ఎండమా(యా)వి
నిజం చెప్పే ధైర్యం లేదు.
| అబద్ధం అంటే భయం పోదు | ||
తటపటాయింపు , తటస్థం నాకిష్టం.
ఉద్యోగం నా లక్షణం.
పని ద్వేషం ప్రతి క్షణం.
వాడు భయపడితే ధైర్యం శౌర్యం నావి.
వాణ్ణి భయపెడితే ఆనందం ఉల్లాసం తీరవే తనివి.
వాడు తిరగబడితే ఉదాత్తసంస్కారి,శాంతమూర్తి నేనే
""వాడిపాపానికి వాడినేపంపే "" తెగువ అతితెలివి నావే.
తోక ముడిస్తే , వెన్నుచూపితే , జంకితే , వణికితే ఉరుముతా తరుముతా
జూలు విదిలిస్తే , వెన్నొడ్డితే , ఎదురొస్తే , ఎదిరిస్తే నీరుకారిపోతా పారిపోతా.
ధనవంతుడికి బలవంతుడికి మర్యాద మన్నన
బాంచను నీ కాలు మొక్కుతా.
నిరుపేదకి ,దుర్బలుడికి అవమానం హేళన.
వంచన . నీ గొంతు నొక్కుతా.
అనివార్యమైతే అతినీతిమంతుడిని
ఆశయం మానవత్వం మమకారం నా నటనకు ప్రాణాలు.
అవకాశమిస్తే అవినీతికి రూపాన్ని .
దురాశ దానవత్వం ఛీత్కారం దారుణాలు.
హక్కులకు పోరాడే పౌరుణ్ణి
బాధ్యతలకు కట్టుబడని చోరుణ్ణి.
ఏది జరిగినా ఏమి ఒరిగినాఎక్కడయినా
ఎప్పుడయినా నేనే నేనే నేనే.
నక్కజిత్తు కుక్కతోక డేగదృష్టి రాబందుబుధ్ధి
నావే నావే నావే.
ఎదురుగా ఉన్నా గుర్తింపు(చ)లేనిమాయలమారిని
ఎదుగుతూ ఉన్న , అదుపులేని మహమ్మారిని.
సర్వాంతర్యామిని
స(వె)గటుజీవిని.
1 comment:
verygoodpoem
Post a Comment