పదిసార్లు వాయిదా పడిన పూర్వ విద్యార్థుల కలయిక -- ఫలానా తారీఖున
ఊహలు ఉవ్విళ్ళూరుతుంటే
గుండె గుబగుబమంటోంది.
తొలిఆకర్షణలు చిలిపిఅల్లర్లు
అరమరికలు అమరికలు లేని కలుపుగోర్లు
canteen playground
వనభోజనాలు నాటకాలు ఏకపాత్రాభినయాలు
'విశాల'నయనాలు 'కమల'నయనాలు
అమాయకపు చూపులు ఎన్నెన్నో జ్ఞాపకాలు.
శ్రీశ్రీని సతతం వల్లించిన రాబోయే మరోప్రపంచపు కాబోయే విద్యావేత్త.
ఒక శ్రీ ని వదిలేసి, శేషం వెంట సతమతపడి ఆర్ధికప్రపంచం గణించిన , గడించిన వ్యాపారవేత్త.
( అదంతా చెత్త అనను కానీ అపుడు అవగాహన లేక అంతా కొత్త )
మనూళ్ళోనే టీచరూ రెవెన్యూ అటకదా" ఇద్దరిని పలకరిస్తే ( చిన్నప్పటినుంచీ సఖ్యత )
వడ్డీ వ్యాపారం రియల్ ఎస్టేట్ కూడా చేస్తున్నాం.( ఇప్పటికవే ప్రాముఖ్యత )
కోటు గురించి కోట్ల గురించి బూటు గురించి బూట్లెగ్గింగ్ లాభనష్టాల గురించి వివరిస్తున్న వీడు
తాగుబోతు తండ్రితో అష్టకష్టాల వల్ల మద్యనిషేధం గురించే మాట్లాడినవాడు.
Deter gent motto తో పురుషులు పురుగులు అని detergent లా ఉతికి ఆరేసే కమలకు
Urgent గా uncogent గా ఒక కలంస్నేహంతో కవలలూ విడాకులూ ఒకేసమయంలో Delivery.
కనిపెంచినా కనిపించని దైన్యం మొక్కవోని ధైర్యం.
పిల్లలు చదువులు ఉద్యోగాలు
మనవడు మనవరాలు గొప్ప.
మనసుకు నచ్చిన జవరాలు
మనుగడ సాగిన వివరాలు తప్ప.
ఒంటిమీద suit మాటల్లో suite penthouse
బట్టతలలు సిరిబొజ్జలు కళ్ళజోళ్ళు ఖరీదైనజోళ్ళు అలసినకళ్ళు
పెట్టిన ఆసుపత్రులు, కట్టిన ఆనకట్టలు
Projects products industries in the pipe line
అక్కడక్కడా విగ్గులు.
లేవేం పగలబడి నవ్వులు హగ్గులు
పట్టుచీరలు రత్నహారాలు వజ్రాలగాజులు ఆలయనగలు భారీశరీరాలు
ఆయాసాలు ఆపసోపాలు నిద్రలేమి ఆవలింతలు.
మాయమయిన సన్నటి శలాకలు
అంతరించిన గిలిగింతలు పులకింతలు.
స్తోమత , హోదా అంచనావేసే పరకాయింపులు
చర్చ----పార్టీ ఫిరాయింపులు ప్రభుత్వగిరాయింపులు
బడ్జెట్ కేటాయింపులు పన్ను మినహాయింపులు,
విదేశీమారకాలు అపస్మారక కారకాలు
ఆరోగ్య సూత్రాలు రోగనిదానాలు.
"ఒరే రారా పోరా ఏమ్మాయ్" వెదికినా మాయం
"నువ్వు మీరు శ్రీవారు అమ్మా" మాటకు సాయం.
కాలం మరిచి తెల్లవారుజాముదాకా వదలని మమకారం ప్రతిక్షణం ఆనాడు.
గంట గడిస్తే చాలు అసహనపు కదలిక గడియారం వీక్షణం ఈనాడు.
మీ నాన్న పిలుస్తున్నార్రా అంటే ఉంటార్లే కబుర్లవనీ అన్నవాళ్ళు
" I have to take this call " పలుమార్లు. వారి శిథిలాల ఆనవాళ్ళు.
చిరునామా నంబర్ అడక్కుండా " let us be in touch" గడుసోళ్ళు.
కడుపునిండా తిని ఆ పైన చిరుతిళ్లు మెక్కినవాళ్ళం. అది చెరువా పొట్టా!!!
" I am on a diet." తగ్గించా బాగా.ఉప్పు కారం తీపి పులుపు --- అంతు లేని చిట్టా
సాయంత్రం టీ తాగి " మావా ! నీదగ్గరెంతుంది " అని పోగేసిన మూక .
" I will take the check " అని పదిమంది కేక.
( Money already collected you know )
" will take the raincheck " పదిమంది ఊక.
( మళ్ళీ ఇలా కలుస్తామా ఏంటి )
రాత్రికి కలుద్దాంరా. ఫలానా వాడినీ, వాడినీ వాడినీ , వీడిని రమ్మన్నా.రెండ్రోజులుండండి.
మారీ మారని , మరీ మారని , అసలు మారని
మేమంతా గడిపిన కాలం మరపురాదు చిరకాలం.
కుంచించుకుపోతున్న శరీరానికి మనసుకు చిన్న ఓదార్పూ ఔషధం బలం
చెంగల్వకు చందనం అద్దినట్టు
మల్లెపువ్వుకు మంచిగంధం అందినట్లు
సన్నజాజి సుగంధం చిందినట్టు
పరిమళం పంచిన స్నేహ బంధం ఏమైనట్లు?
తనువులకే కాదు మనసులకూ వృద్ధాప్యం .
అన్నీ ఎవరికీ చెప్పుకోలేం .బహు గోప్యం.
వీడ్కోలు హృదయం భారం అనుకున్నా
శిరోభారం. మనసు గరంగరం.
పరామర్శలు మాని విమర్శలతో మిగిలిన నేనూ ఆ తాను లో ముక్కనే.
నడిచే గడిచే కాలపు ఉలి దెబ్బలకు స్వప్రమేయం లేకుండా రూపాంతరం చెందిన చెక్కనే.
September 7, 2020
పూర్వ విద్యార్థుల కలయిక
Subscribe to:
Posts (Atom)