ఇది నరసింహ ఆత్మీయులు, బంధుత్వం కలిగిన వారు, ఏదో ఒక విధమయిన సంబంధం
కలిగినవారు, తెలిసినవారు అందరి మనస్సుల్లో మెదిలిన అభిప్రాయం, వాంఛ.
అక్షర రూపం మాత్రమే నాది.
మనీషి .
వేలమందికి వైద్యం చేసి ఉసురుపోసే మహిమ
వందలమందికి విద్య నేర్పి దారిచూపే గరిమ
వాక్చాతుర్యంలో పటిమ
విరించి అత్యంత శ్రద్ధతో ఊపిరూదిన ప్రతిమ.
స్వయంరోగనిదానం చేసుకోగల
అసహాయమేథావి
చిరునవ్వుతో సదా అలంకృత పెదవి
బంధుప్రీతిలో సర్వ జనులకు హితుడి పదవి
స్నేహగంధపు పూల తావి
దైన్యంలో శూన్యంలో ఆలంబన
వేదనలో రోదనలో సాంత్వన
ఉచ్ఛ్వాస నిశ్వాసాలకు ఆశ్వాసం
ఆతిథ్యమిస్తే భుక్తాయాసం
ఆనందాలకు ఆహ్లాదాలకు ప్రోత్సాహం
అలుపెరుగని ఉత్సాహం
వెన్నుదన్ను పట్టుకొమ్మ అండదండ.
అలసినపుడు చేరబడే రత్నపుగోడ
సొలసినపుడు సేదతీర్చే శీతోష్ణాల నీడ
చెడు తలపే తన ఊహలో మెదలదు
మంచి చేసే తాపత్రయం వదలదు
కూడగట్టిన పుణ్యం ఊరికే పోదు
కట్టుగట్టి వెంటనంటి చెదరదు
మంచికి మద్దతుదారు
దారి తప్పనివ్వని కాపలాదారు
కోహినూరు
కాదిది ప్రశంస
తనో జనంలోని పరమహంస
సత్యం సత్యం తనో ఆణిముత్యం
కల్పవృక్షం సర్వజనంస్వపక్షం
విశ్వపరిచయం చేసే విశాల గవాక్షం.
పొగడ్డం అశక్యం.
వెలకట్టలేని మాణిక్యం
స్థితప్రఙ్ఞుడు కృతనిశ్చయుడు
అజాతశత్రువు కామధేనువు,
నరసింహం నిగ్రహవిగ్రహం శాంతిగృహం
తనతో సంభాషణం తీరని దాహం.
తన సాహచర్యం దప్పితీర్చే అమృత ప్రవాహం.
సకలజనబాంధవుడు
శింగంపల్లి వంశాశ్రిత మాధవుడు.
మావాడు మనవాడు అందరివాడు.
మా అందరి ఆయుష్షు పోసుకొని
వజ్రకాయం చేసుకొని
చిరంజీవి కొనసాగించాలి నిరాటంక నిరంతర పయనం .
పరంజ్యోతి మా ఆయుర్దాయం పెంచే దైవశాసనం సాధనం.
