దృక్కోణం
కవితల పోటీ.కవి తలపోటు.
తప్పేముంది .
తప్పేదేముంది.
ఇవ్వబడిన ఇతివృత్తం::--- మహత్తర మానవ ఇతిహాసం. మహోన్నత మానవ జాతి గురించి.
తలపుకొచ్చిన ప్రథమ పంక్తి. ::---- "" నరజాతి చరిత్ర సమస్తం పరపీడన పరాయణత్వం.""
రాసిన కవిత.::-- అనాథశవం.
"మీ కవిత ప్రచురణార్హం కాదు. "
కారణం?
"వాడి ప్రయాణం లో నవత ,కథ లేవు."
అతని మరణం లో కలత , వ్యథ కలవు.
"వాడికి ' కొంప ' కనీసం సొంతూరూ లేదు."
అతని ' గోడు ' వీసం ఎవరూ వినలేదు.
"జాలి ఆశ దయ వంటి మానవ విలువలు గల కోట్లమంది పురిటిగడ్డని మీరు మరిచారు "
కర్కశంగా నిరాశతో నిర్దయగా వలువలు లేకుండా గుడిమెట్ల మీద పసిగుడ్డుని వదిలారు.
"అవగాహన లేని వాదన అనవసరం అభ్యంతరకరం .
మీరు జాతిశత్రువు.
ఇక చాలు. "
అతగాడి లోని రోదన అనవరతం నిరంతరం
కవితా వస్తువు .
ఆగని క్రతువు.
ఇది మొదలు.
తదుపరి పోటీ. ::---- 1. వృక్షసంపద.
తదనంతరం పోటీ ::---- 2. సకల జీవరాశి ఘనత.
నా ప్రయత్నంగా నేను తప్పక రాస్తాను.
మీకు వివరిస్తాను
మిమ్మల్ని సవరిస్తాను.
పాడితే గెలిచే నా పదం ఆవిష్కరణ
ఓడితే తమచే నా పథం బహిష్కరణ.
1. తుంపర్లకి తుఫాన్లకి , ఒకేలా చలించి తలవంచి , కూలిపోక నిలిచి ,
తల ఎత్తుకు నిలబడే వెఱపెరుగని " గడ్డిపరక ". (తృణం)
2. తలకు మించిన భారం మోసే శ్రమజీవి అలుపెరగని
అవిశ్రాంత సైనికుడు " చలిచీమ " ( పిపీలికం)