ఆరాధన
నీకు పదేపదే సాయం చేస్తే కరుణ చూపితే రుణపడతావనుకున్నా
ప్రేమలో పడతావనుకున్నా.
సంకల్పించిన ప్రతిసారి సున్నితంగా తిరస్కరించిన ఆత్మవిశ్వాసం చూసి
సాయాపేక్ష లేక రమారమి నిష్కామినయ్యా.
అందంగా కనపడితే నీలో అనురాగం పుట్తుందనుకున్నా.
నీ ఆత్మసౌందర్యాన్ని అవలోకించి అవగాహించి అరాధకుడినయ్యా.
దుఖం రప్పిస్తే సాంత్వనకోసం నాభుజం ఆసరా అవుతుందనుకున్నా.
నీ మనోధైర్యం పరికించి శోకరహితుడినవుతున్నా.
ఆగ్రహం రప్పించి నిగ్రహం తప్పించి శాంతివచనాలు గుప్పించి చేరువకు చేరాలనుకున్నా.
ప్రశాంత అయస్కాంతంలా "ఆకర్షించి" సంతులనం నేర్పించావు.
నవ్విస్తే సంతోషపెట్తే నన్ను ప్రేమిస్తావనుకున్నా.
అ"ధర" దరహాస సోయగం చూసి మురిసిపోయా
ప్రేమసాగరంలో మునకలేసి అలసిపోయా .
అర్థించి ప్రార్థించి ప్రేమను పంచమని వేడుకోలు తో వశం చేసుకుందామనుకున్నా.
స్వార్ధించి ఆర్జించటం మంచికాదని వంచన వదలి వీడుకోలు చెపుదామని వచ్చా.
ఎదురు చూసింది నిష్కర్షగా నిర్దయగా దిక్కులు పట్టి పొమ్మని చీదరింపు.
ఎదురైంది నిష్కల్మషంగా నిర్మలంగా అక్కున చేర్చి రమ్మని ఆదరింపు.
ఏ దేవుళ్ళో కరుణించారని వరమిచ్చారని అరక్షణం ఆలోచించా.
ఆ దేవత నీవేనని మరుక్షణం గ్రహించా నీ వశమై అనుక్షణం పరవశించా.
నీకే మనస్కరించి నువ్వే సంస్కరించి పురస్కరించావు.
ఏమివ్వను? ఏమీ ఇవ్వను.ఇవ్వలేను.నమస్కరిస్తా.
అల్పాన్ని శిల్పంగా మార్చిన ఉలి పట్టిన స్థపతి ఈ నెచ్చెలి.
చెదపట్టిన మదిలో మంచిని ఎంచి గుడిగా మలిచి నిలిచిన దేవి నా చెలి.
2 comments:
simply superb.ఎంతో ఆర్తి,మరెంతో ప్రేమ, కొండంత కృతజ్ఞత,అలసట లేని అంతులేని అభ్యర్ధన,
చివరగా అవలోకన.
దేవుడైనా నిష్కల్మష నిరపేక్షిత ప్రేమకే లొంగుతాడు. విమర్శకుడిగా వివరణ, విశదీకరణ చేయను. పాఠకుడిగా ఆస్వాదిస్తున్నా.
Post a Comment