September 29, 2022

                                     ఎండమా(యా)వి

నిజం చెప్పే ధైర్యం లేదు.

అబద్ధం  అంటే భయం పోదు

తటపటాయింపు , తటస్థం నాకిష్టం.
ఉద్యోగం నా లక్షణం.
పని ద్వేషం ప్రతి క్షణం.

వాడు భయపడితే ధైర్యం శౌర్యం నావి.
వాణ్ణి భయపెడితే ఆనందం ఉల్లాసం తీరవే తనివి.

వాడు తిరగబడితే ఉదాత్తసంస్కారి,శాంతమూర్తి  నేనే
""వాడిపాపానికి వాడినేపంపే ""  తెగువ అతితెలివి నావే.

తోక ముడిస్తే , వెన్నుచూపితే  , జంకితే , వణికితే ఉరుముతా తరుముతా
జూలు విదిలిస్తే ,  వెన్నొడ్డితే , ఎదురొస్తే , ఎదిరిస్తే  నీరుకారిపోతా పారిపోతా.

ధనవంతుడికి  బలవంతుడికి మర్యాద మన్నన
బాంచను నీ కాలు మొక్కుతా.
నిరుపేదకి ,దుర్బలుడికి అవమానం హేళన.
వంచన . నీ గొంతు నొక్కుతా.

అనివార్యమైతే అతినీతిమంతుడిని
ఆశయం మానవత్వం మమకారం నా నటనకు  ప్రాణాలు.
అవకాశమిస్తే  అవినీతికి రూపాన్ని .
దురాశ దానవత్వం ఛీత్కారం దారుణాలు.

హక్కులకు  పోరాడే  పౌరుణ్ణి
బాధ్యతలకు కట్టుబడని చోరుణ్ణి.

ఏది జరిగినా ఏమి ఒరిగినాఎక్కడయినా
ఎప్పుడయినా  నేనే  నేనే  నేనే.
నక్కజిత్తు కుక్కతోక  డేగదృష్టి  రాబందుబుధ్ధి
నావే నావే నావే.

ఎదురుగా ఉన్నా గుర్తింపు(చ)లేనిమాయలమారిని
ఎదుగుతూ ఉన్న , అదుపులేని  మహమ్మారిని.

సర్వాంతర్యామిని
స(వె)గటుజీవిని.
    

 

                                    సుందరి

పూజారి రమణయ్య గారికి, కమలమ్మ గారికి సుందరి పుట్టినప్పుడు ఊరంతా  "ఎంత చక్కనిది మీ బిడ్డ "  అని  మాయాబజార్  లో సూర్యకాంతం లా ఒకటే పొగిడారు. అమ్మాయిది  ఆఖండ జాతకం, వరపుత్రిక అని , పాప జన్మగ్రహాలను బట్టి  జాతకం రచించి, చెప్పాడు తండ్రి . చదువు,  ధనం,అదృష్టం దేనికీ కొరత లేని జీవితం అని విశదీకరించాడు. కామందుకి ఈ పిల్ల నా కూతురికి పోటీయేమో అనే ఆలోచన కలిగేంతగా రమణయ్య ఆనందించాడు.

తండ్రి అమాయక,పరమభక్త పూజారి కావడంతో సుందరికి వయసుతో పాటు అందము,భక్తి కూడా కలిసి పెరిగాయి. తన భక్తీ , తన పూజలూ , గుడిలో తండ్రికి సాయం ,అమ్మకి అప్పడాలు ,వడియాలు,పచ్చళ్ళు తయారు చేయడంలో, తర్వాత అమ్మడంలో సాయం, రోజంతా గడిచిపోయేది.  వీటన్నిటివల్ల,  చదువు రాక,స్కూలు మానేసినా, భక్తురాలు, బుద్ధిమంతురాలు అనే బిరుదులు మాత్రం ఊరి వారు ఉదారంగా దానం చేశారు.

కొత్త పంచాంగం రాగానే  శ్రద్ధగా తిరగేసి, మథించి ఏ మాసం, ఏ తిథిన  ఏ పండగో, వ్రతమో, ఉత్సవమో,ఊరేగింపో క్షుణ్ణంగా వివరించగల సుందరికి  తెలుగు, లెక్కలు, చదువు  ఎందుకు "వంట"బట్టలేదో!!
"వంట" నైవేద్యానికీ, సంతర్పణలకీ మడితో రుచిగా,శుచిగా  చెయ్యటం  ఎలా వచ్చిందో !!
బల్లి,నల్లపిల్లి శకునాల శాస్త్రం బోధ పడినా సామాన్య శాస్త్రం, సాంఘిక శాస్త్రం బాధ పెట్టాయి.

  కాలికి రాయి తగిలినా,చేతిలో ముల్లు విరిగినా దేవుడి కే మొర పెట్టుకునేది.  కష్టం వస్తే దేవుడి పరీక్ష అనీ  , పడుకోడానికి  చలికాలంలో కటికనేల కాకుండా బొంత దొరికితే, దయామయుడి కటాక్షవీక్షణం అనీ తండ్రి కంటే ముందే గ్రహించేది.

తన తోటివారు బస్సులో పక్క ఊరికి వెళ్ళి చదువుతుంటే, తన పూర్వ జన్మ పాపంవల్ల , పురాకృతకర్మ వల్ల ఈ జన్మ లో చదువబ్బలేదనీ,  బోలెడు పుణ్యం ఇప్పుడయినా చేసుకుంటే మళ్ళీ జన్మలో పంతులమ్మ గానో, కనీసం స్కూల్లో ఆయాగానో తనకు తగిన ఉద్యోగం దేవుడు ఏర్పాటుచేస్తాడని గాఢంగా నమ్మి ఆ మార్గంలోనే నడిచింది . అడుగు బెసగనివ్వలేదు, దారి అంగుళం కూడా తప్పలేదు.

తల్లి సరైన వైద్యం అందక,  శరత్తులోనే శిశిరం వచ్చిన తోటలో ఆకులారాలిపోతే, కాలిపోతే  తండ్రీ కూతుళ్ళిద్దరూ
ఒకరినొకరు ఓదార్చుకొని స్వామి లీలలకు విషాదంగా తల ఒగ్గి, సంబాళించుకున్నారు.  పునిస్త్రీగా కాలం చేసింది పుణ్యాత్మురాలు  అని  ఊర్లో అందరూ అంటుంటే  మిగిలిన మా గతేంటి అన్న ఆలోచనని అణిచేశారు.

ఆ ఊర్లో ఏ ముసలావిడనయినా  "మీ ఆయన మంచం మీద రేపోమాపో అన్నట్లున్నాడుగా, ఆ అదృష్టం నీకు కావాలా?  పోతావా?" అని ఏకాంతంలో అడిగితే, "చెప్పుతో కొడ్తా,నా సంగతి నీకెందుకు"  అంటుందని నా దృఢనమ్మకం.

కాలం  బడుగు  పల్లెటూరి పూజారి కోసం ఆగదు కదా. దరిద్రంలా,చీడపురుగులా,గబ్బిలాల గుంపులా శరవేగంగా దూసుకెళ్లింది. సుందరి , చేమంతిలా చక్కని చుక్కలా, మల్లెమొగ్గలా మనోహరంగా నిర్మలంగా,ముద్దబంతిలా ముద్దరాలిగా పెరిగింది. తండ్రికి మాత్రం వదిలించుకోవలసిన కుంపటిలా,  బరువులా ,  బండరాయిలా, గుదిబండగా ఎదిగింది. గోదాదేవి కథ  చిన్నతనం నుండి తండ్రి చెప్పగా విని తను కూడా దేవుడినే పెళ్ళాడాలని కలలు కనేది.
నువ్వే దిక్కని,  ప్రార్ధన సమయం అహర్నిశలుగా మార్చింది. నువ్వు ఎక్కువగా అభిమానించే స్త్రీ ఎవరంటే తడుముకోకుండా మీరాబాయి అని చెప్తుంది.

పూజారిగారింట్లో పెళ్లి మనింట్లో శుభకార్యం కాదేంట్రా అని ఊరుఊరంతా సుందరి పెళ్లికి సహాయానికి ముందుకొచ్చారు. వీరిద్దరు హర్షాతిరేకంతో, అమందానందంబొంది ఆనందాశృవులు కార్చి కృతజ్ఞతతో కుంచించుకుపోయారు. ఊరిపెద్దలిద్దరూ జయవిజయులని, ఊరివారంతా హరి పరివారమని, ఊరే వైకుంఠమని పులకించి పరవశించారు.

ఏదో గంతకు తగ్గ బొంతలా,  ఆడపెళ్లివారి తాహత్తు కి తగిన సంబంధం జనమంతా కలిసి ( తమ మీద ఎక్కువ భారం పడకుండా జాగ్రత్త తీసుకుంటూ) కుదిర్చారు.
పెళ్ళికొడుకు కొంచెం మంద బుద్ధి. తాగుడంటారా ,తాగనివాడిని ఒక్కణ్ణి చూపించండి ఈరోజుల్లో.  మిగిలిన వ్యసనాలా, అవి పిల్ల చేష్టలు.  బాధ్యత,బంధం తగిలిస్తే తెంపుకొని పారిపోతాయి. మన ఊరికి పిలిస్తే పలికే దూరంలో గుళ్ళో పూజారికి అసిస్టెంట్.  ఆయన పోతే ఇతనే పూజారి.చామన ఛాయ. అందం అంటారా, కనుముక్కు తీరైనవాడే. మన పూజారికి కూడా ముసలితనంలో వాడే ఆసరా. కావాలంటే రెండు గుళ్ళు నిభాయించగల సత్తా ఉన్నోడు.

పెళ్ళిమాటల్లో  ఏమిఅడిగాడో  తెలుసా!!.  కట్నం మీరేమివ్వగలిగితే అదే. అమ్మాయికి భక్తి ఉందా? మడి,ఆచారం,సాంప్రదాయం , అణకువ తెలుసా?  అంతే..... శభాష్.!!!

మార్చ కలిగినది,చేకూర్చకలిగినది ఏమీ లేకపోయినా మాటవరసకు , " సంబంధం మంచిదే కదా"  అని తడబడుతూ సుందరి దగ్గర  మాట నాన్చాడు తండ్రి.  " పెళ్ళి ఏడు జన్మల బంధం అని నువ్వే చెప్పావు కదా.  ఈ జన్మ, మరి కొన్ని జన్మలు నియమనిష్ఠలతో  బతికితే ఎప్పటికయినా ఆయనకు నారాయణాంశతో, నాకు గోదాదేవి అంశతో మోక్షం దొరకదంటావా నాన్నా " అని దృఢవిశ్వాసం తో సుందరి ప్రశ్నించింది.  ఆ నాన్న అవాక్కయ్యి , దుఃఖం అణుచుకుంటూ  అందరితో పాటూ అక్షింతలు వేశాడు.

సుందరి భర్త  "నిత్యాగ్నిహోత్రి."  ఉదయం కళ్ళు తెరుస్తూనే బీడీ వెలిగించటానికి అగ్గిపుల్ల వెలిగించి,  దీపదర్శనం చేసుకొని మంచం దిగుతాడు.   అన్నం పరబ్రహ్మస్వరూపం కనుక  ఫలహారం లేదా చద్దన్నం అతని "సంధ్యావందనం". గుడిలో తప్పితే మిగతా అన్ని చోట్లా, అయిపోయిన బీడీతో  కొత్త బీడీ వెలిగిస్తూ,  చేతిలో ఎల్లవేళలా  అగ్ని ధరిస్తాడు.  సోమయాజి  ( యజ్ఞం చేసినవాడు)  కాకున్నా , సోమరి కనుక గుడిలో  పనిచెయ్యటం అతనికి "యజ్ఞం" తో సమానం. యజ్ఞం అవగానే  ఇంటికి చేరి భార్యకి  బడితె " పూజ" చేస్తాడు.  తిట్ల, బండ బూతుల "పురాణం"  చదువుతాడు. ఆవిడ ఆ పని,ఈ పని చేసి సంపాదించిన పావలాపరక    "దక్షిణ"  స్వీకరిస్తాడు. సాయంత్రం ప్రారంభించిన సోమ(సురా)పాన సేవనం ఏ రాత్రికో  భూతలస్వర్గపు రంభో, ఊర్వశో  ఇంట్లోంచి  బయటికి తోయటంతో ముగుస్తుంది.                    సుందరి మాత్రం తన భర్త వాల్మీకి లానో, భక్తకన్నప్ప లానో మారుతాడని  ఎదురుచూస్తూనే ఉంది.

పెళ్ళి చేసుకొని,  మేకుల మీద పరిచిన పువ్వుల బాటలో నడుస్తున్నానని, ఆ బాట ఇనప ముళ్ళ తీగలా మారి,  కాళ్ళకి చుట్టుకుని,  అడుగు ముందుకు సవ్యంగా  పడనివ్వటం లేదని  తెలిసినా,  ఒళ్ళంతా మనసంతా గాయాలతో రక్తమోడుతూ,హీనంగా, దీనంగా, అసహాయంగా,  అనాథరక్షకుడిని,ఆర్తత్రాణపరాయణుడిని,  తలుస్తూనే కొలుస్తూనే ఉంది సుందరి.

సకలరోగపాలకుడయిన ఆమె భర్త వరశాపంలాగానో లేక శాపవరంలాగానో ఆమెకు ఆడపిల్లని ప్రసాదించాడు. పేరు  లక్ష్మి. ఆ లక్ష్మి  పెద్దదై తన ఇంట్లో నడయాడడం, తాండవించటం చూడకుండా తండ్రి సముద్రుడు ఎండి ఎడారిగా మారి  తడారిపోయి పండి,  పోయాడు.

ఊరి జనం  పడికట్టు పదాల ఉవాచ. " గుళ్ళో పూజారీ ,పుణ్యాత్ముడూ.మంచి వాళ్ళని దేవుడు తన దగ్గర ఉంచుకోవాలని త్వరగా తీసుకెళ్తాడు. అందుకే పరమపదించాడు."
" పరమ మదించాడు. పుచ్చి చచ్చాడు." నా ఆలోచన.

భర్త చనిపోతే,ఇంతటితో నూకలు అయిపోయాయి, శివైక్యం చెందాడు అని సుందరి నిబ్బరించుకుంది. జన్మ జన్మ కి ఈ  భర్తే కావాలా అని అడిగినవాళ్ళు లేరు కానీ  సుందరి సమాధానంగా " పరమాత్ముడు ఎలా తలుచుకొని, ఏది రాస్తే అదే " అనే  అంటుందని నా ఊహ. మరో పెళ్లి తప్పు  అన్న ఆలోచన సుందరిది.  తనని తాను నమ్మించుకోవడం కాదు అది దృఢవిశ్వాసం.  ఎప్పుడో వచ్చే నరకం కంటే  తన గత జీవితం భయానకం అనిపించినా "అంతరాత్మహత్య" కి పాల్పడడమే సుందరి అలవాటు.

కష్టాలలో కాగి కాగి ఉక్కు ముక్క లా మారిన ఎడారి లాంటి మనసు లో మాతృప్రేమ అనే ఒయాసిస్సు  ఏర్పడింది.
లక్ష్మి పెరుగుతున్న కొద్దీ శారీరక పెరుగుదల తో పాటు బుద్ధి వికసించడం లేదని తెలిసింది.  పిచ్చి పిల్ల,పిచ్చి పిల్ల అని తోటిపిల్లలు ఏడిపిస్తుంటే చీర కొంగు కవచం చాటున  లక్ష్మిని దాచి  కాపాడి పెంచింది.  సుందరి జీవితంలో  ఇది మరొక కొత్త మలుపు.  అన్నా,అయ్యా అని పిలిస్తే ఏమిటమ్మా      ( ఏమిటి +" అమ్మా" ) అని పలుకుతూ  వంకరచూపులు చూసే ,తుంటరి చేష్టలు చేసే నీచులను అడ్డుకుంటూ, ఆపుకుంటూ కాలం ఎలా గడిపింది, గడిచింది  అనేది మరో పెద్దకథ, వ్యథ.

ఇన్ని బాధల మధ్య, లక్ష్మి  పెళ్ళి కాకుండానే తల్లి కాబోతుంది అని తెలిసిన రోజు సుందరి దేవుడిని వంద ప్రశ్నలు వేసింది. వెయ్యి సమాధానాలు కోరింది. లక్ష సార్లు చచ్చింది.కోటి జన్మలకి సరిపడా దుఃఖం, బాధ అనుభవించింది.  కుమిలి కుమిలి, కమిలి కమిలి  కొలిమిలో ఇనుపద్రవంలా ద్రవించింది,ప్రవహించింది.
తేరుకున్నాక, తెప్పరిల్లాక  మనసు మళ్ళీ మొద్దుబారింది.  పదునైన ఖడ్గం లా బతుకు యుద్ధానికి సిద్ధమైంది.

పరమాత్ముడిని నిందించటానికి నేనేంత. ఆయన ఆజ్ఞ లేనిదే చీమయినా కుట్టదుకదా. ఇన్ని కష్టాలు ఈ జన్మ లోనే కల్పించాడంటే మరో జన్మ లేదేమో. మోక్షమేనేమో. దయామయుడిని నిలదీయడానికి నా అర్హతేంటి.  తప్పు చేసేనని భయంతో, బాధతో అసంఖ్యాకమయిన మొక్కులు మొక్కింది, ముడుపులు కట్టింది. ఉపవాసాలు, ప్రదక్షిణలు లెక్కలేనన్ని చేసింది. ముక్కోటి దేవతలను కోట్ల కోట్ల  క్షమాపణలు కోరింది.   కాపాడమని  వేడుకుంది. బిక్కచచ్చి బావురుమంది.

వేదశాస్త్రములు చదివినవారే ఎరుగరు సృష్టివిలాసం.
అల్పబుద్ధి తో జ్ఞానదాతనే సలుపకు పరిహాసం.
బాటసారి సినిమాలో భానుమతి పాడిన పాట స్ఫురణకి వచ్చి  స్ఫూర్తిగా నిలిచింది

ఆడపిల్లే పుట్టినా బతికి బట్టకట్టలేదు. కట్టడానికి బట్టలు కొనలేని మన వారి వద్ద మనలేనని  మనవరాలు వెళ్ళిపోయిందని మనస్సమాధానం చేసుకుంటూ, మనసు  మభ్యపెట్టుకుంటున్నానని అర్థమై సరిపెట్టుకుంది సుందరి.

ఇంట్లో చావు సంభవిస్తే దుఃఖించాలా, సంతోష పడాలా తెలియని స్థితిలో   నిర్ఘాంత పోయి నిలిచిన మనిషి నాకు తెలిసి సుందరి మాత్రమే. లక్ష్మికి ఏమీ తెలియదు. చనిపోయిన పాపని చూపించి
" అమ్మా ఈ బొమ్మ ఎవరిదే" అని అడిగింది లక్ష్మి.

ఇప్పుడు సుందరి ఎక్కడ, ఎలా ఉంది అన్నది మీ ప్రశ్న.మీరు ఆ ఊరికి వెళ్ళండి. బస్సు దిగాక ఊళ్ళోకి నడుస్తుంటే   వినాయకుడి గుడి కనపడుతుంది.  మీరు కొబ్బరి కాయ కొని దేవుడికి కొట్టండి.
మీ అదృష్టమో, దురదృష్టమో సమకూరితే ,తన మూడ్ ప్రకారం రాయి తీసుకుని  "దేవుడేడిరా,ఎక్కడున్నాడ్రా వెధవా. దణ్ణం పెట్టావా కాస్కో"  అని మిమ్మల్ని ప్రమాదకరంగా  తరుముతూ,  మీ వెంటపడుతున్నది  లక్ష్మి.

ప్రపంచంలో ఉన్న మొత్తం దుఃఖం, దరిద్రం,దురదృష్టం, దైన్యం, నిస్సహాయత ఒక్క చోట కట్టకట్టి నిలబెట్టినట్టు   మీ ఎదురుగా నిలబడి,కనబడి మీ కాళ్ళ మీద పడి,నారాయణమూర్తి మీకు క్షమాగుణం ప్రసాదించాలని.  మీరే  నారాయణమూర్తి అని ఆక్రోశిస్తూ,     వదిలెయ్యమని  బతిమిలాడ్తోందే ఆ ఆకారమే సుందరి.

  ఇప్పటికీ  ఉదయం, సాయంత్రం  గుడి మెట్లు కడిగి,గుడి ముందు  చీపురుతో శుభ్రం చేసి,నీళ్ళు చల్లి,ముగ్గు వేసి,  గుడి ఎదురుగా, కొబ్బరికాయలు,పూజాద్రవ్యాలు, పూలు అమ్ముకుంటూ స్వామి సన్నిధిలోనే కాలం గడుపుతోంది.  ఆయననే నమ్ముతోంది. జన్మ జన్మల భవిష్యత్ ఏమి నిర్దేశించాడో అని ఎదురు చూస్తోంది.

సుందరి ఏ కాలంనాటిది, వయసెంత, ఏ ఊరు అని ఆలోచిస్తున్నారా? సుందరి  అజరామరురాలు.  మీరు కళ్ళు విప్పి చూడాలనుకుంటే, చూస్తే సర్వత్ర, సర్వదా గోచరిస్తుంది  ఒక నిర్భయ,ఒక దిశ కథలు విన్నా,పరువు హత్యలు చూస్తున్నా మారని యువతకి ,   గర్భం ధరించడం, మాతృత్వం గొప్ప వివరించకుండా  ---  గర్భగుడి ఘనత వినిపిస్తున్నాం.                                                                                                                                         మనతో నడిచే స్త్రీమూర్తులను సమానంగా చూడడం విస్మరించి , దేవతామూర్తులను స్మరిస్తున్నాం.

కాని ఈ ఆగడం ఆపాలని  చేసే  నిరంతర పోరాటం ఆగడం అసంభవం. ఈ పరిస్థితి ని మార్చాలని,నీచులను హతమార్చాలని నిలబడే వారే నిజమైన నాయకురాళ్ళు, నాయకులు.
వారే పాలనకు లాయకులు. (लायक)

ఏ సమాజమయినా ఉన్నతదశకు చేరిందనటానికి తార్కాణం అందరు తమ విలువనూ, స్వేచ్ఛనూ,హక్కులను గుర్తించి  బాధ్యతగా,సమానంగా నివసించడమే.

      

,