భారంగా ఉదయపు నడక. ప్రారబ్ధపు ప్రారంభం.
దూరంగా కాళ్ళీడుస్తూ పిల్లాజెల్లాతో బీదకుటుంబపు సంరంభం.
మాట కలిపితే నాకు మార్గాయాసం తగ్గుతుందా
వాడి మూట మోసే భారాయాసం దక్కుతుందా.
తర్జన భర్జన తర్వాత తర్జనితో గర్జన చేసి పిలిచి కాలు,మాట కలిపాను.
ఆహ్లాదంగా వినీలాకాశం,సూర్యచంద్రులు,తొంగిచూసే తళుక్కుతారలు.
మది పులకించిమధురోహలలో నేను.
ఎలా ఉందోయ్?!!!
పైనెవరో రోజంతా కట్టపడి పన్జేసి, పట్టెమంచం మీద చిరిగిన బొంత కప్పుకోని ,అలిసి తొంగుంటే కన్నాలు తొంగి సూత్తండాయ్.
ఓహో ఓహో
చిరు తొలకరి జల్లు సన్నగా చల్లగా స్పర్శిస్తుంటే
ప్రాణసఖి ఆప్యాయంగా మెత్తగా తడి పొడిగా తడిమిన భావన.
ఏమోయ్?!!!
మేందిన్న తర్వాత,చిన్నోడు చాల్లేదంటే,తనకు మిగలకుంటే, పడుకొన్నాక అటుతిరిగి శోకంబెట్టి,ఇటుదిరిగి వీపు చెమ్మ చేసద్దండి మా ఆడది.
సరే సరే.
ఎండావానా కలయికతో రమ్యమయిన రంగురంగుల ఇంద్ర ధనుస్సు.
శివచాప ఖండనం, సీతా కళ్యాణం గుర్తొచ్చి పారవశ్యం.
అదెలా ఉందో ?!!!
ఆ విల్లు సూత్తంటే దాన్తో ఒక కుందేలునో పిట్టనో కొట్తినా !! .ఓ పూట తిండి గడుచుద్దిగా అనిపిస్తందండి.
భలే భలే
విశాలమైన రహదారి.తగ్గిన వాహనాలు,చప్పుళ్లు, కాలుష్యం .ఏదో సాధించిన మానసికానందం
ఇప్పుడు చెప్పు!!!!
మా ఊరి డొంకలో ,పట్నంబస్సు కోసం, ఒంటరి ఆడమడిసి నడిస్తే , నగానట్రా ఒలిసేసి, చెఱిచిన శవం తుప్పల్లోనేనయ్యా.
బాబోయ్ బాబోయ్
అటువైపు ,దూరంగా కర్మాగారపు పొగగొట్టం. సన్నగా పైకెగువస్తున్న మంటలు,పొగ. ఇది కదా
సమృధ్ధి,అభివృద్ధి.
చూశావా?!!!
అగ్గిసూత్తే గుర్తొస్తది , ఎండాకాలమొత్తే పాకలు తగలడ్తాయేమోనని దూరానికెళ్ళొచ్చి నీళ్ళు
గాబుల్లో నింపాల్బాబు బయ్యంబయ్యంగా.
చాలుచాలు.
ఈ రసికుడు కాని మూర్ఖుడితో ఇంకా నాలుగడుగులు నడిస్తే వాడి పామరత్వం, పశుత్వం పాముకోవడమే. ఛీఛీ.
మీకూ అలాగే అనిపిస్తోందిగా ?!!!
4 comments:
This is the best one yet Nanna! Loved it!
Very beautiful, Babai. We demand more!
Great way to present the contrasting viewpoints Babai. Roxy lo Norma Shearer gurtu vachindi.
English version ae bavundi anukunna - telugu lo bhavam inka baaga baitikochindi :)
The mood was heavy but i found comfort in your words - great poem nanna!
Post a Comment