| |
అపరాజిత
గారు ఈమధ్యనంతా అన్యమనస్కంగా ఉంటున్నారు . మిన్ను విరిగి వెన్ను మీద పడినా
చలించని ఆవిడ , కొద్ది రోజులుగా జరుగుతున్న తనకు నచ్చని , మింగుడు
పడకుండా గొంతుకు అడ్డం పడుతున్న , వరుస సంఘటనలతో కలత చెందుతున్నారు.
సరిదిద్దడానికి స్వయంగా రంగంలోకి దిగాలేమో అన్న ఆలోచన మనసులో మెదుల్తోంది.
ఆవిడ సహజంగా తన మృదువైన దృఢత్వం తో సొంత నిర్ణయాలని ఆచరణలో పెట్టే వ్యక్తి. అందుకే తండ్రి కష్టపడి పైకి వస్తూ , తన సామ్రాజ్యం విస్తరించడానికి సరైన సైన్యాధ్యక్షుడిగా ఎంపిక చేసిన వాళ్ళలో , బీదతనం అనర్హతే అయినా తెలివితేటలు సమతూకం చేస్తాయని ఒకరిని వరించారు. తండ్రి రాజుగా, తను మంత్రిగా ఆయనను విజయవంతంగా నడిపించారు. భర్త అధ్భుతమయిన సక్సెస్ లో తన పాత్ర , తన తండ్రి పాత్ర ఆయన ఎప్పటికీ మరిచిపోకుండా ఆవిడ చూసుకుంటూనే ఉంటారు. కానీ ఈనాటికీ శ్రీవారిలో మంచితనం అనే బలహీనతతో ఆవిడ సర్దుకొనిపోక తప్పటంలేదు.
భర్త పెళ్ళైన కొత్తలో ముద్దుగా "అప్పూ" అని పిలిస్తే వెంటనే సున్నితంగా , పేరు పెద్దది అనిపిస్తే "అజిత" అని పిలవమని నిర్దేశించారు. ఆవిడకి ఓటమి అన్నా , కూటమి అన్నా సమానమయిన అయిష్టం. స్వంతమయిన, స్వతంత్రమయిన గెలుపంటే ఇష్టం. అందుకే తన పేరన్నా , తన ముద్దు పేరన్నా తనంత ఇష్టం. ప్రత్యర్థులు లేని విజయాన్ని ఆవిడ ఎక్కువగా ఆస్వాదిస్తారు , ఎన్నికలలో ఏకగ్రీవాల్లా.
శ్రీవారి ఆరోగ్యం కొంచెం ఒడుదుడుకులకు లోనవడంతో, విదేశాలలో చదివి వచ్చిన చిన్న బాబు గారు తండ్రి స్థానాన్ని క్రమేపీ భర్తీచేశారు . వారు సారధ్యం వహించడం ప్రారంభించిన తర్వాత చేపట్టిన మార్పుల్లో " హ్యుమన్ టచ్ మిస్సింగ్ " , " టూ ప్రాక్టికల్ " లాంటి మాటలు వినిపించినా , లాభదాయకత పెరగడం తండ్రి కన్నా అమ్మ గారికి పుత్రోత్సాహం కలిగించింది. " When the competition is fierce you must be fiercer " అన్నది అబ్బాయిగారి motto . కానీ కుమారుడిది అతిమిత్రత్వ స్వభావమేమో అని madam చిన్న ఆందోళన కలిగి ఉన్నారు. '"సెలెక్ట్ ఫ్యూ" తప్ప మిగిలిన వారినందరినీ గుండెగుమ్మం దగ్గరే ఆపాలి , అంతకుమించి ముందడుగు వేసేందుకు అవకాశం ఇవ్వకూడదని వారి దృఢాభిప్రాయం.
మనసు పుష్పకవిమానం కాదు కదా అందరినీ ప్రేమించి , ఆహ్వానించి , చోటివ్వటానికి .
ప్రస్తుతానికొస్తే , అప్పుడప్పుడు దగ్గరలో ఉన్న ఫాంహౌస్ కి ఫ్రెండ్స్ తో వెళ్ళి సరదాగా గడపటం అలవాటు. కొద్ది రోజుల క్రితం అక్కడ పేకాడుతుండగా గోడ మీది బల్లి రెక్కలపురుగును మింగడానికి ప్రయత్నిస్తోంది. ఒకసారి వెలుతురు లోంచి,మరోసారి నీడలోంచి , కనబడుతూ, నక్కుతూ , పొంచి చూస్తూ guerilla విద్యలన్నీ ప్రదర్శిస్తూ దాడి చేస్తోంది. పురుగు అతీంద్రియ శక్తి కలిగి ఉన్నట్లు , తద్వారా శత్రువు ఉనికిని పసికట్టగలిగినట్లూ , బల్లి దగ్గరకి వచ్చాక ఎగిరి మరొక చోట వాలుతూ పదేపదే తప్పించుకుంటోంది. బల్లి ఆఖరి ప్రయత్నంగా వేగం పెంచి జరజర పాకుతూ వెళ్ళింది. పురుగు తప్పుకోడంతో బల్లి కిందపడింది. అమ్మ గారికి ఇది చాలా అన్యాయంగా అనిపించింది. దేవుడు బల్లిని సృష్టించినప్పుడే పురుగులనూ ఆహారంగా సృష్టించాడు. నియమాలకు వ్యతిరేకంగా పురుగు ప్రవర్తన.....సర్వెంట్ ని పిలిచి , హిట్ కొట్టించి పురుగును చంపించినా ఏమూలో అసంతృప్తి. బల్లిని సింబాలిక్ గా ఒక వర్గానికి ప్రతినిధిగా ఆవిడ భావించారు. ఆ రోజు మూడ్ బాగోలేక రాత్రికి అక్కడే పడుకుండిపోయారు.
మర్నాడు ఉదయాన్నే కుక్కని వాక్ చేయిస్తున్న సర్వెంట్ ని చూస్తూ బ్రేక్ ఫాస్ట్ చేస్తున్నారు. సూర్యుడు ఎంతో వినయంగా చెట్ల ఆకులమాటు నుంచి పడీపడని వెచ్చని ఎండతో D విటమిన్ సర్వ్ చేస్తున్నాడు. కోయిల విధేయతతో ఆగి ఆగి పాడుతూ ఆహ్లాదాన్ని అందిస్తోంది. గాలి ఎంతో అణకువగా , మెల్లగా వీస్తూ ప్రశాంతతకు భంగం కలగకుండా చూసుకుంటోంది. కుక్క యజమాని గారి దర్జాకి , దర్పానికి అనుగుణంగా ఠీవిగా
( గ్రామ) సింహంలా నడుస్తోంది. కొద్దిగా మనసు కుదుట
పడుతున్న వేళ జరిగింది మరో సంఘటన. విశ్వాసం కలిగిన కుక్క , సర్వెంట్
క్వార్టర్స్ లో ఉండకుండా , ఆవరణమంతా తనదిలా తిరుగుతున్న తోటమాలి కొడుకు
మీదికి బాధ్యతగా ఉరికింది. గొలుసు తో ఉంది కనుక వాడిని అందుకోలేక
సతమతమవుతోంది. తప్పు చేస్తున్న భయం లేకుండా , పెద్ద కుక్క అన్న భయం
లేకుండా కర్ర తీసుకొని ఆ వెధవ ఎదురు తిరిగాడు. కుక్క తోక ముడిచి
సర్వెంట్ వెనక దాగుంది. పగలబడి నవ్వుతున్న వాళ్ళిద్దరినీ చూస్తుంటే
ముంచుకొచ్చిన కోపం ఇంకా మనసులో ఒక మూల వేధిస్తోంది.
ఈ మధ్యనే బాబు స్నేహితుడు Mr.నరేష్ ( I.P.S) బదిలీ మీద వచ్చిన సందర్భంగా ఇచ్చిన
ఈ మధ్యనే బాబు స్నేహితుడు Mr.నరేష్ ( I.P.S) బదిలీ మీద వచ్చిన సందర్భంగా ఇచ్చిన
పార్టీకి అందరినీ
పిలిచారు. అబ్బాయిలందరూ మందు లోకి దిగిపోయేరు. వాళ్ళ లోకం
వారిది,వేరేది. అబ్బాయిగారు " ఫీల్ ఫ్రీ. నో ఇన్హిబిషన్స్. ఎవరి నాన్న ఇటు
వైపు రారు. ఎంజాయ్ " అని ప్రోత్సహిస్తున్నారు.
అన్ని సంస్థల ఉద్యోగులు రావడంతో కుటుంబాలు కోలాహలం చేస్తున్నాయి. కొద్దిసేపటికి అంతస్థుల అంతరాలబట్టి , తెలియకుండానే ఆడపిల్లలంతా రెండు groups గా చేరేరు . ఎవరి తాహతునుబట్టి వారు ప్రవర్తిస్తే , తారతమ్యాలు సరిగా పాటించబడే క్రమశిక్షణ వలన , madam గారికి అన్నీ సక్రమంగా జరుగుతున్న భద్రతాభావం ఇనుమడించి తృప్తి గా ఉంటుంది. అటువైపు నుంచి Gucci,chanel, DeBeers ఇటువైపు నుంచి ఆ బట్టల షాప్ ,ఈ నగల దుకాణం , రెండు వైపుల నుంచి careers,చదువుల చర్చలు , లోకాభిరామాయణం .
అమ్మగారికి గార్డెన్లో చక్కని గడ్డిపువ్వులన్నీ ఒకవైపు , మనోహరమయిన గులాబీ తోట మరోవైపు ఉన్నట్లు తోచింది. వారికి ఆ సమయంలో ఏ పువ్వు అందం దానిదే అన్న ఉదాత్తమైన ఆలోచన వచ్చి గంభీరంగా అభినందించుకున్నారు. అందం కన్నా హుందా , హోదా వారి దృష్టిలో విలువైనవి . గులాబీల మధ్య అబ్బాయిగారు వివాహం చేసుకోబోయే Miss. నీలిమ ప్రత్యేక ఆకర్షణ.

Oxford suit లో చికాకు అంటే అయిష్టంగానే పట్టుబట్టలు కట్టించినా, ఏమీ పట్టనట్లు భర్త ఉద్యోగులతో కలసి విరగబడి నవ్వటం , ఆవిడకి చిరుద్యోగుల విరగబాటులా, చిన్న తిరుగుబాటులా కనిపించి , అనిపించి రుచించలేదు. పిలిపించి శ్రీవారిని మంత్రి గారు, కలెక్టర్, మిగతా రాజకీయ, పుర ప్రముఖుల సముఖంలో నిలవమని సున్నితంగా అభ్యర్థిస్తున్న శరీరభాషతో విశదంగా ఆదేశించారు.
వజ్రాల నగలు , దుస్తులూ మెరిసేలా మెజెస్టిక్ గా మహారాణి , " యువ " రాజమాతలా , వెలుతుర్లో కూర్చున్న అమ్మ దగ్గరికి నరేష్ వచ్చి కూర్చొని కబుర్లు చెప్తున్నాడు. వింటున్నాగానీ తను గమనిస్తున్న విషయాన్ని అతనూ చూస్తున్నాడని ఆవిడ పసికట్టేరు. కొడుకు గడ్డిపువ్వుల్లోకల్లా అందమయిన , ఆ మాట కొస్తే అందరికంటే అందమయిన అమ్మాయితో చాలా సరదాగా, చాలా చనువుగా ------ . సందడిలో ఆ విషయాన్ని మరెవ్వరూ అంతగా గుర్తించక పోవటం కొంత ఊరట.అందరికీ అంత నిశిత దృష్టి , సునిశిత పర్యవేక్షణా నైజం ఉండవుగదా!!
మిత్రులిద్దరూ మెల్లిగా నడుచుకుంటూ గార్డెన్లో చెట్ల మాటున కూర్చున్నారు. నడుస్తూ నడుస్తూ యాధృచ్చికంగా మేడం గారు కూడా కనబడకుండా వినబడేంత దూరంలో నిలబడ్డారు. నరేష్ " రాజుగాడు నాకూ జూనియరే, ఫ్రెండే. నువ్వు వర్రీ అవకు . మార్జిన్ మనీ అదీ నువ్వు ఎరేంజ్ చెయ్యి ముందు. నాది గ్యారంటీ " అనడం , బరువు దించుకున్నట్లు బాబు నవ్వటం ఆవిడకి రుచించలేదు. ఎవరికో , ఏదో సాయం అన్నదిమాత్రం అర్థం అయ్యింది. మనకు పనికిరాని ప్రతి సాయం అపాత్రదానమేనని , అపాత్రదానం అనర్థదాయకం అని ఆవిడ తండ్రి గారు ఏనాడో సూత్రీకరించారు.ఆవిడ ఆనాడే ఏకీభవించారు.
నాలుగు రోజుల తర్వాత సాయంత్రం వేళ ఎప్పటినుంచో తమ వద్ద నమ్మకంగా పని చేస్తున్న ఉద్యోగి వచ్చేడు. పూర్వాశ్రమంలో స్నేహితుడవటం వల్ల అతను అయ్యగారితో అతిచనువుగా ఉండటం , శ్రీవారు అది సమంజసమే అని భావించటం అమ్మ గారికి నచ్చదు. చిన్నతనంలో నందుడి వద్ద రాజసంపదలు లేని బాల్యంలో మిత్రుడయిన కుచేలుడికి , తర్వాత కృష్ణుడు సకలమర్యాదలు చెయ్యటం విషయంలో దేవదేవుడి మీదే వారికి చిన్న కినుక. ద్రుపదుడు, ద్రోణుడికి చేసిన అన్యాయమేమిటో వారికి అర్థం కాదు , చేసుకోవలసిన అవసరం లేదు.
" సార్ తో మాట్లాడాలి, అమ్మా మీరు కూడా వినవలసిన ముచ్చట " అన్నాడతను. సారాంశం. వాళ్ళబ్బాయి, అతని ఫ్రెండ్ చిన్న బాబుకి జూనియర్స్. P.G. తర్వాత రీసెర్చ్ , కొంతకాలం ఉద్యోగాలూ చేసి , దాచి పోగేసిన డబ్బుతో , స్వంత కంపెనీ ప్రారంభించి , కొత్త ప్రోడక్ట్ తయారీ లో ఉన్నారు. ఉద్యోగం మానేసి వ్యాపారం లో దిగటం మనలాంటి వాళ్ళ కి అచ్చిరాదని చెప్పినా వినలేదు. చేతిలో డబ్బు అయిపోవస్తుండడంతో ఎప్పటినుంచో ప్రయత్నం చేస్తున్న bank loan గురించి తిరుగుతున్నారు.
బాబు , వీరి విషయం లో ముందు నుంచి ఆసక్తి చూపిస్తూ ప్రోత్సహిస్తున్నారు. Bank loan విషయంలో వారు మార్జిన్ మనీ సమకూర్చటానికి ఒప్పుకుని , గ్యారంటార్ గా ఉండటానికి నరేష్ గారినిఒప్పించేరు. పార్టీ అయిన తర్వాతి రోజు ఈ తతంగం జరగాలి . దురదృష్టం . ఆ రోజు రాత్రి పార్టీ లో తాగి కారు నడుపుకుంటూ బయల్దేరారు. దారిలో మరో కార్ ని గుద్దేసేరు. కొడుక్కి కాళ్ళు , ఫ్రెండ్ కి భుజం విరిగేయి.
ఎదుటి కార్, కార్ డ్రైవర్ వెల్ బిల్ట్ కావడంతో మైనర్ డ్యామేజ్ తో తప్పించుకున్నారు. కొద్దిపాటి మైకంలో ఉండటంవల్ల , గాయాల వల్ల వీళ్ళిద్దరూ ఎదుటి కార్ లో వెనుక సీట్లో గుండెజబ్బు వ్యక్తి ఉన్నాడని, ఆ వ్యక్తిని పోలీసులు హాస్పిటల్ కి తరలించారని ఏమాత్రం గమనించలేకపోయేరు. నరేష్ గారు సమయానికి అక్కడికి చేరుకొని అన్ని చూసుకున్నారు.
రాజీ ప్రయత్నాలలో కార్లకి , గుండెకి , వీరిద్దరి చికిత్సకు ఖర్చంతా బాబే భరిస్తే , కేసు కాకుండా నరేష్ చూసేరు.మార్జిన్ మనీ డబ్బు ఇలా ఉపయోగపడింది. ఇకపై కంపెనీ నడిపే అవకాశాలు లేవు కనుక , బాబుని టేక్ఓవర్ చెయ్యమని హాస్పిటల్ నుంచే బ్రతిమిలాడి , కోరడంతో మరో మార్గం లేక వారు ఒప్పుకున్నారు. తండ్రిని మించిన దయామయులవడం వల్ల వారే వాటాలు వేసేరు. చిన్న బాబు కి 50% , వీరిద్దరికి చెరో 20% , నరేష్ గారికి 10%.
పిల్లలిద్దరికీ జీతం కూడా సంప్రదించి నిర్ణయించారు. వారి ఔదార్యానికి ఉదాహరణ నరేష్ గారికి , వారికీ నెలవారీ ఏమీ వద్దనడమే . Capital , loan విషయం వారే చూసుకుంటారు. ఇన్నాళ్ళ తర్వాత ఈ రోజు మధ్యాహ్నం కొడుకు కడుపునిండా తిని , కంటినిండా నిద్రపోతుంటే ఈ వివరాలను చిన్న బాబు కంటే ముందు తను చెప్పి కృతజ్ఞత చెప్పుకోవాలని వచ్చేడు.
"వారు మీ రక్తం సార్ "
రాత్రయింది. బాబు , నరేష్ రావడం , సర్వెంట్ ని పిలిచి నరేష్ కి కూడా భోజనం ఏర్పాట్లు చెయ్యమని , ప్రస్తుతానికి కావలసినవి పురమాయించి తోట లోనికి నడవడం చూసి అమ్మ గారు దూరం నించి వెంబడించేరు. నరేష్ వెనక్కి విలాసంగా వాలి , " SO ! ? " అన్నాడు. బాబు నవ్వుతూ " SO అంటే ఏముంది. 10% తో అగను. ఇల్లు కొనుక్కో. White నీది, black నాది " అన్నారు . " మరో విషయం బ్రో. అనూహ్య మీద నీ ఇంట్రెస్ట్ అమ్మ కూడా గమనించేరు. కంగారు అణచుకుంటున్నారని అనుకుంటున్నాను . వాట్స్ కుకింగ్ ? అన్నాడు నరేష్ .
" రేయ్ ! కోరికలు ఎన్నోవున్నా ఆశయం ఒకటే. క్రేవింగ్స్ ఎన్నోవున్నా ఆస్పిరేషన్, ఆంబిషన్ జనరల్ గా ఒకటే . అందాన్ని అక్కున చేర్చుకుంటాం. మనిషినీ కుటుంబాన్నీ నెత్తికెత్తుకోం. " అని బాబు జ్ఞానోపదేశం చేసేరు.
నరేష్ ముందు తన భావోద్వేగం బయట పడినందుకు తనను తాను మందలించుకుంటూ, రాజయోగా సాధన చెయ్యాలని నిశ్చయించేరు అమ్మగారు. గర్వంగా గాలిలో తేలిపోతూ, తొమ్మిదో మేఘం మీద తన గదికి చేరేరు.
"వాడు నా రక్తం ".
ఫాంహౌస్ మేనేజర్ కి ఫోన్ చేసి కొత్త వాళ్ళని వెదకమని , దొరకగానే తోటమాలిని , కుక్కల్ని చూసే సర్వెంట్ ని లెక్కచూసి పంపించెయ్యమని చెప్పేసేరు.
ఉరుములు. మెరుపులు , సుడిగాలి , చీమలదండు తన పుట్టను అకస్మాత్తుగా చుట్టుముట్టినా ఏమీ కాదనీ, ఒకవేళ అనుకోనిది జరగబోయినా ఆపగలననీ తన స్వశక్తి మీద సంపూర్ణమయిన విశ్వాసం గల నాగరాణి , వచ్చిన చిరు ఆపదలు తమంతటతామే తొలగిపోతే మణికాంతులతో ఎలా తేజరిల్లుతుందో ;
కుటుంబాన్ని చుట్టుముట్టిన దుమ్ములగొండ్ల గుంపును యువకిశోరాలు తరిమికొడ్తే సివంగి ఎలా ఉప్పొంగి పోతుందో ;
అలా ఆ సమయంలో ఆవిడ విలసిల్లారు.
ఆ సమయంలో అపరాజిత గారికి నాన్న గారి మాటలు గుర్తొచ్చాయి. " అమ్మాయి . నేను చేసిన పూర్వజన్మ సుకృతం వలన ఉత్తమోత్తమ మానవ జన్మనొందితినని శాస్త్రం చదివినవారు చెప్పారు. నేను మధ్య వయసు వచ్చేటప్పటికి ఎదిగాను. నువ్వు తరవాతి తరం. నీ యవ్వనంనుంచి ఎదుగుతూ కొడుకు పుట్టేటప్పటికి గొప్పదానివయ్యావు. నా మనవడు 'బార్న్ విత్ డైమండ్ స్టడ్డెడ్ గోల్డెన్ స్పూన్ ' .శివుడి ఆజ్ఞ లేనిదే చీమైనా కుట్టదు.నువ్వు చేసే అన్ని పనులు దేవుడే చేయిస్తున్నాడు. తప్పొప్పులు ఆయనవే. కరణం కారణం కర్త అన్నీ ఆయనే మనం నిమిత్తమాత్రులం.
దూబరా పొదుపు పిసినారితనం
అజాగ్రత్త జాగ్రత్త అతి జాగ్రత్త
ఆత్మన్యూనత ఆత్మవిశ్వాసం అహంభావం
వీటి పరిణామక్రమం నేను అనుభవించాను. నీకవసరంలేదు .యువరాణిగా,మహారాణిగా,రాజమాతగా నీ జీవితం ప్రకాశిస్తూనే ఉంది. నువ్వు చేయవలసినదల్లా అహంకారం,అహంభావం దాచి ముసుగులు వెయ్యటమే. ముఖ్యంగా ఈ బీదాబిక్కి, డబ్బున్నవాడు , కోపంగా "నువ్వు" అంటే ఏకవచనం అని కొంపలు మునిగిపోయినట్లు పేట్రేగిపోతారు. మెత్తగా , మత్తెక్కించి గొంతు కోసినా అమ్మగారి మాటతీరు , హృదయం వెన్న అంటారు."
నాన్న చెపితే నాకు తెలిసిన జీవిత సత్యాలు బాబుకు పుట్టుకతో వచ్చాయని మేడమ్ పరవశించేరు. బాబు ఆలోచించి, " అన్ని " జాగ్రత్తలూ తీసుకుంటాడనీ తప్పటడుగులు , తప్పులు వెయ్యడని , చెయ్యడని ( ???) సంతృప్తిగా వారు నిశ్చయించేరు,నిబ్బరించేరు.
అంతులేని ఆనందం, ప్రశాంతత అనుభవిస్తూ రోజూకన్నా భిన్నంగా ఏమయినా చెయ్యాలని నిర్ణయించేరు . వుడ్ హౌస్, ఐన్ రాండ్ పక్కన ఉంచేరు. భర్త ఎప్పటినుంచో సిఫార్సు చేస్తున్న '" బీదలపాట్లు" అన్న సినిమా చూడడమా లేక " les miserables " నవల చదవడమా అన్న మీమాంస లో ఆ పుస్తకం మీద హోం థియేటర్ రిమోట్ ఉంచి గాఢ నిద్రలోనికి జారుకున్నారు.