సద్విమర్శలు.
కథ రాసిన తర్వాత వచ్చిన చక్కటి విమర్శలు ,ప్రశంసలుఅంతర్మథనానికి తావిచ్చాయి.
భార్య ఓర్పుగా ఉండటం,భర్త మెచ్చుకోలులో కూడా తను గొప్ప వాడు కనుక భార్య గొప్పదనం గుర్తించాననే అహం కనపడటంఅంతరిస్తున్న పురుషాధిక్య సమాజం తాలూకు అవశేషాలు అని నాకు కూడా అనిపించింది.
కాని ఆ అహం భర్తది కాక రచయితదేమో.
వ్యక్తి ఒక యుగసంధిలో నిలిచినప్పుడు, మార్పులు చేర్పులు జరుగుతున్న సమాజంలో భాగమయినపుడు.
గత వాసనలు మనసులో సుప్తావస్థలో (sub conciously) వేలాడుతూనే ఉంటాయి.
కానీ --- ఏ లోపం లేని ఉన్నతమయిన పాత్ర సృజన దాదాపు అసాధ్యమేమో..
ఎందుకంటే ఈ రోజు బహిర్గతం కాని , లేక ప్రస్తుత సమాజపరం గా తప్పుగా ఎంచబడని విలువలు రేపు మారవచ్చు.
ఉదాహరణ కు ఎంతో సంస్కారం కలిగిన విశ్వనాథ్ ,జంధ్యాల కలయిక లో శంకరాభరణం వచ్చింది.
అల్లు రామలింగయ్య సోమయాజులు సంబంధాలు వదులుకోవడం గురించి చెప్తాడు.
"ఆ కుర్రవాడితండ్రి గరిటె తిప్పాడనిన్నీ ఈ కుర్రవాడి తల్లి సకేశి సాంప్రదాయం మంచిది కాదనిన్నీ" వద్దన్నావు అంటాడు.
సకేశి అంటే తలవెంట్రుకల విధవ అనుకుంటాను. ఇది తప్పే. వివక్షే.
దర్శక రచయిత ల బాల్యంలో లేక యవ్వనం లో ఈ వితంతువుల చేతిభోజనం లేక వడ్డించిన భోజనం మత పెద్దలు స్వీకరించడం నిషిద్ధం.
వీరిద్దరి లోని పాత వాసన ఉదాత్తమయిన సోమయాజులు పాత్ర లో చొరబడింది.
వంటవాడి వృత్తిని చులకన చేసే భావం కనిపిస్తుంది.
పోటిగరాఫుల పంతులు బంట్రోతు తో కన్యాశుల్కం గిరీశం
" రేప్పొద్దున్న యివ్వకపోతే మాలవాడి కొడుకు ఛండాలుడు." అనడం కూడా ఈ కోవకు చెందిన సంభాషణ గా నాకనిపిస్తుంది.
పాత్రల తప్పొప్పులు రచయిత వే. కానీ పాత్రలు కాలానుగుణంగాఉంటాయి, అసంకల్పితంగా అయినా.
ఇది సమర్థన మాత్రం ఖచ్చితంగా కాదు.( pleading guilty innocently)





