మరో( నో) ప్రపంచం.
ఇసకలో గుండ్రంగా గునగున లక్ష్మి కోపంగా ముందర నడుస్తోంది . సిలిండరు, లడ్డుండ ముద్దుపేర్లు తలుచుకొని నవ్వు ,ఆయాసం కలిపి నడుస్తున్నా. బస చేసిన తాజ్ హోటల్ కి తిరిగి వెళ్ళే దారి తెలియట్లా. ఇంత ఉదయాన్నే జనం ఎవరూ కనపడట్లా. రూమ్ నంబరు తను గుర్తుంచుకొని , నేను దారి గుర్తుంచుకునేలా పని ఎప్పట్లానే సమానం గా పంచింది .
ఎవరో తెల్లని లాల్చీ పైజమా గారు అక్కడ కూర్చుని ఉన్నారు. మమ్మల్ని చూసి పలకరింపుగా నవ్వారు.
చిన్నప్పుడు హిందీ ప్రాథమిక చదివింది. సమయం దొరికితే హిందీ వాడటం మహా ఇష్టం.
తన హిందీ భాష ప్రయోగం మొదలెట్టింది. ఇక వినండి.
ఈవిడ ::--- ఆప్ హిందూవాలా హై? తాజ్ కైసే జాన్?
వారు ::--- షాజహాన్.
నా ఖర్మకి ఆయన సమానమయిన తెలుగు ప్రతిభాపాటవ ప్రయోక్త.
వారు ::--- మీరు తెలుగు ఉండా?
(ఉందా కామోసు.ఇంకా నయం లడ్డుండా అనలేదు.ఈవిడ కొద్ది రోజులు తెలుగు టీవీ సీరియల్స్ కి కథలు ,స్క్రీన్ప్లే రాయాలని ట్రై చేసింది.నిన్న రాత్రి రూమ్ కి రావడం ఆలస్యం అయితే తాగి,తులిశాకులు నమిలి వచ్చావందిరాత్రి గ్లాస్ మేట్ వీడే. నువ్వే ఆ పేరు చెప్పావ్ అని 1000 ఎపిసోడ్ల ధారావాహిక నడిపిస్తుంది. )
ఈవిడ ::--- ఆప్ "మేరీజాన్" కైసే?
( తెలుగని ఎలా గుర్తు పట్టాడని ఉత్సాహ కుతూహలాలు.)
వారు ::--- మీ ముకం చెప్పు గా
బాబోయ్ ఈ భీషణ భాషణం ఆపాలి.
Do you know Taj hotel sir? We lost the way. I think we walked almost 5 miles .
వారు ::--- సోమిగాడా.
( ఏమిటీ!! నా పేరు సోమరాజు అని ఇతనికి ఎలా తెలుసు. రాత్రి తులిశాకు కథ నిజమా.అంత చనువిచ్చానా.)
నేను ::--- క్యా?!!!
వారు ::--- దగ్గాడా
నేను ::--- what are you talking ?
వారు ::--- I said cheater. (మోసగాడా దగాగాడా) . ఝూట్ బోల్ రహే హో
(చెయ్యి చూపించాడు వెనక్కి. అది హోటల్ వెనక భాగం కాబోలు .)
మాడం యహీఁ సే గుజర్ తీ హై. చక్కర్ లగాకే ప్రయాస్ కర్కే వాపస్ ఆతీ హై. Five miles?
ఈవిడ ::---గుజరాతీ నహీఁ ఆంధ్రా . పాయసం నహీఁ.
డయాబెటిస్ వల్ల ఆయాసం , ఏనుగూ నహీఁ . మీరు చెప్పండీ వెధవకి.
వారు ::--- వెధవ?
నేను ::-- వెధవల్ మీన్స్ కోర్ట్స్ ఇన్ లాటిన్. యూ కెన్ ఆస్క్ గిరీశం.
వారు ::--- జాన్ గ్రిషాం చెప్పా ? సరే పోయింది.
స్వగతం ::-- నా ప్రాణం , మతి త్వరలో పోతాయి.
ఇక మొత్తం తెలుగులోనే చెప్పుకుందాం. ఈ బాధపడే భాగ్యం ఎందుకు కలిగిందో మీకు చెప్పాలి.
" పండగ డిస్కౌంట్స్ మాయా మాల్ లో బాగా ఇస్తున్నారటండీ. లక్కీ డ్రా కూడా అట. " అంది మా
ఆవిడ నేను ఇంట్లో అడుగు పెట్టగానే. ఈ కథంతా అక్కడ ప్రారంభం అయింది. "ఆఫీస్ నుంచి వచ్చినట్లే లేరు. ఎంత ఫ్రెష్ గా ఉన్నారో." అంటే అర్థం వెంటనే బయల్దేరండి.
తనవంతుగా "చిన్నప్పుడు మూడు నెలలకో సబ్బు ఇచ్చేదాన్నమ్మాయ్ వీడికి " అంటోంది అమ్మ. అందుకే స్కూల్లో మిగతా వాళ్ళు ఇరుక్కొని కూర్చొని నాకు ప్రత్యేకంగా ఒక టేబుల్ ఇచ్చేవారు అని గొణుక్కున్నా.
" నీకు మాత్రం నెలకు రెండు సబ్బులిచ్చేదే మీ అమ్మ . పొట్టిగా, నల్లగా ఉండేదానివి కదా"
"అప్పుడేదో చిన్నవయసు ,తెలియని తనం అత్తయ్యా " అని భారంగా , ఘోరంగా సిగ్గు పడింది. మెలికలు తిరిగే ఛాన్స్ మాత్రం లేదుగా.
"ఇంటిల్లిపాదికీ తమ్ముడు బట్టలు పంపించాడండి. దానికి మరికొన్ని కొందాం. కాలేజ్ కి వెళ్ళే పిల్ల కదా."
కాలేజి అంటే ఫాషన్ షో నా? పీరియడ్సా . బట్టల పెరేడ్సా? మాటలు గొంతు లోనే కుక్కేశా.
"పాప రాదా మనతో బట్టలు సెలక్ట్ చేసుకోవడానికి?"సమాధానం తెలిసే అడిగా.
"ఇంటర్మీడియెట్ అండీ. అదీ.ఇంటర్మీడియెట్. క్లాత్ కొంటా.కొలతలకి ఇంటికే
వస్తాను అన్నాడు రామారావ్."
గుండె కూడా తుమ్మితే క్షణం ఆగుతుందట. ఇండియాలోచదువుకునే పిల్లలకు మాత్రం విశ్రాంతి అంటే తెలియదు నిరంతరం తిరిగే గ్రహాల్లా,సముద్రపు అలల్లా.
" 1004/-- . అయింది మాడం. ( ఆడవాళ్లను మీరు అనే కంటే మేడమ్ అంటే పులకిస్తారనే సైకాలజీ కాచి వడపోశాడు) . వెయ్యి రూపాయలకి ఒక కూపన్. మరో 996 కొంటే ఇంకో కూపన్ వస్తుంది. మీరు , సారూ బట్టలు చూడండి. మగాళ్ళకయితే రెలియన్సా, రేమండ్సా , ఇంకోటా కొంచెమే ఛాయిస్. లేడీస్ కయితే ఉప్పాడ ,కోట, చందేరి , కంచి మరెన్నో వెరైటీలు. ఒకటి కట్టినప్పుడు లావుగా,మరోదాంట్లో పొట్టిగా,పొట్టగా లేదా సన్నగా ఉంటామని భయం.మీరు ఫర్లేదు. ఏదయినా నప్పుతుంది మాడం . ధర్మవరం కొత్త స్టాక్ వచ్చింది మాడం. చూడండి. (ధర్మవరమా! పోలవరం పూర్తి అవుతుంది ఆడవాళ్ళంతా ఒక్క సంవత్సరం వీడి బారిన పడక పోతే.). మీకు అన్నీ భలే బాగుంటాయ్."
"తమ్ముడూ మీ ఇల్లెక్కడ? "
పక్కన ఆడుతున్న కోతి పిల్లని పిలిచి కడుపుకు కరుచుకునే కోతి లా కనపడింది మా ఆవిడ.
" కైలాసపురం మేడం."
" ఆవకాయ తింటావా. పెట్టారా పచ్చళ్ళు. ?" ఆర్ద్రత గా ఈవిడ.
" మధ్య తరగతి కూడా కాదు కదా అక్కా . డబ్బేది? భార్యకి ఆవకాయ ఇష్టం. నాకు మాగాయ అమ్మకి నిమ్మకాయ, నాన్నకి దబ్బకాయ." ఆవేదన ,ఆక్రోశం అన్నీ ఒకే సారి వాడి కంఠంలో ,
ఎంత ప్రాక్టీసు తర్వాత పర్ ఫెక్షనో. కన్యాశుల్కం వెంకటేశం లాగా (గేదె పెరుగు చమే , చేగోడీ చమే) చమకం చదువుతున్నాడు వీడు.
" రాత్రి ఇంటికి వెళ్ళేటప్పుడు రా. నీకు , మరదలికి, అమ్మకి ,నాన్నకి పచ్చళ్ళిస్తా. "
"మీ దయ ,జాలి ,అభిమానం చాలా గ్రేట్ అక్కా. కర్ణివా ,బలిణివా, శిబిణివా, దధీచిణివా, థెరిసావా."
"భర్తభక్షిణిరా దుర్మార్గుడా" స్వగతం.
" తమ్ముడు. జనరల్ గా ఎక్కువ మాట్లాడితే నాకు నచ్చదు. నువ్వు వేరు. ఉంటా. కలుద్దాం. "
ఒకే సమయం లో ఒకే మనిషి ఒక దేవతగా ఒక పిచ్చి దానిలా కనపడటం ఒక్కోసారి ఓకే. పాసిబుల్.
" నోరు లేని వెధవ. అడగడం కూడా రాదు." .
హైనా , రాబందుల నోట్లో నించి ,కొండచిలువ కడుపు లోంచి వాటికి తెలీకుండా మాంసంముక్క తస్కరించే మాయావి .భూత్ మహల్ ని దేవాలయం అని టికెట్ పెట్టి చూపించగల మేథావి.
తను కదిలింది. అక్కడే తచ్చాడి , " ఈ సారి పచ్చళ్ళు అమ్మడానికి రామోజీరావు గారిని కలిసినప్పుడు సోమరాజు గారు అడిగారని చెప్పు." చేతకాని కసి తో బుసకొట్టి వచ్చా.
చీరల సెక్షన్. పక్క ఫ్యామిలీ వాళ్ళ డ్రైవర్ వచ్చాడు.
" సార్ పెట్రోల్ రేట్ పెరిగింది. డబ్బులు సరిపోలేదు. ఫుల్ గా కొట్టించాలంటే మరో 500 కావాలి."ఇచ్చాడతను.
" ఎందుకయినా మంచిది. మరో 500 ఇవ్వండి. నేను ఇక్కడికొచ్చి తిరిగి వెళ్ళే లోపు మళ్ళీ పెరిగుండొచ్చు." డ్రైవర్.
" సర్. వీరికి పోయిన సారి లక్కీ డ్రా లో కార్ వచ్చింది. " చీరల సేల్స్ మాన్ చెప్పాడు. పక్కకి తిరిగి కంగ్రాట్స్ సర్ అన్నా.
" పెట్రోల్ కీ , డ్రైవర్ శాలరీ కి కష్టమై ఇల్లు బ్యాంకు లో తనఖా పెట్టా . ఈ సారి డ్రాలో ఇల్లు తగులుతుందని షాపింగ్ కి తెచ్చింది సార్." దీనంగా చెప్పాడతను.
చీరల సెలక్షన్, నా బట్టల సెలక్షన్ ,మరో రెండు పచ్చళ్ళ ప్రామిస్ ల తర్వాత 17560 బిల్ తో సెటిలయింది తను.
సైంధవుడు పద్మ వ్యూహం లోకి వెళ్ళనివ్వడు. ఇక్కడి సెక్యూరిటీ గార్డు సైంధవుడు బయటికి వెళ్ళనివ్వడు.
" మేడం కాస్మెటిక్స్ మరో 440 కి కొంటే మరో కూపన్. పాప చదువుతోంది కదా. కొనండి".
బిల్లుల మీద స్టాంప్ వేస్తూ,బట్టలు చెక్ చేస్తూ అరక్షణం లో అన్నీ ఆకళింపు చేసుకునే ప్రజ్ఞాశాలి . 20030/-- తో బయట పడ్డాం.
రాత్రి ఒక్కొక్కరు వచ్చి పట్టుకెళ్ళాక , తెల్లార్లు టాక్స్ అధికారులు బోర్డు , లైసెన్సు లేకుండా పచ్చళ్ళ వ్యాపారం చేస్తున్నానని దాడిచేసినట్లు మగత నిద్రలో పీడ కలలు. చీమ చిటికేసినా , దోమ దగ్గినా, ఈగ ఈల వేసినా ఉలిక్కిపడి చచ్చా. అవి కూడా వినబడని నిశ్శబ్దం ఉంటే తప్ప నిద్ర పట్టని పరిస్థితి. "గలగలమనగూడదు ఆకులలో గాలి జలజలమనరాదు.. అలలతో కొండవాగు " అనేంత భావుకత నా భార్యకి లేకపోవడమే కాదు , గురక కూడా.
నెలన్నర తర్వాత ఫోన్ , వాట్సప్ ,మెయిల్ ,మెసేజ్ అన్నీ వచ్చాయి.
సోమరాజు గారు.
" మీకు మా సంస్థ మీద ఉన్న ఆదరాభిమానాల వల్ల మనస్ఫూర్తిగా, ఆనందంగా చేసిన కొనుగోళ్లు మీ మా అభివృద్ధి కారకాలు. మీరు మా లక్కీ డ్రా లో ఎంపికయిన విజేతలలో ఒకరిగా నిలిచారు. నలుగురు లేదా అంతకు లోపల (మీ) కుటుంబ సభ్యుల పేర్లిస్తే ,ముంబైకి రాను పోను టికెట్లు , మూడు నక్షత్రాల హోటల్ లో బస భోజనవసతి.ముందుగా ఎంపిక చేసిన ముఖ్యప్రదేశాల సందర్శన కు ఐదు రోజులు ( తప్పనిసరి ప్రత్యేక పర్యాటక ఆకర్షణ ఒకరోజు పూర్తిగా అక్కడి మా మాయా మాల్ బ్రాంచ్ ) కారు ఏర్పాటు చేయబడతాయి. షాపింగ్,మరియు పేర్కొనని మిగిలిన ఖర్చులు మీవే. అభినందనలు.
షరా ::--- ఈ టికెట్లు, రశీదులు కక్కుర్తిగా సమర్పించి తమ ఆఫీస్ లో. L..T.C. రీఇంబర్స్మెంట్ తీసుకోరాదు.
" వీడెప్పుడూ అదృష్టవంతుడే అమ్మాయి. ఆయన వీడి అక్షరాభ్యాసం 20000 పెట్టి ఘనంగా చేస్తే , 100 పలకలు, 1000 బలపాలు వచ్చాయి "
" అత్తయ్యా . మా పెళ్లి కి కూడా గోడ గడియారాలు , టైంపీసులు , టీ కాఫీ సెట్లు , దేవుడి పటాలు , మిల్క్ కుక్కర్లు , ఫోటో ఫ్రేములు , డిన్నర్ సెట్లు కళ్యాణమంటపం నిండి పొయ్యాయి. మా నాన్న తెలివిగా గిఫ్ట్ షాప్ వాడిని పిలిచి As and where they are పద్ధతి లో , రవాణా ఖర్చు వాడిదే అని అమ్మి 10000 వస్తే మాకే ఇచ్చారు. కొన్ని మిగిలితే , దాచి , మొన్నటిదాకా పుట్టిన రోజులకి, పెళ్లిళ్ళకి, మిగతా అన్ని ఫంక్షన్స్ కి అందరికీ ఇచ్చాం కదా. "
" మీరిద్దరూ వెళ్ళిరండే అమ్మాయి. పాపను నేను చూస్తాలే. కాస్త వాడికీ గాలి మార్పు." ఏర్పాట్లు చూసుకుని, అమ్మతో టచ్ లో ఉండమని స్నేహితులతో, పక్కింటి వాళ్లతో చెప్పి నిన్న ముంబై చేరాం.
ఈవిడ కఠినమైన డైటింగ్ లో ఉంది. కొంచెం భోజనప్రియురాలు. రోజుకు అరవై సిగరెట్స్ కాల్చే వాడికి డాక్టర్ ఏదన్నా తినేముందు ,తిన్న తర్వాత కాల్చుకొమ్మని సలహా ఇచ్చాడు. వారం తర్వాత ఇంప్రూవ్మెంట్ బాగా ఉందే అంటే రోజుకు ముప్పై సార్లు తినడమే కష్టంగా ఉంది అన్నాడట. ఈవిడకి భోజనం మానమని వేరే డైట్ చెప్పారు. ఉదయాన్నే పావుకిలో మొలకెత్తిన పెసలలో వంద గ్రాముల వేరుసెనగ పప్పు , ముక్కలు చేసిన బెల్లం మాత్రం తిని కాఫీ తాగుతుంది. 11.30 కి ఏదో ఒక జ్యూస్. ఒంటిగంటకు ఒక పుచ్చకాయ , సగం పనస, రెండు ఆరెంజెస్ ,ఒక పైనాపిల్ ,అరడజను అరటిపళ్ళు వంటివి సీజన్లో పండ్లు లైట్ గా పుచ్చుకుంటుంది. సాయంత్రం కీరా , కేరట్ ముక్కలు ప్లేట్ నిండా ( సైజ్ అడగద్దు) , రాత్రి చపాతీలు పప్పు. ఈ సారి డైటీషియన్ దగ్గరకి వెళ్తే మామూలు భోజనం పద్ధతికే మారిపొమ్మంటుందని నా దృఢనమ్మకం .
ఈ దినచర్యలో భాగంగానే మార్నింగ్ వాక్ పేరుతో పది అడుగులు అటూఇటూ వేస్తాం. ఇదీ ప్రస్తుతం.
చౌహాన్ గారు పది మాటలు మాట్లాడితే తొమ్మిది కొడుకు గురించే. ఉదయాన్నే తను వాకింగ్ కి , కొడుకు జాగింగ్ కి వస్తారు. తిరిగి కలిసే ప్రదేశం ఇది. తను తెచ్చుకున్న ఫ్లాస్కునుంచి మాకూ కాఫీ ఇచ్చారు.
అక్కడే కూర్చుని కబుర్లు చెప్పుకున్నాం. తనది వెండివస్తువుల వ్యాపారం. అందులోనే బట్టల దుకాణం.దుబాయ్ లో ఉద్యోగం చేసి డబ్బు సంపాదించి వ్యాపారం మొదలెట్టి కోట్లు గడించాడు. తను దుబాయ్ లో ఉండగా భార్యా,కొడుకు ఉద్యోగరీత్యా ఆంధ్రా లో ఉన్న భార్య తల్లితండ్రుల దగ్గర ఉండటం తో వారికి తెలుగు వచ్చు. వారి ద్వారా తను కొంచెం నేర్చుకున్నాడు.
ఒకరోజు కొడుకు దగ్గర ఒక ఫోటో చూసింది భార్య. ఫోటో వెనకాల రాణి అని సంతకం. కొడుకుని నిలదీసింది.
రాణి ఎవరు ?
రాజు భార్య.
రాణీ ఎవరూ?
ఎవరా రాణి?
రాణెవర్రా?
రాణెవరు?
ఎవరు రాణి?
ఎవర్రాణి?
ఈ రాణి. (ఫోటో చూపించి.)
ఆ రాణా. రాణి.
అదే రాణి ఎవరూఊఊఊ.
అదే రాణి కాదు. అందానీ రాణి. నా ఫ్రెండ్.
(మా ఆవిడ నా చెవులో " అంబానీ,అదానీ,అద్వానిల బంధువు" అని తీర్మానించేసింది)
చౌహాన్ గారు మధ్యలో దూరి వివరాలడిగి ప్రేమ పెళ్లికి ఒప్పుకున్నారు . త్వరలో పెళ్లిమాటలకు వెళ్ళాలి. కొడుకు పొడగరి,సొగసరి, గడసరి ,అన్నింటిలో నేర్పరి.
ఇంతలో డ్రైవర్ తీసుకెళ్ళడానికి వచ్చాడు. బాబు రాలేదని చూస్తుంటే, తన కార్ లో అప్పటికే వెళ్ళిపోయారని చెప్పాడు. మాకు తన కొడుకుని గర్వంగా పరిచయం చెయ్యలేకపోయిన బాధ కనిపించింది.
రోజూ మాయా మాల్ వారి కార్ ఉదయం 9.30 కి వస్తుంది. రాత్రి 8.30కి దింపేస్తుంది. ఉదయం ప్రతిరోజూ కలుద్దామని నిర్ణయం. రెండు గంటల పరిచయంలోనే సన్నిహితుడు అనిపించే వ్యక్తి.
ఆ రోజంతా ఊరెరిగింపు జరిగి అలసిపోయినా మర్నాడు ఉదయాన్నే లేపి లాక్కెళ్ళింది. మార్నింగ్ వాక్ కన్నా ఆయనను కలవాలని ఆత్రుత. వెండి మరియు బట్టలు కదా. డ్రైవర్ వచ్చి , వీళ్ళు బయల్దేరాక , అమ్మ గారు చిన్నబాబు గారిని ఎయిర్ పోర్ట్ కి మేనమామ ఫామిలీని తీసుకురమ్మని పంపారని చెప్పి అందరి ఉత్సాహం నీరుకార్చాడు.మర్నాడు బాబు కలవడానికి రాకపోవడానికి మరో కుంటిసాకు. చౌహాన్ గారు కూడా కొంచెం చిరాకుతో కూడిన ఇబ్బంది పడ్డారు. ఈ మధ్య కాలంలో ఆయన చాలా దగ్గరి వాడయ్యాడు. పరిస్థితి గమనించి , తేలికపరచటావికి రాత్రి భోజనానికి పిలిచా..
దారిలో ఈవిడ భార్యకొడుకులకి ఆయన మీద చులకన భావం అని నిర్ధారించేసింది.
రాత్రి ఆయన వచ్చాక పిచ్చాపాటి----
" భోజనానికి ముందు స్పిరిట్ హైస్పిరిట్స్ లో ఉంచుతుంది "
" ఈవిడ ఫైటింగ్ స్పిరిట్ తో ఈవిల్ స్పిరిట్ గా మారి దంచుతుంది"
" మరేంచేద్దాం?"
" సాఫ్ట్ డ్రింక్ లేదా జ్యూస్ మంచిది. విస్కీ రిస్కీ."
" అరే !! అతను రష్యన్ కనుక అలా చెప్పాడు. తర్వాత వోడ్కా మంచిదని చెప్పుంటాడు."
ఒక నిమిషం దీర్ఘంగా ఆలోచించి " ఇతను డోస్టోయెవిస్కీ తమ్ముడో, దగ్గరి బంధువు అయి ఉంటాడు " అని రహస్యాన్ని ఛేదించారు.
విస్కీరిస్కీ కమ్యూనిస్టు , తను కాపిటలిస్ట్ కనుక రెండూ వేరు వేరు సిద్ధాంతాలని, ఎప్పుడయినా సరే రెండింటినీ కలపటం మంచిది కాదని, బీరు విస్కీ రెండిటినీ కలపమని సెలవిచ్చారు . పడుకోవటం రాత్రి రెండింటికి కనుక మర్నాడు కలవటం కుదరదన్నారు. ఐదో రోజు సాయంత్రం ప్రయాణం కనుక ఆరోజు తప్పకుండా తమ షాప్ కి రమ్మని ఆహ్వానించారు.
మర్నాడు ఉదయం మద్యపానం, ధూమపానం, జరదా వంటి దుర్వ్యసనాలు, వాటివల్ల జరిగే నష్టాలు ,చక్కటి ఉదాహరణలతో వివరించే ఉపన్యాసం ఏకధాటిగా గంటసేపు వింటానని , రాత్రి ఇంటికి వెళ్ళేముందు చెప్పారు. ఆయన ఈ వ్యసనం నుంచి బయటపడాలని చేస్తున్న బలమైన ప్రయత్నం హృదయాన్ని తాకింది.చలించిపోయాను.
" వక్త ఎవరు సార్? ఎక్కడ సార్?" గద్గదస్వరం తో అడిగాను.
" మా ఆవిడ. మా పడగ్గదిలో " చెప్పి వెళ్ళిపోయాడు.
మర్నాడంతా మాయామాల్లో షాపింగ్. వారి ఆతిథ్యానికి , గౌరవమర్యాదలకి ఈవిడ పూర్తి గా ఉబ్బితబ్బిబ్బయ్యింది. రెండు క్రెడిట్ కార్డ్స్ లిమిట్స్ పూర్తిగా వాడేసుకుంది. జేబులో మిగిలిన కొద్దిపాటి డబ్బు అత్యవసరాలకు ఉండాలని, మా ఊరిలో విమానం దిగి ఇంటికి వెళ్ళడానికి క్యాబ్ ఖర్చు మనదేనని విభేదించి , వాదించి , నచ్చచెప్పి , బతిమిలాడి బామాలి చివరికి ఒప్పించి , ఊపిరి పీల్చుకున్నానని గర్వంగా చెప్పగలను. ఆస్థాన ఐంద్రజాలికుడు రంగప్రవేశం చేసి రెండువేల రూపాయలు మాత్రం వెంటనే చెల్లించి , ఎంచుకున్న వస్తువులను కొరియర్ ద్వారా ఇంటి దగ్గర పొంది , మిగతా డబ్బు అప్పుడు చెల్లించే సదవకాశాన్ని అత్యంత విలువయిన , నమ్మకమయిన కస్టమర్లమయిన మాకు అందించాడు. మా వినోదపర్యటన ఖర్చంతా , వడ్డీతో సహా లాగేశారని అనిపించడం నా దురాలోచనల (దూరాలోచనలని నా అభిప్రాయం ) మెదడుకే సాధ్యమని ఆవిడ అభిప్రాయం .
ఆఖరి రోజు రాత్రి ప్రయాణం. సొంత పనులకు కార్ రాదని, రాత్రికి ఎయిర్ పోర్ట్ లో దించడానికి మాత్రం వస్తానని మాయా మాల్ డ్రైవర్ చెప్పేశాడు. ఉదయాన్నే కాఫీ తాగుతూ, చౌహాన్ గారి షాప్ కి వెళ్ళడం గురించి మాట్లాడుకుంటున్నాం. రూమ్ బాయ్ సునీల్ , ఒక షిఫ్ట్ హోటల్ లో మరో షిఫ్ట్ క్యాబ్ డ్రైవర్ గా పని చేస్తాడట. పైగా చౌహాన్ గారి డ్రైవర్ అతని తండ్రి. వారి ఇల్లు , కథా కమామీషు అన్నీ తెలుసుకనక తను తీసుకువెళ్లి, అక్కడే ఉండి, తిరిగి తీసుకు వచ్చే బేరం కుదుర్చుకున్నాం.
సునీల్ సడెన్ గా " మీది విశాఖపట్నం కదా సార్" అన్నాడు.
" అవును. ఎలా తెలిసింది? "
" నిన్న సాయంత్రం మీ చెప్పులలో , షూస్ లో ఇసక చూశాను. నిన్న మార్నింగ్ వాక్ నించి వచ్చి శుభ్రం చేసుకున్నారు. కాబట్టి బీచ్ కి వెళ్ళారు. గవ్వలు , పూసలు , బీచ్ లో దొరికేవి ఏవీ కొనలేదు. అంటే మీకు బీచ్ అలవాటు. మీ ఊరిలో సముద్రం ఉంది. ఆంధ్రా నుంచి వచ్చారు తెలుగు కనుక. విశాఖపట్నం కంటే మంచి ప్లేస్ లేదు కదా సార్ " అతని పరిశీలనకి ఆశ్చర్యం వేసింది. మారు వేషంలో డిటెక్టివ్ కావచ్చు.
రాత్రి పూట టేపు, భూతద్దం , టూల్స్ , డార్క్ లాంటర్న్ తో మారువేషంలో తిరుగుతాడేమో.
శవాల మీద బెత్తం తో కొడితే తట్లు తేల్తాయా కోనన్ డొయెల్ సరిగా చెప్పలేదు అని అడుగుదామనుకున్నా.
లక్ష్మి అంటోంది " మొన్న డస్ట్ బిన్ ఖాళీ చేస్తూ విమానం టికెట్లు చూశావుగా?"
తమాయించుకోడం కొంచెం కష్టమయింది.
దారిలో వెళ్తుంటే, అమ్మ గారిని చూస్తుంటే ఒక సినిమా నటిలా ఉందనిపిస్తోందని , పేరు ( సూర్యకాంతం? ఛాయాదేవి? కల్పనారాయ్? టున్ టున్ ?) గుర్తు రాని తన మతిమరుపును క్షమించమని చెప్పాడు. అయ్యగారి దర్జా ,ఠీవి చూస్తే గొప్ప ఉద్యోగస్తులో, పెద్ద వ్యాపారస్తులో అయి ఉంటారని గట్టిగా చెప్పేశాడు. దొంగ పొగడ్తలే కాకుండా అప్పుడప్పుడు వాస్తవాలు కూడా మాట్లాడ్తాడని చిన్న సదభిప్రాయం ఏర్పడింది. తను మామూలుగా ఎవరి దగ్గర టిప్స్ ఆశించడట. అమ్మ గారిని చూస్తుంటే ఏసుక్రీస్తు చెప్పినట్లు కుడిచేతితో చేసిన దానం ఎడమ చేతికి తెలియనివ్వని రకం అని తెలిసి పోయింది కనుక , రూమ్ బాయ్ టిప్ ,క్యాబ్ డ్రైవర్ టిప్ విడివిడిగా ఎంతిచ్చినా తీసుకుంటానన్నాడు. నా భార్య మనసులో మెదిలిన అమౌంట్ , టెలిపతీ ద్వారా వాడికీ , నాకూ తెలిసింది అనటానికి తార్కాణాలు వాడి ముఖంలో సంతృప్తితో కూడిన కనీ కనిపించని చిరునవ్వు , నాకు మాత్రమే వినపడిన నా పళ్ళ పటపట శబ్దం.
చౌహాన్ గారు స్పురద్రూపి. దబ్బపండు ఛాయ. స్వచ్ఛమైన మందహాసమే ఆభరణం. పక్కన ఆయన భార్య మిసమిసలాడే పాలరాతి తెలుపు. చేతులెత్తి దణ్ణం పెట్టాలనిపించే పవిత్రమైన అందం. మన మనసులోకి చొరబడి , నలుమూలలా పరికించి చూస్తున్నట్లు నిశితమైన చూపు.
నాకెందుకో లోకంలో పరుల కష్టాలు తమవిగా భావించి , కడదేర్చే మార్గాలు వెతికేవాళ్ళనెవరిని చూసినా గౌరవభావంతో పాటు, వాళ్ళ ముఖంలో నిర్మలత్వం మాటున చిన్న విషాదవీచిక గోచరిస్తుంది.
రాముడు, బుద్ధుడు , జీసస్, పాత్రలు ధరించే నటులు తమ ముఖంలో సున్నితమైన ,అంతర్లీనమయిన దుఃఖఛ్ఛాయలను, మార్దవమైన ఆర్ద్రతను మేళవిస్తే బాగుంటుంది అనిపిస్తుంది.
నాకు ఆవిడ ముఖంలో కలుపుగోలు చిరునవ్వు , ఆప్యాయత తో పాటు అవన్నీ కనిపించాయి. షాప్ లో అడుగు పెట్టగానే కనిపిస్తోంది , భార్యాభర్త సోఫాలో కూర్చుని, కొడుకు సోఫా వెనక ఇద్దరి మధ్య నిల్చొని , దిగిన నిలువెత్తు ఫోటో. ఆయన తన కొడుకు గురించి ఇన్నాళ్ళు చెప్పింది చాలా తక్కువ అనిపించింది.
కొద్దిపాటి, తేలికపాటి పరిచయమే అయినావాళ్ళ ఆదరణ , మర్యాద అపురూపంగా అనిపించాయి.
" బాబు ఆడిటర్ ని వెంటబెట్టుకొని బేంక్ లోన్ పనిమీద వెళ్ళాడు. వచ్చేస్తారు. మీకు ఈ లోపల షాప్ చూపిస్తా"
అంది ఆవిడ. చూశారా, నే చెప్పాగా అని మా ఆవిడ కళ్ళతో మాట్లాడింది. షాపంతా కలియతిరిగాక , వారి నిరాడంబరతకు ఐశ్వర్యానికి మధ్య వ్యత్యాసం మా ఆవిడ మతి పోగొట్టింది.
ఆయన మాత్రం మాతోనే కూర్చున్నా ,తను షాప్ అజమాయిషీ చేస్తూనే ఆతిథ్యం అందించింది. మేము బయల్దేరుతామంటే భోజనం ఇక్కడే అని బలవంతం చేశారు. భోజనానికి రమ్మని కొడుక్కి ఫోన్ చేస్తే ,బిజినెస్ లంచ్ ఉందని మమ్మల్ని కానియ్యమని చెప్పాడతను. dessert కి తప్పక రమ్మని చెప్పమన్నారు చౌహాన్ గారు. "వాడుంటే , పోనీలే అమ్మా ఒక స్వీట్ , సిగార్ వదిలెయ్ అంటాడని వీరి ఆశ " అని నవ్వింది. కాలం ఎలా గడిచిందో తెలీకుండానే , సాయంత్రం వడాపావ్, చాయ్ వచ్చేసాయి. బాబు రాలేదు.
బయలుదేరవలసిన సమయం వచ్చింది. మేము నిర్ఘాంత పోయేలా లక్ష్మికి పట్టుచీర , నాకు చిన్న వెండికంచం ఇచ్చారు . వచ్చే నెలలో పెళ్లి అనుకుంటున్నామని , కుటుంబం అందరం తప్పక రావాలనీ ఆయన పదేపదే చెప్పారు. ఆవిడ నా విజిటింగ్ కార్డ్ తీసుకొని భద్రపర్చింది. ఎంతో ఆత్మీయుల్లాగా కారు దాకా వచ్చి వీడ్కోలు పలికారు. యాదృచ్ఛికమే అయినా అద్భుతమయిన ఈ స్నేహాన్ని ప్రాణపదంగా జీవితాంతం కాపాడుకోవాలని దృఢంగా నిశ్చయించుకున్నాం.
కారు ప్రయాణంలో అంతా , ఇన్ని రోజులు చూసిన ప్రదేశాలు, తీసుకున్న ఫోటోలు , ఆ ఫ్యామిలీ గురించీ , మాట్లాడుకున్నాం. తను హిందీ లో మాట్లాడగలదు కనుక ఈ పరిచయం ఏర్పడింది అని ప్రకాశముగా ప్రకటించింది. ఇద్దరు మనుషులు రెండు భాషలను హత్య చేస్తే స్నేహం పుడుతుంది గదా అని ఙనాంతికంగా చింతించాను.
సామాన్లు రూమ్ లో పెట్టిన డ్రైవర్ కమ్ రూమ్ బాయ్ కి టిప్పు డబ్బులిస్తూ " ఏమిటో సునీల్. వాళ్ళ అబ్బాయి వీళ్ళిద్దరి లాగా కాదనుకుంటా. కొంచెం గర్వం నిర్లక్ష్యం. కలవడానికి వీలు లేకుండా సాకుల
మాటున దాక్కున్నాడు . పెళ్లికి తప్పకుండా వచ్చి చూడాల్సిందే. " అంది.
వాడి ముఖంలో సెకనులో చాలా రంగులు మారాయి. దిగ్భ్రాంతి , కోపం, దుఃఖం వరసగా కనిపించాయి. ఆశ్చర్యంగా చెప్పాడు " అదేంటి మేడం. అమ్మగారు చెప్ప లేదా. బాబు కోరుకున్న అమ్మాయి , తనను కాదని మరొకరిని ప్రేమించి పెళ్ళాడింది. బాధతో అవమానం తో ఆత్మహత్య చేసుకున్నాడు. రోజూ తండ్రీకొడుకులు బీచ్ లో మార్నింగ్ వాక్ లో కలిసే చోట తండ్రి ఎదురుగానే సముద్రం లో దూకాడు. శవం సాయంత్రం దొరికింది. పెద్దాయన షాక్ లోకి వెళ్ళి పోయాడు. అన్ని విషయాలలో మామూలుగానే ఉన్నా , కొడుకు చచ్చిన సంగతి నమ్మడు. రోజూ ఉదయం బీచ్లో , తర్వాత ఇంటి దగ్గర , బాబు ఉన్నట్లే ఊహించుకుంటాడు. డాక్టర్లు ఎన్ని రోజులో చెప్పక పోయినా, కొద్ది రోజుల్లో మనుషులలో. వస్తాడని చెప్పారు. వచ్చేదాకా, ఆ తర్వాత కూడా జాగ్రత్త గా చూడాలి."
" Dissociative amnesia . ఎన్ని రోజులో తెలియదు. జాగ్రత్తగా చూడాలి " నాలో నేను మాట్లాడుకుంటున్నానని తెలిసేలోపే , గుండెలు కదిలిపొయ్యేలా , కరిగి పొయ్యేలా లక్ష్మి వెక్కివెక్కి ఏడుపు. తను దుఃఖం లోకి వెళితే ,తనే వెనక్కి రావాలి తప్పితే నేను చెయ్యగలిగింది ఏమీ లేదన్నది అనుభవం.
యాంత్రికంగా సామాన్లు సర్దటం మొదలుపెట్టాను. ఏడుపుతో కూడిన శ్మశాననిశ్శబ్దంలో శ్మశానవైరాగ్యం తో వచ్చిన మౌనరోదన నాది. కుమిలి పోయాను. కనపడని , కనపడనివ్వని కన్నీళ్ళను కనురెప్పల వెనుకే ఆపి కడుపులోకి. దిగమింగి దాచాను.
" ఎంత బాధండీ అది. ఆయనకెందుకొచ్చింది.అంత మంచి మనిషి . తట్టుకోలేక పోతున్నాను. వెంకటరమణా మరెవరికయినా ఈ ప్రారబ్ధం ఉందా స్వామీ ఈ లోకం లో " మాట్లాడుతోంది తను.
" లక్ష్మీ! ఆవిడ గతేంటి. సంగతేంటి.తన బాధను అణుచుకొని , అతని బాధను తనదిగా చేస్కొని, ఏడవటానికి కూడా అవకాశం లేని పరిస్థితి.రోజులో ఎప్పుడయినా ఒక గంట సమయం ఒంటరిగా దొరికితే ఆవిడ ఎలా ఉంటుందో ఊహించు . నాకు అందడంలేదు." తడబడుతూనే మాట్లాడాను.
తిరుగు ప్రయాణంమంతా నిరాసక్తంగా నిర్వేదంగా-----
విమానం దిగి ఇంటికి ఎలా చేరామో, ఆఫీస్ కి ఎప్పుడెళ్ళానో , ఏంచేశానో తెలియని నిర్లిప్తత. అమ్మ ఏమయింది ఎందుకిలా ఉన్నారు అంటుంటే తనని అడగమని వచ్చేశా. భార్యాభర్తల ఇమేజెస్ రకరకాల భంగిమలలో , భావనలలో,భావాలలో, కళ్ళముందు స్లైడ్ షో.
సాయంత్రం అలసటతో ఇంటికి చేరిన నాకు అమ్మ కాఫీ తెచ్చింది. " రోజూ పాప పుస్తకాలు, బట్టలు సర్ది దానికి ఏదో ఒక ఫలహారం తయారు చేసి, ఎదురు చూస్తూ గుమ్మంలో కూర్చునేది.
ఈరోజు తటాలున లేచి ఎటో వెళ్ళింది. దానికేమయిందో అర్థం కాదు.నాకేమిటి నాయనా ఈ బాధ!!."
నాకు తెలుసు తనెక్కడుంటుందో. నిస్సత్తువగా లేచి కారు తీసి బయల్దేరాను .బస్టాప్ లో
సిమెంట్ బెంచీ మీద కూర్చొని ఉంది. " నువ్విటు, పాప అటు అయ్యారు.అది బస్సు దిగి వచ్చేసింది "
కారు డోర్ తెరిచి కూర్చుంది. " రేపటి నించి దాన్ని ఇక్కడే రిసీవ్ చేసుకొని తెస్తా " ఆలోచనగా చెప్పింది.
నెలక్రితం ఒక రోజు, కాలేజీకి బయల్దేరిన పాపకు , రాత్రి ఏడు గంటలకి టైలర్ వస్తాడని చెప్పింది .
సాయంత్రం పాప ఫ్రెండ్స్ ఫోన్ చేస్తే వెంటనే వెళ్ళాం.
" ఉదయం నించి ఎక్సైటెడ్ గానే ఉంది ఆంటీ . బస్సు దిగి , ముందరి నించి రోడ్ దాటబోయింది . డ్రైవర్ చూడకుండా లాగించాడు."
రక్తం ముద్దలా పాప , చుట్టూతా జనం , ట్రాఫిక్ పోలీసులు , 108 వాహనం. పాపను కొన్ని గంటల తర్వాత అప్పచెప్పారు. నేను , అమ్మ , దాని ఫ్రెండ్స్ దుఃఖం తో పొర్లి పొర్లి ఏడ్చాము. లక్ష్మి కంట్లో నీటి చుక్క , నోట్లో మాట లేవు. ఆ రోజు నుంచి తనకొక మార్పు లేని దినచర్య ఏర్పడింది. ఈ రోజే తొలి కదలిక.