December 7, 2019

శేష ప్రశ్న? తుది జవాబు

ప్రస్థానం గమ్యం చేరేనా ?
నిశీధి దివస్సుగ మారేనా?
తమస్సు ఉషస్సును ప్రసవించేనా?
మరో నాకం మరోలోకం ప్రభవించేనా?

అల్లర్లు అలజడులు గడచినడచి
వడగళ్ళు కడగళ్ళు తడిచితరచి
ముష్కరమూకల కర్కశకేకలు వెరచిమరచి
జడివానల పసికూనలు
కనులు తెరచి ఒడలు విరిచి
బట్టకట్టి కట్టు కట్టి
కరం కలిపి భయం విడిచి
ఉద్వేగం రేగేనా? వేగంగా సాగేనా?

రారండి రారండి మీరంతా మారండి
మనమంతా జనమంతా జగమంతా చేరండి
భుజం చరిచి వెన్ను తట్టి 
దన్నుగా నిలిచి రొమ్ములు విరిచి
స్వాగతించి హారతిచ్చి పిలవండి కలవండి

ఊకదంచి రూకపంచి 
వరహాలనుదోచే వరాహాల బతుకురోత
కామాంధుల రాబందుల పీచమడచి ఊచకోత
అవినీతికి సమవర్తి
నిజాయితీ హృదయార్తి
దుర్నీతుల దుర్నేతల హాహాకారం హృదయంగమం
స్వేచ్ఛా విహంగ సమాగమం

కులం వద్దు కలం ముద్దు
మతం రద్ధు నభం హద్ధు
అకృత్యాల సుకృతాల జమాపద్దు

నవలోకం నవశకం జనగీతం జయధ్వానం
యువతరం నవతరం సులభతరం
లేద(నిర)భ్యంతరం శుభకరం.





2 comments:

gopal said...

నాకం= స్వర్గం నభం=ఆకాశం సమవర్తి =యముడు

gopal said...

పిలవండి కొలవండి గా చదువుకొని ప్రార్ధన