Showing posts with label గోపాల్. Show all posts
Showing posts with label గోపాల్. Show all posts

August 20, 2011

SRIKRISHNAJANMAASHTAMI

జీవనసంధ్యలో , జీవితయుగసంధిలో నిలుచున్నాను నేను.
రహదారులు, అడ్డదారులు,అడ్డమైనదారులు
అనేకమార్గాలు,పొంగిపొరలే సెలయేర్లు
దుర్భేద్యమైన దుర్గాల్లా కంటికికనిపిస్తున్నాయి
సర్వేంద్రియాలు కంపిస్తున్నాయి.

దిక్కుతోచక,దిశానిర్దేశం లేక
దిక్కులుపిక్కటిల్లేలా విలపించాను
విషాదగీతం ఆలపించాను
కనిపించిన రాయిరప్పకు,కనిపెంచిన మాతాపితలకు మొక్కాను.
శోకంలో వెక్కివెక్కాను.
తప్పిపోయిన శిశువులా
తప్పుచేసిన పశువులా
అండకోసం.క్షమకొసం వెదికాను,వేసారాను.
అలసిసొలసి సొమ్మసిల్లాను
కళ్ళు చెమ్మగిల్లాను.

గోలోకచారి గోపాలుడు గోచరించాడు
పాపప్రక్షాళన చేసి కటాక్షవీక్షణం అవధరించాడు.
తీక్షణత,క్షమత మేళవించాడు

నన్నిన్నాళ్ళు విస్మరించావు
ఆత్మశోకం భరించావు
ఈనాడు కన్నీళ్ళతో స్మరించావు
ఆత్మశొధనతో ఆత్మార్పణ కావించావు.

నీవు నిమేషమాత్రుడివి
నిమిత్తమాత్రుడివి
అహంతో గర్వించావు
సోహం మరిచావు.
మనస్సిద్ధి లేక కోపం, పాపం ,కామం వరించావు
చిత్తశుద్ధిలేని జపాలు,తపాలు,హోమాలు జ్వలించావు.
కోపంలో దూర్వాసుడిలా చలించావు
పాపంలో చార్వాకుడిలా చరించావు.
కానీ, వారి సాత్వికతను,తాత్వికతను విస్మరించావు

కొండంత వేలుపు కొండను నిలిపిన వేలితో
నావేలుపట్టి నడిపించాడు.
ఈ దారిన వెళ్ళు.ఇక నీమార్గం సన్మార్గం
అంగాంగానా గౌరాంగుడిలా సత్సంగం.
జీవితాన్ని ఆస్వాదించు ఆనందించు
కానీ నలుగురికి పంచు
మందిమేలు ముందుంచు

గాంధి సత్రంలో ప్రవచనాలు,బ్రతుకు నిర్వచనాలు లభిస్తాయి
భుజించి ఆకలిని జయించు.
అల్లాక్రీస్తూ చలివేంద్రంలో దైవవాణి జలదారలోదప్పితీర్చుకో.
మీరామాత,సక్కుబాయి,తెరేసామాయి,వివేకానంద
వటవృక్ష మహామహుల నీడలో సేదతీర్చుకో
బుద్ధిప్రకాశం
ఆత్మవికాసం
ఆత్మానందం నీసొంతం.

కళ్ళు తెరిచాను
ప్రపంచం నందనవనం
ముందున్నది నవజీవనం.
కలయా? నిజమా? వైష్ణవమాయా?
ఈ నిమేషం నవనవోన్మేషం.
ఈ మానుషం భగవదనుగ్రహం.

అయినా
బుద్ది: కర్మానుసారిణి
రానున్నది రాకమానదు
కానున్నది కాకమానదు.

కృష్ణా ! యదుభూషణా !

August 24, 2010

రాఖీ.

బస్టాపులో రాక్షస ఇంద్రులు
వెయ్యి కళ్ళతో
అంగాంగ వర్ణన
వర్ణనాతీతం

తాకిడిని తడిమే చేతులని
భరిస్తూ సహిస్తూ
బస్సు ప్రయాణం
ప్రతిరోజూ ఆలస్యం
ఆడవారి ఉద్యోగం
నాకందుకే అసహ్యం
చిన్నబాసు భాష్యం

లోపలనే సంతకం
బహిరంగ రహస్యం
యజమాని లోకువగా అపహాస్యం
గుడ్లనీరు నోటకొంగు కుక్కుకొని
అవమానం భరించే అసహాయత్వం
ఎందుకిలా చచ్చింది మానవత్వం

కట్టించండి వీరిచే రక్షాబంధనం
కట్నంగా కోపాగ్నిని రగిలించే ఇంధనం
ఎదిరించే శక్తీ
వెట్టి నించి విముక్తి

సహనంతో ప్రేమతో సేవతో
ఒళ్ళు తుడిచి పుళ్లు కడిగి
మందుపూసి కట్టుకట్టి
మాత్ర వేసి సేద తీర్చి
నయిటిన్గేల్ వెళుతుంటే
వయోభేదం లేని రోగులు
ముసలినక్క
యువకకుక్క
ద్వందార్థ భాషణం
అత్యంత దారుణం
ఈ మానసికరోగుల కు
ఉన్న నాలికకు మందేసి
కొండనాలిక పోగొట్టాలి
చితక్కొట్టి విరక్కొట్టి
రాఖీలు వీరిచే కట్టించాలి

కాలేజీ వయసులోనే
మారేజీ ప్రపోసల్
తన మానాన తను వెళితే
తన నాన్నకు తను చెబితే
నువ్వేం చేశావని గద్దించి
తల వంచుకు నడవమని
తనలోనే ఏడవమని
తండ్రి తరహా
తల్లి సలహా

గొంతు కోసి
యాసిడ్ పోసి
గుండెకు గాయం చేసే
ఈవ్ టీసర్స్ ఆట కట్టించే
బ్రేవ్ సోల్జర్స్ కు
కట్టండి రాఖీలు

అన్నదమ్ముల రక్షణ శిక్షణ
వదినామరదళ్ళ సంరక్షణ ఆదరణ
అక్కాచెల్లెళ్ళ అనురాగం అభిమానం
సుగంధ చందనం
రక్షాబంధనం