. చూడండి.  (ధర్మవరమా!  పోలవరం పూర్తి అవుతుంది ఆడవాళ్ళంతా ఒక్క సంవత్సరం వీడి బారిన పడక పోతే.). మీకు అన్నీ భలే బాగుంటాయ్."
"తమ్ముడూ మీ ఇల్లెక్కడ? "
పక్కన ఆడుతున్న కోతి పిల్లని పిలిచి  కడుపుకు కరుచుకునే  కోతి లా కనపడింది మా ఆవిడ.
" కైలాసపురం మేడం."
" ఆవకాయ తింటావా. పెట్టారా పచ్చళ్ళు. ?"  ఆర్ద్రత గా ఈవిడ.
" మధ్య తరగతి కూడా కాదు కదా అక్కా  . డబ్బేది?  భార్యకి ఆవకాయ ఇష్టం. నాకు మాగాయ అమ్మకి నిమ్మకాయ, నాన్నకి దబ్బకాయ."  ఆవేదన ,ఆక్రోశం  అన్నీ ఒకే సారి వాడి కంఠంలో  ,


ఎంత ప్రాక్టీసు తర్వాత పర్ ఫెక్షనో. కన్యాశుల్కం వెంకటేశం లాగా (గేదె పెరుగు చమే , చేగోడీ చమే) చమకం చదువుతున్నాడు వీడు.
" రాత్రి ఇంటికి వెళ్ళేటప్పుడు రా. నీకు , మరదలికి, అమ్మకి  ,నాన్నకి పచ్చళ్ళిస్తా. "
"మీ దయ ,జాలి ,అభిమానం చాలా గ్రేట్ అక్కా.   కర్ణివా ,బలిణివా,  శిబిణివా, దధీచిణివా, థెరిసావా."
"భర్తభక్షిణిరా దుర్మార్గుడా" స్వగతం.
" తమ్ముడు.  జనరల్ గా ఎక్కువ మాట్లాడితే నాకు నచ్చదు. నువ్వు వేరు. ఉంటా. కలుద్దాం. "
ఒకే సమయం లో  ఒకే మనిషి  ఒక దేవతగా  ఒక  పిచ్చి దానిలా కనపడటం  ఒక్కోసారి ఓకే. పాసిబుల్.
" నోరు లేని వెధవ. అడగడం కూడా రాదు." .
                 హైనా ,  రాబందుల నోట్లో నించి  ,కొండచిలువ కడుపు లోంచి   వాటికి  తెలీకుండా మాంసంముక్క తస్కరించే మాయావి .భూత్ మహల్ ని దేవాలయం అని టికెట్ పెట్టి చూపించగల మేథావి.


            తను కదిలింది. అక్కడే తచ్చాడి , " ఈ సారి పచ్చళ్ళు అమ్మడానికి  రామోజీరావు గారిని  కలిసినప్పుడు సోమరాజు గారు అడిగారని చెప్పు."  చేతకాని కసి తో బుసకొట్టి వచ్చా.
చీరల సెక్షన్.  పక్క ఫ్యామిలీ వాళ్ళ   డ్రైవర్ వచ్చాడు.
" సార్ పెట్రోల్ రేట్ పెరిగింది. డబ్బులు సరిపోలేదు.  ఫుల్ గా కొట్టించాలంటే  మరో 500 కావాలి."ఇచ్చాడతను.
" ఎందుకయినా మంచిది. మరో 500  ఇవ్వండి. నేను ఇక్కడికొచ్చి  తిరిగి వెళ్ళే లోపు మళ్ళీ  పెరిగుండొచ్చు." డ్రైవర్.
" సర్. వీరికి పోయిన సారి లక్కీ డ్రా లో కార్ వచ్చింది. "  చీరల సేల్స్ మాన్ చెప్పాడు. పక్కకి తిరిగి కంగ్రాట్స్ సర్ అన్నా.
" పెట్రోల్ కీ , డ్రైవర్ శాలరీ కి కష్టమై ఇల్లు బ్యాంకు లో తనఖా  పెట్టా . ఈ సారి డ్రాలో ఇల్లు తగులుతుందని   షాపింగ్ కి తెచ్చింది సార్."  దీనంగా చెప్పాడతను.

చీరల సెలక్షన్, నా బట్టల సెలక్షన్ ,మరో రెండు పచ్చళ్ళ ప్రామిస్ ల తర్వాత 17560  బిల్ తో సెటిలయింది తను.
           సైంధవుడు పద్మ వ్యూహం లోకి వెళ్ళనివ్వడు. ఇక్కడి సెక్యూరిటీ గార్డు సైంధవుడు బయటికి  వెళ్ళనివ్వడు.
" మేడం కాస్మెటిక్స్ మరో 440 కి కొంటే మరో కూపన్. పాప చదువుతోంది కదా. కొనండి".
బిల్లుల మీద స్టాంప్ వేస్తూ,బట్టలు చెక్ చేస్తూ అరక్షణం లో అన్నీ ఆకళింపు చేసుకునే ప్రజ్ఞాశాలి . 20030/-- తో బయట పడ్డాం.
                     రాత్రి ఒక్కొక్కరు వచ్చి పట్టుకెళ్ళాక , తెల్లార్లు టాక్స్ అధికారులు బోర్డు , లైసెన్సు లేకుండా పచ్చళ్ళ వ్యాపారం చేస్తున్నానని దాడిచేసినట్లు మగత నిద్రలో పీడ కలలు.  చీమ చిటికేసినా , దోమ దగ్గినా, ఈగ ఈల వేసినా   ఉలిక్కిపడి  చచ్చా.  అవి కూడా వినబడని నిశ్శబ్దం ఉంటే తప్ప నిద్ర పట్టని పరిస్థితి. "గలగలమనగూడదు ఆకులలో గాలి జలజలమనరాదు.. అలలతో కొండవాగు " అనేంత భావుకత నా భార్యకి లేకపోవడమే కాదు  , గురక కూడా.
       నెలన్నర తర్వాత ఫోన్ , వాట్సప్ ,మెయిల్ ,మెసేజ్ అన్నీ వచ్చాయి.

 
          సోమరాజు గారు.
  " మీకు మా సంస్థ మీద ఉన్న ఆదరాభిమానాల వల్ల మనస్ఫూర్తిగా, ఆనందంగా చేసిన కొనుగోళ్లు మీ మా అభివృద్ధి కారకాలు. మీరు మా లక్కీ డ్రా లో  ఎంపికయిన విజేతలలో ఒకరిగా నిలిచారు. నలుగురు లేదా అంతకు లోపల (మీ) కుటుంబ సభ్యుల పేర్లిస్తే ,ముంబైకి రాను పోను టికెట్లు , మూడు నక్షత్రాల హోటల్ లో  బస భోజనవసతి.ముందుగా ఎంపిక చేసిన ముఖ్యప్రదేశాల సందర్శన కు  ఐదు రోజులు   (  తప్పనిసరి ప్రత్యేక పర్యాటక ఆకర్షణ   ఒకరోజు పూర్తిగా  అక్కడి మా మాయా మాల్ బ్రాంచ్ )  కారు ఏర్పాటు చేయబడతాయి. షాపింగ్,మరియు పేర్కొనని మిగిలిన ఖర్చులు మీవే. అభినందనలు.
షరా ::--- ఈ టికెట్లు, రశీదులు  కక్కుర్తిగా సమర్పించి తమ ఆఫీస్ లో. L..T.C.  రీఇంబర్స్మెంట్ తీసుకోరాదు.
                    " వీడెప్పుడూ అదృష్టవంతుడే అమ్మాయి. ఆయన వీడి అక్షరాభ్యాసం 20000 పెట్టి ఘనంగా చేస్తే , 100 పలకలు, 1000 బలపాలు వచ్చాయి "
" అత్తయ్యా  . మా పెళ్లి కి కూడా గోడ గడియారాలు , టైంపీసులు , టీ కాఫీ సెట్లు , దేవుడి పటాలు , మిల్క్ కుక్కర్లు , ఫోటో ఫ్రేములు , డిన్నర్ సెట్లు  కళ్యాణమంటపం నిండి పొయ్యాయి. మా నాన్న తెలివిగా గిఫ్ట్ షాప్ వాడిని పిలిచి  As and where they are  పద్ధతి లో , రవాణా ఖర్చు వాడిదే అని అమ్మి 10000 వస్తే  మాకే ఇచ్చారు. కొన్ని మిగిలితే  , దాచి , మొన్నటిదాకా పుట్టిన రోజులకి, పెళ్లిళ్ళకి, మిగతా  అన్ని ఫంక్షన్స్ కి  అందరికీ ఇచ్చాం కదా. "
                      " మీరిద్దరూ వెళ్ళిరండే అమ్మాయి. పాపను నేను చూస్తాలే. కాస్త వాడికీ గాలి మార్పు."    ఏర్పాట్లు చూసుకుని, అమ్మతో టచ్ లో ఉండమని స్నేహితులతో, పక్కింటి వాళ్లతో చెప్పి నిన్న ముంబై చేరాం.
                        ఈవిడ కఠినమైన డైటింగ్ లో ఉంది. కొంచెం భోజనప్రియురాలు.  రోజుకు అరవై సిగరెట్స్  కాల్చే వాడికి డాక్టర్  ఏదన్నా తినేముందు ,తిన్న తర్వాత కాల్చుకొమ్మని సలహా ఇచ్చాడు. వారం తర్వాత ఇంప్రూవ్మెంట్ బాగా ఉందే అంటే రోజుకు ముప్పై సార్లు  తినడమే కష్టంగా ఉంది అన్నాడట. ఈవిడకి భోజనం మానమని వేరే డైట్  చెప్పారు. ఉదయాన్నే  పావుకిలో మొలకెత్తిన పెసలలో వంద గ్రాముల వేరుసెనగ పప్పు , ముక్కలు చేసిన బెల్లం మాత్రం తిని కాఫీ తాగుతుంది. 11.30 కి ఏదో ఒక జ్యూస్. ఒంటిగంటకు ఒక  పుచ్చకాయ , సగం పనస, రెండు ఆరెంజెస్ ,ఒక పైనాపిల్ ,అరడజను అరటిపళ్ళు  వంటివి సీజన్లో పండ్లు లైట్ గా పుచ్చుకుంటుంది. సాయంత్రం కీరా , కేరట్ ముక్కలు ప్లేట్ నిండా ( సైజ్ అడగద్దు) , రాత్రి  చపాతీలు పప్పు. ఈ సారి డైటీషియన్  దగ్గరకి వెళ్తే మామూలు భోజనం పద్ధతికే మారిపొమ్మంటుందని నా దృఢనమ్మకం .
ఈ దినచర్యలో భాగంగానే మార్నింగ్ వాక్ పేరుతో పది అడుగులు అటూఇటూ వేస్తాం. ఇదీ ప్రస్తుతం.

                      చౌహాన్ గారు పది మాటలు మాట్లాడితే తొమ్మిది కొడుకు గురించే. ఉదయాన్నే తను వాకింగ్ కి , కొడుకు జాగింగ్ కి వస్తారు. తిరిగి  కలిసే ప్రదేశం ఇది. తను తెచ్చుకున్న ఫ్లాస్కునుంచి మాకూ కాఫీ ఇచ్చారు.
అక్కడే కూర్చుని కబుర్లు చెప్పుకున్నాం.  తనది వెండివస్తువుల వ్యాపారం. అందులోనే బట్టల దుకాణం.దుబాయ్ లో ఉద్యోగం చేసి డబ్బు సంపాదించి వ్యాపారం మొదలెట్టి కోట్లు గడించాడు. తను దుబాయ్ లో ఉండగా భార్యా,కొడుకు ఉద్యోగరీత్యా ఆంధ్రా లో ఉన్న భార్య తల్లితండ్రుల దగ్గర ఉండటం తో  వారికి తెలుగు వచ్చు. వారి ద్వారా తను కొంచెం నేర్చుకున్నాడు.
        ఒకరోజు కొడుకు దగ్గర ఒక ఫోటో చూసింది భార్య. ఫోటో వెనకాల రాణి అని సంతకం. కొడుకుని నిలదీసింది.
రాణి ఎవరు ?
రాజు భార్య.
రాణీ ఎవరూ?
ఎవరా రాణి?
రాణెవర్రా?
రాణెవరు?
ఎవరు రాణి?
ఎవర్రాణి?
ఈ రాణి. (ఫోటో చూపించి.)
ఆ రాణా.  రాణి.
అదే రాణి ఎవరూఊఊఊ.
అదే రాణి కాదు. అందానీ రాణి. నా ఫ్రెండ్.
(మా ఆవిడ నా చెవులో  " అంబానీ,అదానీ,అద్వానిల బంధువు" అని తీర్మానించేసింది)

చౌహాన్ గారు మధ్యలో దూరి వివరాలడిగి ప్రేమ పెళ్లికి  ఒప్పుకున్నారు .  త్వరలో పెళ్లిమాటలకు వెళ్ళాలి. కొడుకు పొడగరి,సొగసరి, గడసరి ,అన్నింటిలో నేర్పరి.
              ఇంతలో డ్రైవర్ తీసుకెళ్ళడానికి వచ్చాడు.  బాబు రాలేదని చూస్తుంటే, తన కార్ లో అప్పటికే వెళ్ళిపోయారని చెప్పాడు. మాకు తన కొడుకుని గర్వంగా పరిచయం చెయ్యలేకపోయిన బాధ కనిపించింది.

       రోజూ మాయా మాల్ వారి  కార్  ఉదయం 9.30 కి వస్తుంది. రాత్రి 8.30కి దింపేస్తుంది. ఉదయం ప్రతిరోజూ కలుద్దామని నిర్ణయం.  రెండు గంటల పరిచయంలోనే సన్నిహితుడు అనిపించే వ్యక్తి.
     
      ఆ రోజంతా ఊరెరిగింపు జరిగి అలసిపోయినా మర్నాడు ఉదయాన్నే లేపి లాక్కెళ్ళింది. మార్నింగ్ వాక్ కన్నా ఆయనను కలవాలని ఆత్రుత. వెండి మరియు బట్టలు కదా. డ్రైవర్ వచ్చి  , వీళ్ళు బయల్దేరాక , అమ్మ గారు  చిన్నబాబు గారిని ఎయిర్ పోర్ట్ కి మేనమామ ఫామిలీని తీసుకురమ్మని పంపారని చెప్పి అందరి ఉత్సాహం నీరుకార్చాడు.మర్నాడు బాబు కలవడానికి రాకపోవడానికి మరో కుంటిసాకు. చౌహాన్ గారు కూడా కొంచెం చిరాకుతో కూడిన ఇబ్బంది పడ్డారు.  ఈ మధ్య కాలంలో  ఆయన చాలా దగ్గరి వాడయ్యాడు. పరిస్థితి గమనించి , తేలికపరచటావికి రాత్రి భోజనానికి పిలిచా..
దారిలో ఈవిడ భార్యకొడుకులకి ఆయన మీద చులకన భావం అని నిర్ధారించేసింది.

                    రాత్రి ఆయన వచ్చాక పిచ్చాపాటి----
" భోజనానికి ముందు స్పిరిట్  హైస్పిరిట్స్ లో ఉంచుతుంది "
" ఈవిడ  ఫైటింగ్ స్పిరిట్ తో ఈవిల్  స్పిరిట్ గా మారి దంచుతుంది"
" మరేంచేద్దాం?"
" సాఫ్ట్ డ్రింక్ లేదా జ్యూస్ మంచిది. విస్కీ రిస్కీ."
" అరే !! అతను రష్యన్ కనుక అలా చెప్పాడు. తర్వాత వోడ్కా మంచిదని చెప్పుంటాడు."
                   ఒక నిమిషం దీర్ఘంగా ఆలోచించి  " ఇతను డోస్టోయెవిస్కీ తమ్ముడో, దగ్గరి బంధువు అయి ఉంటాడు " అని రహస్యాన్ని ఛేదించారు.
                    విస్కీరిస్కీ కమ్యూనిస్టు , తను కాపిటలిస్ట్ కనుక రెండూ వేరు వేరు సిద్ధాంతాలని, ఎప్పుడయినా సరే రెండింటినీ  కలపటం మంచిది కాదని,  బీరు విస్కీ రెండిటినీ  కలపమని సెలవిచ్చారు . పడుకోవటం  రాత్రి  రెండింటికి  కనుక మర్నాడు కలవటం కుదరదన్నారు. ఐదో రోజు సాయంత్రం ప్రయాణం కనుక ఆరోజు తప్పకుండా తమ షాప్ కి రమ్మని ఆహ్వానించారు.
      
               మర్నాడు ఉదయం మద్యపానం, ధూమపానం, జరదా వంటి దుర్వ్యసనాలు, వాటివల్ల జరిగే నష్టాలు ,చక్కటి ఉదాహరణలతో వివరించే ఉపన్యాసం ఏకధాటిగా గంటసేపు  వింటానని ,  రాత్రి ఇంటికి వెళ్ళేముందు చెప్పారు. ఆయన ఈ వ్యసనం నుంచి బయటపడాలని చేస్తున్న  బలమైన ప్రయత్నం హృదయాన్ని తాకింది.చలించిపోయాను.
           " వక్త ఎవరు సార్? ఎక్కడ సార్?"  గద్గదస్వరం తో అడిగాను.
           " మా ఆవిడ.  మా  పడగ్గదిలో " చెప్పి వెళ్ళిపోయాడు.
              
                        మర్నాడంతా మాయామాల్లో షాపింగ్.  వారి ఆతిథ్యానికి , గౌరవమర్యాదలకి ఈవిడ పూర్తి గా  ఉబ్బితబ్బిబ్బయ్యింది.  రెండు   క్రెడిట్ కార్డ్స్  లిమిట్స్  పూర్తిగా వాడేసుకుంది. జేబులో మిగిలిన కొద్దిపాటి డబ్బు అత్యవసరాలకు ఉండాలని, మా ఊరిలో విమానం దిగి ఇంటికి వెళ్ళడానికి క్యాబ్ ఖర్చు మనదేనని విభేదించి , వాదించి ,  నచ్చచెప్పి ,  బతిమిలాడి  బామాలి చివరికి ఒప్పించి  , ఊపిరి పీల్చుకున్నానని గర్వంగా  చెప్పగలను.   ఆస్థాన ఐంద్రజాలికుడు రంగప్రవేశం చేసి రెండువేల రూపాయలు మాత్రం వెంటనే చెల్లించి , ఎంచుకున్న వస్తువులను కొరియర్  ద్వారా ఇంటి దగ్గర  పొంది  ,  మిగతా డబ్బు అప్పుడు చెల్లించే సదవకాశాన్ని  అత్యంత విలువయిన ,  నమ్మకమయిన కస్టమర్లమయిన మాకు అందించాడు.  మా వినోదపర్యటన ఖర్చంతా , వడ్డీతో సహా లాగేశారని అనిపించడం నా దురాలోచనల   (దూరాలోచనలని నా అభిప్రాయం ) మెదడుకే సాధ్యమని ఆవిడ అభిప్రాయం .
         
             ఆఖరి రోజు రాత్రి   ప్రయాణం.   సొంత పనులకు కార్ రాదని, రాత్రికి ఎయిర్ పోర్ట్ లో దించడానికి మాత్రం వస్తానని మాయా మాల్  డ్రైవర్  చెప్పేశాడు.  ఉదయాన్నే కాఫీ తాగుతూ,  చౌహాన్ గారి షాప్ కి వెళ్ళడం గురించి మాట్లాడుకుంటున్నాం. రూమ్ బాయ్  సునీల్  , ఒక షిఫ్ట్ హోటల్ లో మరో షిఫ్ట్ క్యాబ్ డ్రైవర్ గా పని చేస్తాడట. పైగా  చౌహాన్ గారి డ్రైవర్ అతని తండ్రి. వారి ఇల్లు , కథా కమామీషు అన్నీ తెలుసుకనక తను తీసుకువెళ్లి,  అక్కడే ఉండి, తిరిగి తీసుకు వచ్చే బేరం కుదుర్చుకున్నాం.

  సునీల్  సడెన్ గా " మీది విశాఖపట్నం కదా సార్" అన్నాడు. 

 " అవును.  ఎలా తెలిసింది? "
" నిన్న సాయంత్రం  మీ చెప్పులలో , షూస్ లో ఇసక చూశాను.  నిన్న మార్నింగ్ వాక్ నించి వచ్చి శుభ్రం చేసుకున్నారు.  కాబట్టి  బీచ్ కి వెళ్ళారు. గవ్వలు , పూసలు , బీచ్ లో దొరికేవి ఏవీ కొనలేదు. అంటే మీకు బీచ్  అలవాటు. మీ ఊరిలో సముద్రం ఉంది. ఆంధ్రా నుంచి వచ్చారు తెలుగు కనుక. విశాఖపట్నం కంటే మంచి ప్లేస్ లేదు కదా సార్ "  అతని పరిశీలనకి ఆశ్చర్యం వేసింది.  మారు వేషంలో డిటెక్టివ్ కావచ్చు. 

 రాత్రి పూట టేపు, భూతద్దం , టూల్స్ , డార్క్ లాంటర్న్ తో  మారువేషంలో తిరుగుతాడేమో.  

శవాల మీద బెత్తం తో కొడితే తట్లు తేల్తాయా కోనన్ డొయెల్ సరిగా చెప్పలేదు అని అడుగుదామనుకున్నా.

 లక్ష్మి అంటోంది " మొన్న డస్ట్ బిన్  ఖాళీ చేస్తూ విమానం టికెట్లు చూశావుగా?" 

తమాయించుకోడం కొంచెం కష్టమయింది.
           
             దారిలో  వెళ్తుంటే,  అమ్మ గారిని చూస్తుంటే ఒక సినిమా నటిలా ఉందనిపిస్తోందని ,  పేరు ( సూర్యకాంతం? ఛాయాదేవి? కల్పనారాయ్? టున్ టున్  ?) గుర్తు రాని తన మతిమరుపును క్షమించమని చెప్పాడు. అయ్యగారి దర్జా ,ఠీవి చూస్తే గొప్ప ఉద్యోగస్తులో, పెద్ద వ్యాపారస్తులో అయి ఉంటారని గట్టిగా చెప్పేశాడు. దొంగ పొగడ్తలే కాకుండా అప్పుడప్పుడు వాస్తవాలు కూడా మాట్లాడ్తాడని చిన్న సదభిప్రాయం ఏర్పడింది. తను మామూలుగా ఎవరి దగ్గర టిప్స్ ఆశించడట. అమ్మ గారిని చూస్తుంటే ఏసుక్రీస్తు చెప్పినట్లు కుడిచేతితో చేసిన దానం ఎడమ చేతికి తెలియనివ్వని రకం అని తెలిసి పోయింది కనుక  , రూమ్ బాయ్ టిప్ ,క్యాబ్ డ్రైవర్ టిప్  విడివిడిగా ఎంతిచ్చినా తీసుకుంటానన్నాడు. నా భార్య మనసులో మెదిలిన  అమౌంట్ , టెలిపతీ ద్వారా వాడికీ  , నాకూ తెలిసింది అనటానికి తార్కాణాలు  వాడి ముఖంలో  సంతృప్తితో కూడిన  కనీ కనిపించని చిరునవ్వు , నాకు మాత్రమే వినపడిన  నా పళ్ళ పటపట శబ్దం.

          చౌహాన్ గారు స్పురద్రూపి. దబ్బపండు ఛాయ. స్వచ్ఛమైన మందహాసమే ఆభరణం. పక్కన ఆయన భార్య మిసమిసలాడే పాలరాతి  తెలుపు.  చేతులెత్తి దణ్ణం పెట్టాలనిపించే పవిత్రమైన అందం. మన మనసులోకి చొరబడి , నలుమూలలా  పరికించి చూస్తున్నట్లు నిశితమైన చూపు.

నాకెందుకో లోకంలో  పరుల కష్టాలు తమవిగా భావించి , కడదేర్చే మార్గాలు వెతికేవాళ్ళనెవరిని చూసినా గౌరవభావంతో పాటు, వాళ్ళ ముఖంలో నిర్మలత్వం మాటున చిన్న విషాదవీచిక గోచరిస్తుంది.
రాముడు, బుద్ధుడు , జీసస్,  పాత్రలు ధరించే నటులు తమ  ముఖంలో సున్నితమైన ,అంతర్లీనమయిన దుఃఖఛ్ఛాయలను, మార్దవమైన ఆర్ద్రతను మేళవిస్తే బాగుంటుంది అనిపిస్తుంది.

                          నాకు ఆవిడ ముఖంలో  కలుపుగోలు చిరునవ్వు , ఆప్యాయత తో పాటు అవన్నీ కనిపించాయి.  షాప్ లో  అడుగు పెట్టగానే  కనిపిస్తోంది , భార్యాభర్త  సోఫాలో కూర్చుని, కొడుకు  సోఫా వెనక  ఇద్దరి మధ్య నిల్చొని  , దిగిన నిలువెత్తు ఫోటో. ఆయన తన  కొడుకు గురించి ఇన్నాళ్ళు  చెప్పింది చాలా తక్కువ అనిపించింది.
          
             కొద్దిపాటి, తేలికపాటి పరిచయమే అయినావాళ్ళ ఆదరణ , మర్యాద అపురూపంగా అనిపించాయి.
" బాబు ఆడిటర్ ని వెంటబెట్టుకొని బేంక్  లోన్ పనిమీద వెళ్ళాడు. వచ్చేస్తారు. మీకు ఈ లోపల షాప్ చూపిస్తా"
అంది ఆవిడ. చూశారా, నే చెప్పాగా అని మా ఆవిడ కళ్ళతో మాట్లాడింది.  షాపంతా కలియతిరిగాక  ,  వారి నిరాడంబరతకు ఐశ్వర్యానికి  మధ్య వ్యత్యాసం మా ఆవిడ మతి పోగొట్టింది.

                       ఆయన మాత్రం మాతోనే కూర్చున్నా ,తను షాప్ అజమాయిషీ చేస్తూనే ఆతిథ్యం అందించింది.  మేము బయల్దేరుతామంటే భోజనం ఇక్కడే అని బలవంతం చేశారు. భోజనానికి రమ్మని కొడుక్కి ఫోన్ చేస్తే ,బిజినెస్ లంచ్ ఉందని మమ్మల్ని కానియ్యమని చెప్పాడతను. dessert కి తప్పక రమ్మని చెప్పమన్నారు చౌహాన్ గారు.  "వాడుంటే   , పోనీలే అమ్మా  ఒక స్వీట్ , సిగార్  వదిలెయ్ అంటాడని వీరి ఆశ " అని నవ్వింది.  కాలం ఎలా గడిచిందో తెలీకుండానే , సాయంత్రం వడాపావ్, చాయ్ వచ్చేసాయి. బాబు రాలేదు.
       బయలుదేరవలసిన సమయం వచ్చింది. మేము నిర్ఘాంత పోయేలా లక్ష్మికి  పట్టుచీర , నాకు చిన్న వెండికంచం  ఇచ్చారు . వచ్చే నెలలో పెళ్లి  అనుకుంటున్నామని ,  కుటుంబం అందరం తప్పక రావాలనీ ఆయన పదేపదే చెప్పారు. ఆవిడ నా విజిటింగ్ కార్డ్ తీసుకొని  భద్రపర్చింది. ఎంతో ఆత్మీయుల్లాగా కారు దాకా వచ్చి వీడ్కోలు పలికారు.  యాదృచ్ఛికమే అయినా  అద్భుతమయిన ఈ స్నేహాన్ని ప్రాణపదంగా జీవితాంతం కాపాడుకోవాలని దృఢంగా నిశ్చయించుకున్నాం.
 
          కారు ప్రయాణంలో అంతా , ఇన్ని రోజులు చూసిన ప్రదేశాలు, తీసుకున్న ఫోటోలు , ఆ ఫ్యామిలీ గురించీ  , మాట్లాడుకున్నాం. తను హిందీ లో మాట్లాడగలదు కనుక  ఈ పరిచయం ఏర్పడింది అని ప్రకాశముగా ప్రకటించింది. ఇద్దరు మనుషులు రెండు భాషలను హత్య చేస్తే స్నేహం పుడుతుంది గదా అని ఙనాంతికంగా చింతించాను.
    
            సామాన్లు రూమ్ లో పెట్టిన డ్రైవర్ కమ్ రూమ్ బాయ్ కి  టిప్పు  డబ్బులిస్తూ " ఏమిటో సునీల్.  వాళ్ళ అబ్బాయి వీళ్ళిద్దరి లాగా కాదనుకుంటా. కొంచెం గర్వం నిర్లక్ష్యం. కలవడానికి వీలు లేకుండా సాకుల
మాటున దాక్కున్నాడు . పెళ్లికి తప్పకుండా వచ్చి చూడాల్సిందే. " అంది.

                 వాడి ముఖంలో సెకనులో చాలా రంగులు మారాయి.  దిగ్భ్రాంతి , కోపం, దుఃఖం వరసగా కనిపించాయి.  ఆశ్చర్యంగా  చెప్పాడు "  అదేంటి మేడం. అమ్మగారు చెప్ప లేదా.  బాబు కోరుకున్న అమ్మాయి , తనను కాదని మరొకరిని ప్రేమించి  పెళ్ళాడింది.  బాధతో అవమానం తో ఆత్మహత్య చేసుకున్నాడు. రోజూ తండ్రీకొడుకులు  బీచ్ లో  మార్నింగ్ వాక్ లో కలిసే చోట తండ్రి ఎదురుగానే సముద్రం లో దూకాడు. శవం సాయంత్రం దొరికింది. పెద్దాయన షాక్ లోకి వెళ్ళి పోయాడు. అన్ని విషయాలలో మామూలుగానే ఉన్నా , కొడుకు చచ్చిన సంగతి నమ్మడు. రోజూ ఉదయం  బీచ్లో  , తర్వాత ఇంటి దగ్గర  , బాబు ఉన్నట్లే  ఊహించుకుంటాడు. డాక్టర్లు ఎన్ని రోజులో చెప్పక పోయినా, కొద్ది రోజుల్లో మనుషులలో. వస్తాడని చెప్పారు. వచ్చేదాకా, ఆ తర్వాత కూడా జాగ్రత్త గా చూడాలి."

             " Dissociative amnesia . ఎన్ని రోజులో తెలియదు. జాగ్రత్తగా చూడాలి "  నాలో నేను మాట్లాడుకుంటున్నానని  తెలిసేలోపే , గుండెలు కదిలిపొయ్యేలా , కరిగి పొయ్యేలా  లక్ష్మి  వెక్కివెక్కి   ఏడుపు. తను దుఃఖం లోకి వెళితే ,తనే వెనక్కి రావాలి తప్పితే నేను చెయ్యగలిగింది ఏమీ లేదన్నది అనుభవం.
యాంత్రికంగా  సామాన్లు సర్దటం మొదలుపెట్టాను. ఏడుపుతో కూడిన  శ్మశాననిశ్శబ్దంలో  శ్మశానవైరాగ్యం తో వచ్చిన మౌనరోదన నాది. కుమిలి పోయాను. కనపడని , కనపడనివ్వని  కన్నీళ్ళను కనురెప్పల వెనుకే ఆపి కడుపులోకి. దిగమింగి దాచాను.

           "  ఎంత బాధండీ అది. ఆయనకెందుకొచ్చింది.అంత మంచి మనిషి . తట్టుకోలేక పోతున్నాను. వెంకటరమణా మరెవరికయినా ఈ ప్రారబ్ధం ఉందా స్వామీ ఈ లోకం లో " మాట్లాడుతోంది తను.

                 "  లక్ష్మీ! ఆవిడ  గతేంటి. సంగతేంటి.తన బాధను అణుచుకొని , అతని బాధను తనదిగా చేస్కొని, ఏడవటానికి కూడా అవకాశం లేని పరిస్థితి.రోజులో ఎప్పుడయినా ఒక గంట సమయం  ఒంటరిగా దొరికితే  ఆవిడ ఎలా ఉంటుందో  ఊహించు . నాకు అందడంలేదు."   తడబడుతూనే మాట్లాడాను.


   తిరుగు ప్రయాణంమంతా నిరాసక్తంగా నిర్వేదంగా-----
విమానం దిగి ఇంటికి ఎలా చేరామో, ఆఫీస్ కి ఎప్పుడెళ్ళానో , ఏంచేశానో తెలియని నిర్లిప్తత. అమ్మ ఏమయింది  ఎందుకిలా ఉన్నారు అంటుంటే తనని అడగమని వచ్చేశా. భార్యాభర్తల ఇమేజెస్ రకరకాల భంగిమలలో , భావనలలో,భావాలలో, కళ్ళముందు స్లైడ్ షో.

            సాయంత్రం  అలసటతో  ఇంటికి చేరిన నాకు అమ్మ కాఫీ తెచ్చింది.   " రోజూ పాప పుస్తకాలు, బట్టలు సర్ది  దానికి ఏదో ఒక ఫలహారం తయారు చేసి, ఎదురు చూస్తూ గుమ్మంలో కూర్చునేది.  

ఈరోజు తటాలున లేచి ఎటో వెళ్ళింది. దానికేమయిందో అర్థం కాదు.నాకేమిటి నాయనా ఈ బాధ!!."

              నాకు తెలుసు తనెక్కడుంటుందో. నిస్సత్తువగా  లేచి కారు తీసి బయల్దేరాను .బస్టాప్ లో
సిమెంట్ బెంచీ మీద కూర్చొని ఉంది. " నువ్విటు, పాప అటు అయ్యారు.అది బస్సు దిగి  వచ్చేసింది "
కారు డోర్ తెరిచి కూర్చుంది.  " రేపటి నించి దాన్ని ఇక్కడే రిసీవ్ చేసుకొని తెస్తా "  ఆలోచనగా  చెప్పింది.

           నెలక్రితం  ఒక రోజు,  కాలేజీకి బయల్దేరిన పాపకు , రాత్రి ఏడు గంటలకి  టైలర్ వస్తాడని చెప్పింది .
సాయంత్రం పాప ఫ్రెండ్స్ ఫోన్ చేస్తే వెంటనే వెళ్ళాం.

" ఉదయం నించి ఎక్సైటెడ్ గానే ఉంది ఆంటీ . బస్సు దిగి , ముందరి నించి రోడ్ దాటబోయింది . డ్రైవర్ చూడకుండా లాగించాడు."

            రక్తం ముద్దలా పాప , చుట్టూతా జనం , ట్రాఫిక్ పోలీసులు  , 108 వాహనం. పాపను కొన్ని గంటల తర్వాత  అప్పచెప్పారు.  నేను , అమ్మ  , దాని ఫ్రెండ్స్ దుఃఖం తో పొర్లి పొర్లి ఏడ్చాము. లక్ష్మి  కంట్లో నీటి చుక్క , నోట్లో మాట లేవు.  ఆ రోజు నుంచి తనకొక  మార్పు లేని దినచర్య  ఏర్పడింది. ఈ రోజే తొలి  కదలిక.



    
 

                 

     

 



 
            

                    

 

June 20, 2021


                                     దృక్కోణం

కవితల పోటీ.
కవి తలపోటు.
తప్పేముంది .
తప్పేదేముంది.
ఇవ్వబడిన ఇతివృత్తం::---  మహత్తర మానవ ఇతిహాసం. మహోన్నత  మానవ జాతి గురించి.
తలపుకొచ్చిన ప్రథమ పంక్తి. ::---- "" నరజాతి చరిత్ర సమస్తం పరపీడన పరాయణత్వం.""
రాసిన కవిత.::-- అనాథశవం.

"మీ కవిత ప్రచురణార్హం కాదు. "
   కారణం?

"వాడి ప్రయాణం లో నవత ,కథ లేవు."
అతని మరణం లో  కలత , వ్యథ కలవు.

"వాడికి  ' కొంప '    కనీసం  సొంతూరూ లేదు."
  అతని  ' గోడు '       వీసం  ఎవరూ  వినలేదు.

"జాలి ఆశ దయ  వంటి  మానవ విలువలు  గల కోట్లమంది పురిటిగడ్డని మీరు మరిచారు "
కర్కశంగా నిరాశతో నిర్దయగా వలువలు లేకుండా గుడిమెట్ల మీద పసిగుడ్డుని  వదిలారు.

"అవగాహన లేని వాదన అనవసరం అభ్యంతరకరం .
మీరు జాతిశత్రువు.
ఇక చాలు. "

అతగాడి లోని రోదన అనవరతం నిరంతరం
కవితా వస్తువు .
ఆగని క్రతువు.
ఇది మొదలు.


తదుపరి పోటీ.      ::----   1. వృక్షసంపద.
తదనంతరం పోటీ  ::----    2. సకల జీవరాశి ఘనత.

నా ప్రయత్నంగా నేను తప్పక రాస్తాను.
మీకు వివరిస్తాను
మిమ్మల్ని  సవరిస్తాను.
పాడితే  గెలిచే నా  పదం ఆవిష్కరణ
ఓడితే  తమచే నా పథం బహిష్కరణ.

1. తుంపర్లకి  తుఫాన్లకి ,  ఒకేలా చలించి  తలవంచి , కూలిపోక  నిలిచి ,
తల ఎత్తుకు నిలబడే వెఱపెరుగని   " గడ్డిపరక ". (తృణం)
2. తలకు మించిన భారం మోసే  శ్రమజీవి అలుపెరగని
అవిశ్రాంత సైనికుడు  " చలిచీమ " ( పిపీలికం)
    
    
    



'Sometimes'

(Sheenagh Pugh)



Sometimes things don’t go, after all,
from bad to worse. Some years, muscadel
faces down frost; green thrives; the crops don’t fail

Sometimes a man aims high, and all goes well

A people sometimes will step back from war,
elect an honest man, decide they care
enough, that they can’t leave some stranger poor.

Some men become what they were born for.

Sometimes our best intentions do not go
amiss; sometimes we do as we meant to.

The sun will sometimes melt a field of sorrow
that seemed hard frozen; may it happen for you.



                          కొన్ని సార్లు

కొన్ని సార్లు పరిస్థితులు అధ్వాన్నం కంటే అధోగతికి దిగజారవు.
కొన్ని వర్షాలు  పత్తిమొక్క  వర్షాభావం అధిగమించి
పచ్చదనం పల్లవిస్తుంది.రైతు పంట పండుతుంది.

కొన్ని సార్లు మనిషి ఉన్నత లక్ష్యానికి గురిపెడ్తాడు

సాధిస్తాడు
సర్వం సవ్యంగా పరిణమిస్తుంది.

కొన్ని సార్లు మానవులు యుద్ధవిరమణ చేస్తారు.
నీతిమంతుడిని ఎన్నుకొని ,  అపరిచితులను కూడా   ఉద్ధరించాలని  శ్రద్ధ వహిస్తారు.
కొంతమంది  ఏ ఔన్నత్యం కోసం  జనించారో దానినే అందుకుంటారు.

కొన్ని సార్లు మన మంచి ఉద్దేశ్యాలు తప్పు దారి పట్టవు.
మనం ఆచరించవలసిందే నెరవేరుస్తాం

కొన్ని సార్లు భానుడు , కరుడుకట్టి ఘనీభవించినట్లు
కనబడే  విషాద క్షేత్రాన్ని  కరిగిస్తాడు.మరిపిస్తాడు.
మీకూ అదే  జరగాలి.
తథాస్తు.
    
 


A Blade of Grass


You ask for a poem.
I offer you a blade of grass.
You say it is not good enough.
You ask for a poem.

I say this blade of grass will do.
It has dressed itself in frost,
It is more immediate
Than any image of my making.

You say it is not a poem,
It is a blade of grass and grass
Is not quite good enough.
I offer you a blade of grass.

You are indignant.
You say it is too easy to offer grass.
It is absurd.
Anyone can offer a blade of grass.

You ask for a poem.
And so I write you a tragedy about
How a blade of grass
Becomes more and more difficult to offer,

And about how as you grow older
A blade of grass
Becomes more difficult to accept.

--Brian Patten.

                                గడ్డిపరక

నువ్వు గేయం రాయమని అర్థించావు.
నేనొక గడ్డిపరక  సమర్పించాను
నువ్వది సరికాదని సరిపోదని అన్నావు.
నువ్వు కవితే కావాలంటావు.

ఈ గడ్డి పరక  సరిగా అమరింది
తను తుషార  బిందు వస్త్రం తో అలంకరించుకుంది
నేను ఆవిష్కరించగల ఏ  దృశ్యభావన కన్నా
ఎక్కువ మక్కువయినది సన్నిహితమయినది   అన్నాను.  

నువ్వు మళ్ళీ  అది గేయం  కాదు అంటావు.
అది గడ్డి పరక.  
గడ్డి పరక నాకేమాత్రం తగదంటావు.
నేను గడ్డి పరక నే సమర్పిస్తాను.

నువ్వు  అలిగి  ఆగ్రహించావు.
"గరిక సమర్పణం అత్యంత సులభం .
ఇది అసంబద్ధం.
ఎవరయినా గడ్డి పరక  అర్పించగలరు."అంటావు.

నువ్వు మళ్ళీ మళ్ళీ కవిత కోరుతున్నావు.
అందుకు పోను పోను, రానురాను
గరిక ఇవ్వడం ఎంత కష్టతరమో వర్ణిస్తూ
నీకోసం విషాదగీతం రచించాను.

నీ పై వయోభారం పడేకొద్ది
గడ్డిపరకని అంగీకరించడం
మరింత కష్టమనీ వివరించాను.
    
    
    
 

May 6, 2021

 ప్రకృతి--- వికృతి

 సింధువు ప్రథమ బిందువు
అంకురించిన గర్భస్థ శిశువు
భూమిగా మారిన మట్టి రేణువు.
వెదురు పొద లో గాలి రవళించిన వేణువు.
జలదం చిలికిన తొలి చినుకు.
మొలకెత్తిన మొదటి బీజం
చిగురేసిన  లేలేత పిలక
రవి తొలి అరుణ కిరణం
అమీరన్నా గరీబన్నా ఎరుగని అమీబా
ఒంటరితనం అనుభవించాయా?
తుంటరితనం అభినయించాయా?


కాదే


ఏకత్వం సహించి నేతృత్వం వహించి
దాతృత్వం మిత్రత్వం నేర్పించి
స్థితి, గతి మార్చి ప్రగతికిపయనించాయి.

కార్తీకపు మునిమాపు  జ్వాలాదీపం వెలుగు
కాశ్మీరపు కుంకుమపువ్వు చురుకు మెరుగు
సాగరపు తరగలపై వెండిజలతారు వెన్నెల నురుగు.
పచ్చికబయళ్ళ జాలువారు బంగారపు నీరెండ సొబగు.
కాంతారపు రాజసపు మెరుపు "కేసరి " వేట వేళ మెత్తటిఅడుగు.
పచ్చని  విచ్చిన గరికపువ్వు  జిలుగు
గలగల పారే సెలయేరు జలజల దూకే జలపాతం ఉరుకుపరుగు.
పీతాంబరం తళుకు
అందమంటే తమదేనని అహంకరించి హుంకరించాయా
అంతరించాయా?


లేదే


అణకువతో  అందలమెక్కి
వినయంతో అందరు మెచ్చి
ఆనందం పంచి ఆహ్లాదం పెంచి
విరించి గర్వించగ
జన్మకర్థం పరమార్థం వివరించి తరించాయి.


మరి


మనిషెందుకు మనమెందుకు జనమెందుకు
ఆగ్రహంతో సమస్తం ఆక్రమించి
ఆహవంతో సర్వత్ర ఆవహించి
సర్వం ఆహారించి, హరించి
హద్దులెరగక విహరించి.
ఎందుకీ  వినాశం ఆలింగనం  ప్రళయం ఆహ్వానం.

తుదిముట్టక తెగలాగక పట్టువిడిచి
సంయమనం పాటిస్తే నియమం నిలిపితే
లోచనాలు ఆలోచనలు కలిపితే ,
మన మనుగడ తధ్యం.
మనం మనగలగడం సాధ్యం
తథాస్తు. శుభమస్తు.
    

April 2, 2021

జాతిధర్మం

 


         
                   అపరాజిత గారు ఈమధ్యనంతా అన్యమనస్కంగా ఉంటున్నారు . మిన్ను విరిగి వెన్ను మీద పడినా చలించని ఆవిడ ,  కొద్ది రోజులుగా  జరుగుతున్న తనకు  నచ్చని , మింగుడు పడకుండా గొంతుకు అడ్డం పడుతున్న  , వరుస సంఘటనలతో కలత చెందుతున్నారు. సరిదిద్దడానికి స్వయంగా రంగంలోకి దిగాలేమో అన్న ఆలోచన మనసులో మెదుల్తోంది. 

              ఆవిడ సహజంగా  తన మృదువైన దృఢత్వం తో సొంత నిర్ణయాలని ఆచరణలో పెట్టే వ్యక్తి.   అందుకే తండ్రి  కష్టపడి పైకి వస్తూ , తన సామ్రాజ్యం  విస్తరించడానికి సరైన సైన్యాధ్యక్షుడిగా  ఎంపిక చేసిన వాళ్ళలో , బీదతనం  అనర్హతే అయినా తెలివితేటలు సమతూకం చేస్తాయని ఒకరిని వరించారు. తండ్రి రాజుగా, తను మంత్రిగా ఆయనను  విజయవంతంగా నడిపించారు. భర్త  అధ్భుతమయిన సక్సెస్ లో తన పాత్ర , తన తండ్రి  పాత్ర ఆయన  ఎప్పటికీ మరిచిపోకుండా ఆవిడ  చూసుకుంటూనే ఉంటారు. కానీ ఈనాటికీ  శ్రీవారిలో మంచితనం అనే బలహీనతతో ఆవిడ సర్దుకొనిపోక తప్పటంలేదు.

              భర్త  పెళ్ళైన కొత్తలో ముద్దుగా "అప్పూ" అని పిలిస్తే  వెంటనే సున్నితంగా , పేరు పెద్దది అనిపిస్తే "అజిత" అని పిలవమని నిర్దేశించారు. ఆవిడకి ఓటమి అన్నా , కూటమి అన్నా  సమానమయిన అయిష్టం.  స్వంతమయిన, స్వతంత్రమయిన గెలుపంటే ఇష్టం.  అందుకే తన పేరన్నా , తన ముద్దు పేరన్నా తనంత ఇష్టం. ప్రత్యర్థులు లేని విజయాన్ని  ఆవిడ ఎక్కువగా ఆస్వాదిస్తారు ,  ఎన్నికలలో ఏకగ్రీవాల్లా.

                   శ్రీవారి ఆరోగ్యం కొంచెం ఒడుదుడుకులకు లోనవడంతో, విదేశాలలో చదివి వచ్చిన చిన్న బాబు గారు  తండ్రి స్థానాన్ని క్రమేపీ భర్తీచేశారు . వారు సారధ్యం వహించడం ప్రారంభించిన తర్వాత చేపట్టిన మార్పుల్లో " హ్యుమన్ టచ్ మిస్సింగ్ " , " టూ ప్రాక్టికల్ " లాంటి మాటలు వినిపించినా , లాభదాయకత పెరగడం తండ్రి కన్నా అమ్మ గారికి పుత్రోత్సాహం కలిగించింది.     " When the competition is fierce you must be fiercer " అన్నది అబ్బాయిగారి  motto . కానీ కుమారుడిది అతిమిత్రత్వ స్వభావమేమో అని madam చిన్న ఆందోళన కలిగి ఉన్నారు. '"సెలెక్ట్  ఫ్యూ" తప్ప మిగిలిన వారినందరినీ  గుండెగుమ్మం దగ్గరే ఆపాలి , అంతకుమించి ముందడుగు వేసేందుకు అవకాశం ఇవ్వకూడదని వారి దృఢాభిప్రాయం.
మనసు పుష్పకవిమానం కాదు కదా అందరినీ ప్రేమించి , ఆహ్వానించి , చోటివ్వటానికి .

                           ప్రస్తుతానికొస్తే  , అప్పుడప్పుడు దగ్గరలో ఉన్న ఫాంహౌస్ కి ఫ్రెండ్స్ తో వెళ్ళి సరదాగా గడపటం అలవాటు. కొద్ది  రోజుల క్రితం అక్కడ పేకాడుతుండగా గోడ మీది బల్లి  రెక్కలపురుగును మింగడానికి ప్రయత్నిస్తోంది.  ఒకసారి వెలుతురు లోంచి,మరోసారి నీడలోంచి , కనబడుతూ, నక్కుతూ , పొంచి చూస్తూ  guerilla విద్యలన్నీ ప్రదర్శిస్తూ దాడి చేస్తోంది.   పురుగు అతీంద్రియ శక్తి   కలిగి ఉన్నట్లు ,  తద్వారా శత్రువు ఉనికిని పసికట్టగలిగినట్లూ , బల్లి దగ్గరకి వచ్చాక  ఎగిరి మరొక చోట  వాలుతూ పదేపదే తప్పించుకుంటోంది. బల్లి ఆఖరి ప్రయత్నంగా వేగం పెంచి జరజర పాకుతూ వెళ్ళింది. పురుగు తప్పుకోడంతో బల్లి కిందపడింది. అమ్మ గారికి ఇది చాలా అన్యాయంగా అనిపించింది. దేవుడు బల్లిని సృష్టించినప్పుడే పురుగులనూ ఆహారంగా సృష్టించాడు.  నియమాలకు వ్యతిరేకంగా పురుగు ప్రవర్తన.....సర్వెంట్ ని పిలిచి , హిట్ కొట్టించి పురుగును చంపించినా ఏమూలో అసంతృప్తి. బల్లిని సింబాలిక్ గా  ఒక వర్గానికి   ప్రతినిధిగా ఆవిడ భావించారు.  ఆ రోజు మూడ్ బాగోలేక రాత్రికి అక్కడే పడుకుండిపోయారు.

                           మర్నాడు ఉదయాన్నే  కుక్కని  వాక్  చేయిస్తున్న సర్వెంట్ ని చూస్తూ బ్రేక్ ఫాస్ట్  చేస్తున్నారు. సూర్యుడు ఎంతో వినయంగా చెట్ల ఆకులమాటు నుంచి పడీపడని వెచ్చని ఎండతో  D విటమిన్  సర్వ్ చేస్తున్నాడు. కోయిల విధేయతతో ఆగి ఆగి పాడుతూ ఆహ్లాదాన్ని అందిస్తోంది.   గాలి  ఎంతో అణకువగా ,  మెల్లగా వీస్తూ  ప్రశాంతతకు భంగం కలగకుండా  చూసుకుంటోంది. కుక్క  యజమాని  గారి దర్జాకి ,  దర్పానికి అనుగుణంగా ఠీవిగా
 ( గ్రామ) సింహంలా నడుస్తోంది.  కొద్దిగా మనసు కుదుట పడుతున్న వేళ జరిగింది మరో సంఘటన. విశ్వాసం కలిగిన కుక్క ,  సర్వెంట్ క్వార్టర్స్ లో ఉండకుండా , ఆవరణమంతా తనదిలా తిరుగుతున్న  తోటమాలి కొడుకు మీదికి  బాధ్యతగా ఉరికింది. గొలుసు తో ఉంది కనుక   వాడిని అందుకోలేక సతమతమవుతోంది. తప్పు చేస్తున్న భయం లేకుండా , పెద్ద కుక్క అన్న భయం లేకుండా  కర్ర తీసుకొని ఆ వెధవ ఎదురు తిరిగాడు. కుక్క  తోక ముడిచి  సర్వెంట్  వెనక దాగుంది.  పగలబడి నవ్వుతున్న వాళ్ళిద్దరినీ చూస్తుంటే ముంచుకొచ్చిన కోపం ఇంకా  మనసులో ఒక మూల వేధిస్తోంది.
    
                                                                                                                                                                                                      ఈ మధ్యనే బాబు స్నేహితుడు Mr.నరేష్ ( I.P.S)  బదిలీ మీద వచ్చిన సందర్భంగా ఇచ్చిన 
 పార్టీకి  అందరినీ పిలిచారు. అబ్బాయిలందరూ  మందు లోకి దిగిపోయేరు.  వాళ్ళ లోకం వారిది,వేరేది.  అబ్బాయిగారు " ఫీల్ ఫ్రీ. నో ఇన్హిబిషన్స్. ఎవరి నాన్న ఇటు వైపు రారు. ఎంజాయ్  "  అని  ప్రోత్సహిస్తున్నారు.

                       అన్ని సంస్థల ఉద్యోగులు రావడంతో కుటుంబాలు కోలాహలం  చేస్తున్నాయి. కొద్దిసేపటికి     అంతస్థుల అంతరాలబట్టి ,  తెలియకుండానే  ఆడపిల్లలంతా రెండు groups గా చేరేరు .  ఎవరి తాహతునుబట్టి వారు ప్రవర్తిస్తే  , తారతమ్యాలు  సరిగా పాటించబడే క్రమశిక్షణ వలన ,   madam గారికి  అన్నీ  సక్రమంగా జరుగుతున్న  భద్రతాభావం ఇనుమడించి తృప్తి గా ఉంటుంది. అటువైపు నుంచి Gucci,chanel, DeBeers ఇటువైపు నుంచి  ఆ బట్టల షాప్ ,ఈ నగల దుకాణం , రెండు వైపుల నుంచి careers,చదువుల చర్చలు , లోకాభిరామాయణం .

                              అమ్మగారికి గార్డెన్లో  చక్కని గడ్డిపువ్వులన్నీ ఒకవైపు , మనోహరమయిన  గులాబీ తోట మరోవైపు  ఉన్నట్లు తోచింది. వారికి ఆ సమయంలో ఏ పువ్వు అందం దానిదే అన్న ఉదాత్తమైన ఆలోచన వచ్చి గంభీరంగా అభినందించుకున్నారు. అందం కన్నా హుందా , హోదా  వారి దృష్టిలో  విలువైనవి . గులాబీల మధ్య అబ్బాయిగారు వివాహం చేసుకోబోయే  Miss. నీలిమ  ప్రత్యేక ఆకర్షణ.  

              Oxford suit లో చికాకు అంటే అయిష్టంగానే పట్టుబట్టలు కట్టించినా,  ఏమీ పట్టనట్లు  భర్త ఉద్యోగులతో కలసి విరగబడి నవ్వటం , ఆవిడకి చిరుద్యోగుల విరగబాటులా, చిన్న తిరుగుబాటులా కనిపించి , అనిపించి  రుచించలేదు. పిలిపించి  శ్రీవారిని మంత్రి గారు, కలెక్టర్, మిగతా రాజకీయ, పుర ప్రముఖుల సముఖంలో నిలవమని సున్నితంగా అభ్యర్థిస్తున్న శరీరభాషతో  విశదంగా ఆదేశించారు.

                         వజ్రాల నగలు , దుస్తులూ మెరిసేలా మెజెస్టిక్ గా మహారాణి ,  " యువ "  రాజమాతలా ,  వెలుతుర్లో కూర్చున్న అమ్మ దగ్గరికి  నరేష్ వచ్చి కూర్చొని కబుర్లు చెప్తున్నాడు. వింటున్నాగానీ తను గమనిస్తున్న విషయాన్ని అతనూ చూస్తున్నాడని ఆవిడ పసికట్టేరు. కొడుకు గడ్డిపువ్వుల్లోకల్లా  అందమయిన , ఆ మాట కొస్తే  అందరికంటే అందమయిన అమ్మాయితో చాలా సరదాగా, చాలా చనువుగా ------ . సందడిలో ఆ విషయాన్ని  మరెవ్వరూ  అంతగా గుర్తించక పోవటం కొంత ఊరట.అందరికీ అంత నిశిత దృష్టి , సునిశిత పర్యవేక్షణా నైజం  ఉండవుగదా!!

                       మిత్రులిద్దరూ మెల్లిగా నడుచుకుంటూ  గార్డెన్లో చెట్ల మాటున కూర్చున్నారు. నడుస్తూ  నడుస్తూ  యాధృచ్చికంగా  మేడం గారు కూడా కనబడకుండా వినబడేంత దూరంలో నిలబడ్డారు. నరేష్  " రాజుగాడు నాకూ జూనియరే, ఫ్రెండే.  నువ్వు వర్రీ  అవకు . మార్జిన్ మనీ అదీ నువ్వు ఎరేంజ్  చెయ్యి ముందు. నాది గ్యారంటీ " అనడం , బరువు దించుకున్నట్లు బాబు నవ్వటం ఆవిడకి రుచించలేదు. ఎవరికో , ఏదో సాయం అన్నదిమాత్రం అర్థం అయ్యింది.  మనకు పనికిరాని  ప్రతి సాయం అపాత్రదానమేనని ,  అపాత్రదానం అనర్థదాయకం అని ఆవిడ తండ్రి గారు ఏనాడో సూత్రీకరించారు.ఆవిడ ఆనాడే ఏకీభవించారు.

                         నాలుగు రోజుల తర్వాత సాయంత్రం వేళ ఎప్పటినుంచో తమ వద్ద నమ్మకంగా పని చేస్తున్న ఉద్యోగి   వచ్చేడు.  పూర్వాశ్రమంలో స్నేహితుడవటం వల్ల అతను అయ్యగారితో అతిచనువుగా ఉండటం , శ్రీవారు అది సమంజసమే అని భావించటం  అమ్మ గారికి  నచ్చదు.  చిన్నతనంలో నందుడి వద్ద రాజసంపదలు లేని బాల్యంలో మిత్రుడయిన కుచేలుడికి ,  తర్వాత కృష్ణుడు సకలమర్యాదలు చెయ్యటం విషయంలో  దేవదేవుడి  మీదే వారికి చిన్న కినుక.  ద్రుపదుడు, ద్రోణుడికి చేసిన అన్యాయమేమిటో వారికి అర్థం కాదు , చేసుకోవలసిన అవసరం లేదు.

                          " సార్ తో మాట్లాడాలి, అమ్మా మీరు కూడా వినవలసిన ముచ్చట " అన్నాడతను. సారాంశం.  వాళ్ళబ్బాయి, అతని ఫ్రెండ్  చిన్న బాబుకి జూనియర్స్. P.G. తర్వాత రీసెర్చ్ , కొంతకాలం ఉద్యోగాలూ   చేసి , దాచి పోగేసిన డబ్బుతో ,  స్వంత కంపెనీ ప్రారంభించి  , కొత్త ప్రోడక్ట్ తయారీ లో ఉన్నారు. ఉద్యోగం మానేసి వ్యాపారం లో దిగటం మనలాంటి వాళ్ళ కి అచ్చిరాదని చెప్పినా వినలేదు. చేతిలో డబ్బు అయిపోవస్తుండడంతో ఎప్పటినుంచో ప్రయత్నం చేస్తున్న bank loan గురించి తిరుగుతున్నారు. 

                  బాబు ,  వీరి విషయం లో ముందు నుంచి ఆసక్తి చూపిస్తూ ప్రోత్సహిస్తున్నారు. Bank loan  విషయంలో  వారు మార్జిన్ మనీ సమకూర్చటానికి ఒప్పుకుని ,  గ్యారంటార్ గా   ఉండటానికి నరేష్ గారినిఒప్పించేరు. పార్టీ అయిన తర్వాతి రోజు ఈ తతంగం జరగాలి . దురదృష్టం . ఆ రోజు రాత్రి పార్టీ లో తాగి  కారు నడుపుకుంటూ బయల్దేరారు. దారిలో మరో కార్ ని  గుద్దేసేరు. కొడుక్కి కాళ్ళు ,  ఫ్రెండ్ కి భుజం విరిగేయి.

             ఎదుటి కార్, కార్  డ్రైవర్   వెల్ బిల్ట్  కావడంతో మైనర్ డ్యామేజ్ తో తప్పించుకున్నారు. కొద్దిపాటి మైకంలో ఉండటంవల్ల , గాయాల వల్ల  వీళ్ళిద్దరూ ఎదుటి కార్ లో వెనుక   సీట్లో గుండెజబ్బు వ్యక్తి  ఉన్నాడని, ఆ వ్యక్తిని పోలీసులు హాస్పిటల్ కి తరలించారని ఏమాత్రం  గమనించలేకపోయేరు. నరేష్ గారు సమయానికి అక్కడికి చేరుకొని అన్ని చూసుకున్నారు. 

                         రాజీ ప్రయత్నాలలో కార్లకి , గుండెకి  , వీరిద్దరి చికిత్సకు ఖర్చంతా బాబే భరిస్తే , కేసు కాకుండా నరేష్ చూసేరు.మార్జిన్ మనీ డబ్బు ఇలా ఉపయోగపడింది. ఇకపై కంపెనీ నడిపే అవకాశాలు లేవు కనుక , బాబుని టేక్ఓవర్  చెయ్యమని హాస్పిటల్  నుంచే  బ్రతిమిలాడి , కోరడంతో మరో మార్గం లేక వారు ఒప్పుకున్నారు. తండ్రిని మించిన దయామయులవడం వల్ల  వారే వాటాలు వేసేరు. చిన్న బాబు కి 50% , వీరిద్దరికి చెరో 20% , నరేష్ గారికి 10%.

                    పిల్లలిద్దరికీ జీతం కూడా సంప్రదించి నిర్ణయించారు. వారి ఔదార్యానికి   ఉదాహరణ నరేష్ గారికి , వారికీ  నెలవారీ ఏమీ వద్దనడమే .  Capital , loan విషయం వారే చూసుకుంటారు. ఇన్నాళ్ళ తర్వాత ఈ రోజు మధ్యాహ్నం  కొడుకు కడుపునిండా తిని , కంటినిండా నిద్రపోతుంటే ఈ వివరాలను చిన్న బాబు కంటే ముందు తను చెప్పి కృతజ్ఞత చెప్పుకోవాలని వచ్చేడు.

                                                    "వారు మీ  రక్తం  సార్ "

                           రాత్రయింది.  బాబు , నరేష్ రావడం , సర్వెంట్ ని పిలిచి నరేష్ కి కూడా భోజనం ఏర్పాట్లు చెయ్యమని ,  ప్రస్తుతానికి కావలసినవి పురమాయించి తోట లోనికి  నడవడం చూసి అమ్మ గారు  దూరం నించి  వెంబడించేరు.  నరేష్ వెనక్కి విలాసంగా వాలి ,  " SO  ! ? "  అన్నాడు.  బాబు నవ్వుతూ " SO  అంటే ఏముంది. 10% తో అగను. ఇల్లు కొనుక్కో.  White  నీది, black నాది " అన్నారు .   " మరో విషయం బ్రో.  అనూహ్య మీద నీ ఇంట్రెస్ట్ అమ్మ కూడా గమనించేరు. కంగారు అణచుకుంటున్నారని అనుకుంటున్నాను .  వాట్స్ కుకింగ్ ?  అన్నాడు నరేష్ .

                           " రేయ్ ! కోరికలు ఎన్నోవున్నా ఆశయం ఒకటే.  క్రేవింగ్స్  ఎన్నోవున్నా  ఆస్పిరేషన్, ఆంబిషన్ జనరల్ గా ఒకటే .  అందాన్ని అక్కున చేర్చుకుంటాం. మనిషినీ కుటుంబాన్నీ నెత్తికెత్తుకోం. " అని బాబు జ్ఞానోపదేశం  చేసేరు.
                         నరేష్ ముందు తన భావోద్వేగం బయట పడినందుకు తనను తాను మందలించుకుంటూ, రాజయోగా  సాధన చెయ్యాలని నిశ్చయించేరు అమ్మగారు.  గర్వంగా గాలిలో తేలిపోతూ,  తొమ్మిదో మేఘం మీద తన గదికి చేరేరు.

                                                      "వాడు నా రక్తం ".

                            ఫాంహౌస్ మేనేజర్ కి ఫోన్ చేసి కొత్త వాళ్ళని వెదకమని ,  దొరకగానే  తోటమాలిని , కుక్కల్ని చూసే సర్వెంట్ ని లెక్కచూసి పంపించెయ్యమని  చెప్పేసేరు.
  
                          ఉరుములు. మెరుపులు , సుడిగాలి , చీమలదండు తన పుట్టను అకస్మాత్తుగా చుట్టుముట్టినా ఏమీ కాదనీ,  ఒకవేళ అనుకోనిది జరగబోయినా ఆపగలననీ తన స్వశక్తి మీద సంపూర్ణమయిన విశ్వాసం గల  నాగరాణి   , వచ్చిన చిరు ఆపదలు తమంతటతామే తొలగిపోతే  మణికాంతులతో ఎలా తేజరిల్లుతుందో ;  
 కుటుంబాన్ని చుట్టుముట్టిన దుమ్ములగొండ్ల గుంపును యువకిశోరాలు తరిమికొడ్తే సివంగి ఎలా ఉప్పొంగి పోతుందో  ;
అలా ఆ సమయంలో ఆవిడ విలసిల్లారు.

                ఆ సమయంలో అపరాజిత గారికి నాన్న గారి మాటలు గుర్తొచ్చాయి.  " అమ్మాయి . నేను చేసిన పూర్వజన్మ సుకృతం వలన ఉత్తమోత్తమ మానవ జన్మనొందితినని శాస్త్రం చదివినవారు చెప్పారు.  నేను మధ్య వయసు వచ్చేటప్పటికి ఎదిగాను. నువ్వు తరవాతి తరం. నీ యవ్వనంనుంచి ఎదుగుతూ కొడుకు పుట్టేటప్పటికి గొప్పదానివయ్యావు. నా మనవడు 'బార్న్ విత్ డైమండ్ స్టడ్డెడ్ గోల్డెన్ స్పూన్ ' .శివుడి ఆజ్ఞ లేనిదే చీమైనా కుట్టదు.నువ్వు చేసే అన్ని పనులు దేవుడే  చేయిస్తున్నాడు. తప్పొప్పులు ఆయనవే. కరణం కారణం కర్త అన్నీ ఆయనే మనం నిమిత్తమాత్రులం.

                                           దూబరా  పొదుపు  పిసినారితనం
                                           అజాగ్రత్త  జాగ్రత్త  అతి జాగ్రత్త
                                           ఆత్మన్యూనత ఆత్మవిశ్వాసం  అహంభావం

                     వీటి  పరిణామక్రమం నేను అనుభవించాను. నీకవసరంలేదు .యువరాణిగా,మహారాణిగా,రాజమాతగా నీ జీవితం ప్రకాశిస్తూనే ఉంది. నువ్వు చేయవలసినదల్లా అహంకారం,అహంభావం  దాచి ముసుగులు వెయ్యటమే. ముఖ్యంగా ఈ బీదాబిక్కి,  డబ్బున్నవాడు , కోపంగా "నువ్వు"  అంటే ఏకవచనం అని కొంపలు మునిగిపోయినట్లు పేట్రేగిపోతారు. మెత్తగా , మత్తెక్కించి గొంతు కోసినా అమ్మగారి మాటతీరు ,  హృదయం వెన్న అంటారు."

                               నాన్న చెపితే  నాకు తెలిసిన జీవిత సత్యాలు బాబుకు పుట్టుకతో వచ్చాయని మేడమ్  పరవశించేరు. బాబు ఆలోచించి, " అన్ని " జాగ్రత్తలూ తీసుకుంటాడనీ తప్పటడుగులు ,  తప్పులు  వెయ్యడని , చెయ్యడని ( ???)   సంతృప్తిగా వారు నిశ్చయించేరు,నిబ్బరించేరు.
     
                            అంతులేని ఆనందం, ప్రశాంతత అనుభవిస్తూ రోజూకన్నా భిన్నంగా ఏమయినా చెయ్యాలని నిర్ణయించేరు . వుడ్ హౌస్, ఐన్ రాండ్ పక్కన ఉంచేరు. భర్త ఎప్పటినుంచో  సిఫార్సు  చేస్తున్న '" బీదలపాట్లు"  అన్న సినిమా చూడడమా లేక  " les miserables " నవల చదవడమా అన్న మీమాంస లో  ఆ పుస్తకం మీద   హోం  థియేటర్  రిమోట్  ఉంచి  గాఢ నిద్రలోనికి జారుకున్నారు. 

March 29, 2021

off (spring) of joy






This is translated purely for Arjun and because of Arjun.
No deprecation or depreciation allowed.
So only appreciation aloud.




All the people say you are growing.
Hope and aspirations of grandparents  and elders are overflowing.
Not even an inch  the set target ,  lowering .
lent an ear and eye to enjoy the progression of a sapling  flowering
Boy hardening into a nice bloke like an oak.

Bewildered  spectators  ,  you were an imp roving all over the home you know
Wondrous spectacle , you are improving as white as snow .
leaping ,bounding and  roving imp is  improving by leaps and bounds.

Your tottering steps warned us
Let you not
         or
We should not
misstep. 
Our  response , the responsibility learned and earned.

Curtailed and ceded , extravagance  and aggression for you  on the debit side
Nailed the much needed credit, fragrance of  affection , for us balanced life a joyous ride

Restless in the car seat howling and prowling
Stressed to turn the head  growling.
vision on the road  disciplined driving forward
Envision better outlined future onward .

Elders  seeing you , nostalgic with our sweet memories.
Folders filling  with classic  treats of memoirs.
Being called grandpa grandma is not  embarrassing .
aging  gracefully , with fondness embracing.

Rear and care , bestowed with  parenthood 
near and dear are dearer than assets , understood
grew along , learning  and teaching , with you .
Knew new yearnings  in reaching out for you.

We are the present and future
We have to mount many mountains
We have to surmount uphill tasks.
Stepping up closely with the past.

Search for greener  pastures
Reach for higher  statures
Depart , that  is a must almost.
Be a part of family and trust always .

 

March 26, 2021

సంతానం. సంతసం.

 

నువ్వు ఎదుగుతున్నావని అందరూ అంటున్నారు.
తాతలు నానమ్మ  అమ్మమ్మ  ఆత్మీయులు ఎక్కడున్నా ఎన్నో కలలు కంటున్నారు.
కర్ణనయనాలు ఇటే పడేసి  వీనుల,కనుల విందారగిస్తున్నారు.
తమ వంతుగా ప్రశంస ప్రోత్సాహం ఇస్తున్నారు.

పిల్లపిశాచంలా ఇల్లు పీకి పందిరేస్తుంటే చేష్టలుడిగిన ప్రేక్షకులం.
పరిణితి చెందుతూ యువ అద్భుతంగా మారుతుంటే మాటలుడిగిన వీక్షకులం.
( leaping ,bounding and  roving imp is  improving by leaps and bounds)
 
తప్పటడుగులు వేస్తూ
తప్పుటడుగులు వెయ్య , వెయ్యనివ్వ
కూడదని బాధ్యత నేర్పావ్.
నీకోసం  అనవసరపు వ్యయం అహంకారం  ఖర్చు రాసి
మాకోసం  అత్యవసరపు ముద్దుమురిపెం  మమకారం జమవేసి బాలన్స్ చేశాం.

కారు సీట్లో వెనక కూనిరాగాలు తీస్తూ  వేషాలు వేస్తూ
వెనుతిరిగి చూడాలనే కుతూహలం అణచి
ముందుచూస్తూ నడపాలని
ముందుచూపుతో నడవాలని
ఏకాగ్రత నేర్పావ్.
నేర్చుకుంటూ నేర్పించాం.

ఇరువైపుల పెద్దలకి మా బాల్యం గుర్తు చేస్తూ ఆనందం పంచావ్. తీపి గుర్తులు జ్ఞప్తించావ్.
నీ చిన్నతనంలో తాత నానమ్మ,అమ్మమ్మ అని పిలిస్తే 
చిన్నతనం కాదని  చిలిపిగా తెలిపి పెద్దరికం పెంచావ్.
మనవలు,మనవరాళ్లూ  మనవాళ్ళన్న భావన
నీకందించే  దీవెన  వారికి జరలో రుజలో   దివ్యౌషధం

తల్లి తండ్రుల పాత్ర నిచ్చి , ఆస్తులకన్నా ఆప్తులు కలకాలం  ప్రధానమని
మా పెరుగుదల తో నీ ఎదుగుదల ఏకకాల విధానమని
అవగాహన పెంచావ్,మురిపించావ్, మైమరిపించావ్.

మనం ఎక్కవలసిన విమానాలు , సోపానాలూ
అధిగమించాల్సిన పరిణామాలు ప్రమాణాలు
వర్తమాన  భవితల  ప్రతినిధులమై
నియమితకాలంలో అందుకుంటూ
గతాన్ని కలుపుకు పోదాం .చేయూతనిద్దాం.

గడపలు  దాటినా వీలైనంత కలసి గడపటం
నడక దారులు వేరైనా మేలైనంత నడత కలపటం.
వసుధైకమనకుటుంబం. మన ముఖచిత్రపటం.

సశేషం.
అంతులేని కథ.

February 5, 2021

Happy Birthday Mrudula Atta

Happy Birthday Moola Atta. I am very excited that it's your birthday tomorrow and its a friday which means spending time with Pranav and Aneesh mama and you. I remember all the fun times we had at our old apartment, Avocet terrace house and Ojai Loop.  Of all the things we did together these are the best memories I had with you. On your special day I want you to take a trip down memory lane with me,

  • Making Jack O'lanterns with you at our old apartment ( more like breaking the jack o'lanterns and making a mess when you and Amma are trying to save them from me) 

  • We all used to go Ganesh pooja at our house every year 

  • San Jose Children’s museum trip

  • Disneyland Trip 

  • The checkered pant memory

  • You tried to teach me to dance and praise me even when I was terrible :)

  • The time we went to monterey bay aquarium

  • I was scared that Aneesh mama would take you away from California. I am so glad that Aneesh mama is with us in California.

  • Discussing about Harry Potter and Percy Jackson books

  • The best of all the memories is spending time with Pranav . He is absolutely hilarious.














And I am always this happy to see you . Happy Birthday Mrudula Atta. 



Love Arjun 💓

January 16, 2021

 ప్యానం ఏదైనా ఒకటే

నారాయుడు


"ఒరే నారాయుడూ! కరెంటు పోనాది. ఈడంతా గబ్బగీం. బ్యాట్రీ దీపమో,లాంతరో ఒట్రారా అయ్యా.
ముసిల్దాన్ని ఏ పామో, పురుగోపుట్రో కుట్టి ,  కునికేస్తే శనేశ్పరమొదిలేస్తాదని సూత్తండావా తండ్రీ"
 అని అరుత్తోంది కదండీ అది మాయమ్మండీ.
" య్యోవ్ ! నేను పిల్ల కాడుండా. పొయ్యిమీన కూడుడుకుతాంది. ఈడ్నే ఉండు. వస్తదిలే "
 అంటాంది కదండి అది మా ఆడమడిసండి.
"పొయ్ లో మంటుండాది గదమ్మే. కాపడ్తదిలే ". అని లాంతరట్టుకొని బయటికెళ్తున్నానండీ.
" వాన రాకడ ప్యానం పోకడే గాదే కరెంటు పోకడ గూడా తెల్దుగదేయమ్మా" అన్నానండీ.
"గేదెకాపట్లేదురా.ఎటెల్లబారినాదో . ఎతుకులాడ్నా . . బుగత గారి మడిలో పడ్నాదంటే
గొడ్డును బాదినట్టు బాత్తార్రా తండ్రీ" అంటా గోస పెడ్తానే ఉందండయ్యా.
"అది గొడ్డేగదమ్మా " ఆని ఇకిలించినానండి
"నువ్ కొంప లోకి రాయే. సిన్నమ్మికి బాలేకపొయ్నా ,ఊష్ణమెట్టుకున్నానీకు గేదే ముక్కెమా?ఎంతకీ దానూసేనా ?"  అన్నానండయ్యా.
సెయ్యి పట్టుకోని తెద్దారంటే ఇదిలించి కొట్టిందండి.
"మద్దినేళ పచ్చగడ్డి మోపు నెత్తి నెట్టుకోని కయ్య కాణ్ణించి ఒక్కత్తినే ఒచ్చినా.
ఆ టయాం లో నువ్వుగాని ఉండావేట్రా బోడిసాయానికి. కళ్ళు బానే ఉండాయిలే" అందండి.
"పదపదవే కనకమాలచ్మి.  ముత్యాలమ్మా, బంగారమ్మా ,మాయమ్మా" అని మురిపెం ఆడినానండి.

"ఓరబ్బీ ఆడ కరెంటు తీగలు తెగిపడినకాడ నీ గేదె ఆట్ని ముట్టేసినాదిరా.
డొంకలో దొంగ మేత కెల్తా సిక్కడి గిలగిల కొట్టుకుంటాండాది" అని కొండడు అరుస్తున్నాడండయ్యా.
 దేవతల్ని పిలస్తండగానే మురిపెం ముక్కలయిందయ్యా. నా పెబువా! దేవదేవా!

ఓలమ్మో ఓలమ్మో అని మాయమ్మ శోకండాలెడ్తందండీ.
నానేమో కాలుసెయ్య పడిపొయినట్టు బిత్తర సూపులు  సూత్తా  ఉన్నపాట్ని కూలబడ్డానండయ్య.
 సిన్నతనాన వానావానావల్లప్ప ఆటలో ఊపెక్కి బిరాన తిరిగి తిరిగి ,ఆగితే గిర్రున తిరిగినట్లు తిరుగుతుండాయండీ కళ్ళు .

ఇజ్జూసింతర్వాత  ఆడే మద్దిగాలకొచ్చి ఆలోశనజేసి,
"బుగతనడిగి  టైరుబండొట్టుకొస్తానొరే. పిల్లదానికి బాలేదన్నావు . గేదెనీ , పిల్లనీ టౌనెట్టు కెల్దాం.
పశువుల డాట్టరు, మన డాట్టరు పక్కపక్కనే గందా "అని ఎల్నాడండయ్యా.
"ఓయ్యో.  పిల్ల కళ్ళు తేలేస్తండాది.ఆరెంపీ (RMP)మందు పన్జెయ్యలా" అని మా ఆడదాయి గోలెడ్తందయ్యా.

కొండడు

నారాయుడికి నోట్లో నాలికుండదు.నన్నే తల్లో నాలికంటాడు .ఆడెళ్ళినా నాబం ఉండదు అనుకోని  బయల్దేరినా.
బుగత కాడికెల్తన్నానే కానీ ఆడేటంతడో,ఏటి పేల్తడో అని బెంగగానే ఉండాది.
మాది పెద్దూరేం కాదు. గట్టిగా ఈ కొసనుండి ఆ దెసకి నడిస్తే  గసెట్టకుండా సిటికెలో  ఎళ్ళొచ్చు.

దార్లో చింత చెట్లు, ఏపచెట్లు జాతర్లో కల్లుదాగి జుట్టిరబోసుకున్న గణాచార్లా బీకరంగా  ఊగిపోతండాయ్.
నీళ్ళతో గోడగడ్తున్నట్లు వాన ముంచేస్తాంది.  
చెర్లో కప్పలు ఎనకొస్తున్న పామును చూడకుండా బెకబెకలాడ్తా ఎర్రిగోల సేత్తండాయ్.
 తాటాకు గొడుగే గాదు దేవుడూరేగింపు గొడుగులుగూడా ఎగిరి పొయ్యేలా గాలీసేస్తాంది.
ఈదరుగుల మీది  ఈదికుక్కలు గూడా గుండేసి కొట్టినట్టు మాయమయ్ పోనాయ్. పిట్టపురుగు సంచారం లేదేడా.
సీఆంజనేయం పెసన్నాంజనేయం పాడ్తా, అర్జున ఫల్గుణ పేర్లు సదువుతా ఆకరికి సేరినా.

ఊరంతా కొట్టకుపోతన్నా ఆడికేం.కోడికూర దిని  ఇప్పసారా దాగి ఎచ్చగా తొంగుండాడు.  
మసకెల్తుర్లో పొగాక్కాడ సుట్ట సుడ్తా వత్తంటే 'బండెడు బోనం, రెండెనుబోతులు,నంజుడుకో మడిసి'  
రోజూదినే  బకాసురుళ్ళా కాపడి ,  నన్నిరసకదింటాడేమో అని జడుపుకొచ్చింది.
ఏనుక్కి   పులిలాగా ఎర్రటి  కళ్ళుంటే ,అది  చెరుకు తోట మీదికి ఎట్లా ఉరుకుద్దో అట్లా వచ్చిండు.
ఎనకాల గోడమీన ఆడి తల నీడ  , పక్కని ఏటవాలుగా పడ్తా ఉంటే  రెండు తలల రాచ్చసుళ్ళా అనిపిస్తాండాడు.
"వత్తన్నా గందా ఈలోనే సావిట్లోకొచ్చెయ్యాలేట్రా  సుద్దిబుద్దంలేని ఎదవా . లబిడీబురదంతా నీ  పెళ్ళామొచ్చి తుడస్తదేటి" ఆని కసిర్నాడు.

" రేయ్  ! బండి ,సొమ్ములూ ( పశువులు) వూరికే రావ్.
కందులో పెసలో పంపించమని చెప్పు ఈడీకీ, ఆడికీ"
అని పెద్ద పాలేర్ని  పురమాయించినాడు.

బండొస్తాదో రాదో  అని శంకే అయినా సిద్దంగా ఉండారందరూ.
నారాయుడి బార్య  దొండపాదు పక్కన  నిలబడుండాది.
అది కోక ఒంటిమీన సుట్టుకోని నిలబడ్తే దానికీ ,  దొండ తీగ పాకిన గడకర్రకీ  తేడా తెలియట్లేదు.
ముసిల్ది   శబరిలా వొంగిపోయినా సత్తువతో  కాదు ,గుండెదైర్నంతో బతికేస్తంది.
ఆ పెయాణమంతా  ,గుళ్ళో హరికథలో కర్ణుడి సావులా,రకరకాల శాపాల్తో ఒల్లమాలిన అగసాట్లయింది.
యుద్దంలో ఆయనగోరి రతానికి  , డొంకలో మా బండికి దిగబడ్డం సామాన్యమయింది. బండి బురదలో దిగడిపోయింది.  ఎత్తతావుంటే పక్కన బండి గాడిలో జరజరమంటుంది వాన్నీళ్ళో పామో  ఆ దేవుడి కే తెల్చు.

పశువుల డాక్టేరుబాబు   రామయ్యగోరు పెద్దమడిసి. లోకంలో శోకమంతా సూసి మూగోడయినట్లు మాటల్తక్కువ..మంచోడే.
మన  డాక్టేరు  శ్రీధర్ బాబు ఇంకా కుర్రాడే.  జనాలకేదో సేద్దాం అన్న బ్రెమ సావనోడు.
సావులు తక్కువే సూడ్డంవల్ల పెజల  బాదలకీ  కట్టాలకీ కుమిలిపోక పొయినా , కదిలిపోతాడు.
మా వూర్లో దొంగెదవలు ఆణ్ణి వాడేయొచ్చు ,ఆడేయొచ్చుఅని ఊసులెట్టుకుంటారు.
బలి చక్కొర్తినీ, శిబి చక్కొర్తినీ, దర్మరాజునీ కూడా  పనికిమాలినోళ్ళని ఎకసెక్కాలాడతారు మా జనం.
 మంచి అంటే శాతకానితనమనుకునే ఎకిలితనం.

ఆళ్ళిద్దరూ బిడ్డనొట్టుకొని  దర్మాసుపత్రి లోకెల్లారు.
 ఆళ్ళెల్లాక  పశువులాస్పత్రి కాడ నేను, వాళ్ళమ్మ గేదెని దింపించి లోనికి ఒట్టుకెళ్ళిపొయ్యాం.
" రామయ్య బాబూ . ఆబోరు దక్కించు. దయసూడు  తండ్రీ,."  ముసిల్ది దణ్ణాలెడతంది.
"కష్టంరా కొండా.  బాగా షాక్  తగిలింది.వైద్యం చేద్దాం. పెద్ద ఆశ లేదు." అని  ఇండీషను గుచ్చి , మందు పట్టి , వైద్దిగం  సేసి కూసున్నారు.
ముక్కుతామూల్గుతా  ఉంటే  " పిల్లకెలాగుందో " అని అమ్మ తో మాటగలిపి
 " గేదె నారాయుడిదయ్యా. ఈవిడ  వాళ్ళమ్మ. పిల్లకి ఊరంత జొరమండి. ఆడూ పెళ్ళాం పక్కనున్నారయ్యా" అని సెప్పినా.
ఆయనేదో ఆలోశనగా ఆచ్చెర్యంగా సూశారు.

నిమిట్లు లెక్కెడతా అట్టా  కూకున్నాం. గేదె గిజగిజ అమ్మ మూలుగు ఎన్నుపూసకి సలెక్కిస్తున్నాయి.
ముసిల్ది కడుపులో కాళ్ళెట్టుకొని గోడకి సేరగిలపడింది.
చలికి ఆకలికి ఎవురిమీదో తెలీని చేతకాని కోపమొస్తాంది.
పెద్ద ఉరుమురిమి మెరుపు కొట్టింది.  నైట్లన్నీ ఆరిపొయినై.  యమర్జెన్సి దీపం ఎలిగింది.
పిట్టేదో సచ్చిపోయి ఏపచెట్టు మీంచి టప్పున పడింది.

షెడ్డులో, నా సుట్టూతా, కసింత దూరం దాకా  చావు కొండశిలవలా సుట్టుకొని,
 పీక నొక్కతా ఊపిరాడనియ్యనట్లు, దెయ్యం  సెవిలో గుసగులాడ్తున్నట్లు ఆనిపిస్తంది.
బయం,బెంగ జమిలిగా మీనకి దండెత్తి ఒణికిస్తండాయ్.
గేదె ఎగశాస పెట్టి బిగుసుకు పోయింది.
అటేపే సూస్తున్నముసిల్ది  ఎర్రికేకెట్టి ఏడవటానికి కంట్లో సుక్కల్లేనట్లుఊగిపోతాంది.

దూరంనించి ఏడుపులు వినిపించబట్నాయ్.
 గుండెలు బాదుకుంటా ఆయమ్మీ, పిల్ల శవాన్ని సేతులమద్దెకెత్తుకొని బతికున్న శవంలా ఆడు వస్తండారు.
సెదిరిపోయి ముడూడిపొయిన జుట్టునీ,జారిపోయి కాళ్ళకడ్డం పడ్తన్న  పైటనీ , గాలెనక్కి తోత్తంటే, అయమ్మి తెల్లచీరలో తూలిపోతా కూలిపోతా  ఉరకతంటే బక్క పిశాచంలా, తోకదెగి తుప్పల్లో సిక్కడ్డానికి దిగతన్న గాలిపటంలా ఆన్తంది.
నాగ్గూడా దుక్కం తన్నుకొచ్చి , దొర్లి దొర్లి శోకాలెట్టినాం .

డాక్టర్  శ్రీధర్


ఇలాంటివి చూస్తేనే మనసు కలతపడి  బాధ కలుగుతుంది.  
అంత  జ్వరం ఉన్న పాపను వర్షం లో తడుస్తూ,తడుపుతూ తేవలసి రావటంలో  వాళ్ళదే మొత్తం  తప్పా?
 రోగం ముంచుకొస్తున్నా ఏవో బిళ్లలు మింగించి , ముదరబెట్టి చావుని రోగితో పాటే తీసుకొచ్చేలా చేసేది మూర్ఖత్వమా, అశక్తతా?
చావుని చూసిన ప్రతి సారీ సిద్ధార్ధుడిలా చలించటంబలహీనతా, మానవత్వమా?
చలించకుండా స్థితప్రజ్ఞుడినవుతానేమో?
అప్పుడు జీవితం ఉప్పు కారం లేని మిరపకాయ బజ్జీలా అవుతుందా?    ప్రశ్నలు ఎక్కువవుతున్నాయి.
మరణం చూసిన ప్రతిసారీ అలవాటు, స్నానం చేసి తనువు ,మనసు  శుభ్రం చేయడమనే భ్రమ.
ఇలాంటి సమయంలో పెద్దాయన తో గడపటం ఆనవాయితీ.   ఇళ్ళ మధ్యలో దూరం తక్కువ. బయల్దేరాను.

' నిబిడాంధకారంలో దివాంధంలా  నేను ఆలపించే విషాదగీతం విశ్వసంగీతం ' అని తోచిన పదాలు  ప్రారంభంగా గేయం మనసులో  రూపు దిద్దుకుంటోంది.
కీచురాళ్ళ పాటకి ,  కప్పల గొడవ,గాలిహోరు పక్క వాయిద్యాలతో  కచ్చేరీ జరుగుతోంది.  
 నాతోపాటు రెయిన్ కోట్ ని కూడా వెనక్కి తోస్తున్న గాలితో  సుమో పహిల్వాన్ లా పోరాడి గేట్ తీశాను.
మూడ్  బాగోలేక టీ తాగొచ్చు, ఇంకేదో చెయ్యచ్చు అని వెళ్ళిన నాకు ,
 చావు పరిచయం ఉన్నదే అయినా నిర్ఘాంత పరిచే దృశ్యం ఎదురయింది.

పశువుల హాస్పిటల్  లో మనిషి శవం తో ఏడుపులు ,
రానురాను మనుషులు పశువులవుతున్నారని  డ్రమాటిక్  ఐరనీ తో చెప్తున్నట్లుంది.
 కొన్ని పదాలు  తటాలున  మనసులో మెదుల్తాయి.
ముసలావిడ అప్పుడంటున్న మాటలు 'అశనిపాతం' లా తాకాయి.
"" నాయనా కొండయ్యా.  ఇద్దరూ వొయసులో ఉండారు. మళ్ళా గుంటో ,గుంటడో కడుపున పడకపోరు.
 వొంశం కోసం కనకా తప్పదూ, పెంచకా తప్పదూ తండ్రి.
ఎండీబంగారంలాటి గేదెనెట్లా తెత్తాడయ్యా నా బిడ్డ.
బగమంతుడా నీకు దయ లేదు సామీ. ""

వింటున్న నాకు మనసు వికలం అయిందో , శకలం శకలం గా  బద్దలయ్యిందో  తెలీదు.
పెద్దాయన ముఖంలో ఏమిటా  అంతుచిక్కని భావం?  నిర్లిప్తతా? నిస్సహాయతా?విషాదమా? వైరాగ్యమా?

మర్నాడు ఉదయాన్నే , ఒత్తిడి తగ్గించుకోటానికి  వెళ్ళే మార్నింగ్ వాక్ , వర్కవుట్ నించి ఆయన ప్రహరీలోకి నడిచాను.
కళేబరానికి , శవానికి , మిగిలిన జీవచ్ఛవాలకి తిరుగు ప్రయాణం ఏర్పాట్లు చేసి ,
బలవంతాన  ఇడ్లీలు దోశలు తినిపించి , కాఫీలు  తాగించే ప్రయత్నం చేస్తూ
అనుచరుల జేజేలందుకుంటున్న లోకల్  నాయకుల ఔదార్యం   
స్వార్ధం లా కనిపించే  సినిసిజం నుంచి   బయటపడే మార్గం వెతికాను.  
వీళ్ళు చెయ్యగలిగింది ఇంతేనా అని మనసులో తలెత్తి , ప్రబలమవుతున్న అనుమానం.

గుమ్మంలోకి నడిచాక  లోపల్నించి కాఫీ ఘుమఘుమలు వస్తుంటే , "మార్నింగ్ సార్ "
అని అరిచి నాకూ ఒక కప్ అని సంకేతమిచ్చాను.
ఎదురుగా టేబుల్ మీద ఆయన అడపాదడపా భావాలను భద్ర పరుచుకొనే తెల్లకాగితాల పుస్తకం గాలికి
రెపరెపలాడ్తోంది.
రోజూ  చూపిస్తారూ చూస్తానూ  కనుక  యథాలాపంగా ఆఖరి పేజీ తిరగేశాను.

It is a hardcore thought which was forcibly rubbed into her ,
culminating out of  lifetime of  misery and suffering from poverty  
which created  this  realistic otherwise pitiable perspective..


జీవితకాలం కష్టాలు , పేదరికం తో పీడించబడి బలవంతాన రుద్దబడిన
 దయనీయమయిన వాస్తవిక దృక్పథం నించి బయటపడి
పతాక స్థాయికి  చేరిన కరుడుకట్టిన కటువైన ఆలోచన.

ఆయన రెండు భాష లలో రాసింది ఏమిటో,ఎవరి గురించో  భావం అర్థం అయింది.
కానీ ఈ ప్రపంచం గురించి, కొన్ని జీవితాల గురించి అవగాహన  మాత్రం
అసందిగ్ధంగా అసంపూర్ణంగా అసమంజసంగా అనిపిస్తూ మిగిలిపోయింది .
ప్రస్తుతంఆయనతో చర్చకు కానీ,సంభాషణకు  కానీ సిధ్ధంగా లేననిపించింది.
 దిగులా,దిగ్భ్రాంతా,దుఖమా తెలియని వివశత లో  దిగ్గున లేచి ఇంటి వైపు నడిచాను.


.